తెలంగాణ

telangana

Cricket In Olympics Benefits : ఒలింపిక్స్​లో 'క్రికెట్'​.. ఎన్ని లాభాలో.. ఏకంగా రూ. 15 వేల కోట్లు!

By PTI

Published : Oct 16, 2023, 4:36 PM IST

Cricket In Olympics Benefits : ఎన్నో క్రీడలు.. మరెన్నో దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పతకాల కోసం పోటీపడే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కింది. 2028 లాస్ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. అయితే ఒలింపిక్స్​లో క్రికెట్​ శాశ్వతంగా స్థానం సంపాదించుకుందా? క్రికెట్​ను చేర్చడం వల్ల ఐఓసీకి లాభమేంటి? ప్రసార హక్కుల ధరకు రెక్కలు రానున్నాయా? అమెరికాలోనే జరిగే 2024 టీ20 వరల్డ్​ కప్.. ఒలింపిక్స్​లో క్రికెట్​కు​ ఊతమివ్వనుందా?

Cricket In Olympics Benefits
Cricket In Olympics Benefits

Cricket In Olympics Benefits : విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ అంటే అభిమానుల్లో అంచనాలు.. ఆసక్తి పతాక స్థాయిలో ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఈవెంట్​లో భారత అథ్లెట్లు బరిలో దిగుతున్నప్పుడు ఫ్యాన్స్‌ కళ్లన్నీ వారిపైనే. అలాంటిది ఈ క్రీడల్లో క్రికెట్‌ను చేరిస్తే.. వినడానికే చాలా థ్రిల్లింగ్​గా ఉంది కదా! 2028 లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో ఇది నిజం కాబోతోంది. లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించగా.. ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

Cricket In Olympics 2028 :అయితే లాస్ ​ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చడం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీకి లాభాలేంటి? 2028లోనే కాకుండా ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్​లో కూడా క్రికెట్​ స్థానం సంపాదించుకున్నట్లేనా? అమెరికాలోనే జరిగే 2024 టీ20 వరల్డ్​ కప్.. లాస్​ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో క్రికెట్​కు​ ఊతమివ్వనుందా? ప్రసార హక్కులకు రెక్కలు రానున్నాయా? ఒలింపిక్స్​ ద్వారా ఫుట్​బాల్​కు ఉన్నంత క్రేజ్ క్రికెట్​​ సంపాదిస్తుందా? చివరిసారిగా 1900లో ఏం జరిగింది? వీటిన్నంటిపై నిపుణులు ఏమంటున్నారు?

క్రికెట్​ అంటే చాలు.. ఉర్రూతలూగిపోవుడే!
Cricket In Olympics : క్రికెట్‌ అంటే ఉర్రూతలూగిపోతారు చాలా దేశాల్లోని అభిమానులు. ముఖ్యంగా ఆసియా ఖండ దేశాల్లో క్రికెట్‌ను ఓ మతంగానే భావిస్తారు. అమెరికాతో పాటు ఐరోపాలోని చాలా దేశాల్లో క్రికెట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫుట్‌బాల్‌ను మాత్రమే చూసిన అక్కడి అభిమానులు ఇప్పుడు క్రికెట్‌ వైపు కన్నేస్తున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రపంచంలో ఫుట్​బాల్​ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న అతి పెద్ద క్రీడగా క్రికెట్‌ అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు 2.5 బిలియన్ల అభిమానులు ఉండగా.. అందులో 70 శాతం భారతీయులే ఉంటారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఒలింపిక్స్​లో క్రికెట్​కు స్థానం కల్పించడం వల్ల వాణిజ్య పరంగా, క్రీడా పరంగా అనేక లాభాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్​ కన్నా క్రికెట్​కు ఒలింపిక్సే అతి పెద్ద వేదికగా వర్ణిస్తున్నారు.

అమెరికాలో 2024 టీ20 వరల్డ్​ కప్​.. ఒలింపిక్స్​కు ఊతం!
T20 World Cup 2024 Schedule : "ఒలింపిక్స్​లో క్రికెట్​ భాగం కావడం ఒక అద్భుతమైన వార్త. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు ఉన్న ఇమేజ్​ కచ్చితంగా పెరుగుతుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐసీసీ చేపట్టిన ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నాను. లాస్​ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో టీ20 ఫార్మాట్​లో క్రికెట్​ జరగడం యువ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది. 2024లో అమెరికాలోనే టీ20 ప్రపంచ కప్​ జరగడం.. లాస్​ఏంజిలెస్​ ఒలింపిక్స్​లోని క్రికెట్​కు ఊతమిస్తోంది" అని కరీబియన్​ అసోసియేషన్​ ఆఫ్​ నేషనల్​ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు కీత్​ జోసెఫ్​ తెలపారు.

ఫుట్​బాల్​కు ఉన్నంత క్రేజ్​ సంపాదిస్తుందా?
Cricket Vs Football Popularity In World : ఒలింపిక్స్​లో క్రికెట్​ చేర్చడం వల్ల ఫుట్​బాల్​కు సమానంగా క్రికెట్​ క్రేజ్​ సంపాదించనుందని ఫ్యాన్స్​ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిని నిపుణులు ఖండిస్తున్నారు. అన్ని క్రీడలను ఆదరణ ఉంటుందని.. అయితే ఒక్కసారిగా క్రికెట్​కు ఫుట్​బాల్​ ఉన్నంత క్రేజ్​ పెరిగిపోవడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. అందుకు ఉదాహరణలు కూడా ఇస్తున్నారు.

అదేంటంటే?..ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లోని పురుషుల విభాగంలో 87 దేశాలు ఉండగా.. మహిళల విభాగంలో 66 దేశాలు ఉన్నాయి. మరోవైపు, ఫిఫా(ఫుట్​ బాల్​) ర్యాంకింగ్స్​లోని పురుషుల విభాగంలో 207 పురుషుల జట్లు, మహిళల విభాగంలో 186 దేశాలు ఉన్నాయి. ఈ రెండు ర్యాంకింగ్స్ మధ్య ఉన్న తేడానే పై సమాధానానికి నిపుణులు ఉదాహరణలుగా చెబుతున్నారు.

ఒలింపిక్స్​లో క్రికెట్​ శాశ్వతంగా స్థానం సంపాదించుకుందా?
Brisbane Olympics Cricket :లాస్​ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో క్రికెట్​ను ప్రవేశ పెట్టడం మంచిదేనని.. అమెరికాలో ఆ క్రీడకు అభిమానులు భారీగా ఉన్నారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఒలింపిక్స్​లో క్రికెట్​ శాశ్వతంగా స్థానం సంపాదించనట్లు కాదని ఆయన చెప్పారు. 2032లో ఆస్ట్రేలియాలో జరిగే బ్రిస్​బేన్​ ఒలింపిక్స్​లో కూడా క్రికెట్​కు స్థానం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆసీస్​ క్రికెట్​ సంప్రదాయ దేశం కనుక.. అక్కడ జరిగే ఒలింపిక్స్​లో క్రికెట్​ ఆడిస్తే ఆటకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.

డోపింగ్​ పరీక్షకు ఆటగాళ్లు నో!
Olympic Athlete Rules : ఒలింపిక్స్​లో క్రికెట్​ను తిరిగి తీసుకురావడానికి అనేక అడ్డంకులను అధిగమించాల్సి వచ్చందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. డోపింగ్​ పరీక్ష వంటి నిబంధనలకు ఆటగాళ్లు ముందు ఇష్టపడలేదని ఆయన చెప్పారు. 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ చివరిసారిగా జరిగినప్పుడు కూడా ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్లేయర్లు అందుకు అంగీకరించలేదని అన్నారు. కేవలం ఆటగా కాకుండా.. అభిమానుల ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకునే క్రికెట్​ను లాస్​ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో చేర్చి ఉంటారని మరొక అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రసార హక్కులకు రెక్కలు రానున్నాయా?
Olympics Broadcast Rights :ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ భావించినట్లు పలు వార్తా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 కోట్ల వరకు ఐఓసీ ఆర్జిస్తోంది. అయితే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం వల్ల ప్రసార హక్కుల విలువ భారీగా పెరిగిపోనుంది. సుమారు రూ.15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐఓసీకి లభించనున్నాయని అంచనా. దీన్ని బట్టే క్రికెట్‌ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రసార హక్కులే కాదు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో అభిమానుల వీక్షణ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఈ సమీకరణాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే క్రికెట్‌ను ఒలింపిక్స్‌ చేర్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

1900లో ఏం జరిగింది?
Cricket In Olympics History :1900 ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్‌ నిర్వహించారు. అదే తొలిసారి, చివరిసారి కూడా. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక్క జాతీయ ఆటగాడు కూడా లేడు. ఈ మ్యాచ్‌లో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడటం వల్ల ఫస్ట్‌క్లాస్‌ హోదా కూడా దక్కలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటన్‌ 117 పరుగులు చేయగా.. ఫ్రాన్స్‌ 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను 145/5 వద్ద బ్రిటన్‌ డిక్లేర్‌ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్‌ 26 పరుగులకే కుప్పకూలడంతో బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో నెగ్గింది. అప్పుడు బ్రిటన్‌కు రజతం, ఫ్రాన్స్‌కు కాంస్యం అందించారు. ఆ తర్వాత వీటిని పసిడి, రజత పతకాలుగా మార్చారు.

ఆమోదం ఎప్పుడు లభించింది?
Cricket In Olympics News :లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు శుక్రవారం ఆమోదించగా.. తాజాగా ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సదస్సులో ఓటింగ్ నిర్వహించారు. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఐదు క్రీడలను చేర్చాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details