తెలంగాణ

telangana

Delta variant: కొత్తకోరలు తొడుక్కుంటున్న మహమ్మారి

By

Published : Sep 24, 2021, 6:41 AM IST

delta variant
కరోనా డెల్టా వేరియంట్​

ప్రస్తుతం 185 దేశాల్లో కరోనా డెల్టా రకం(Delta Variant) కేసులు వెలుగు చూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. కరోనా వైరస్‌ ఆల్ఫా, బీటా, గామా, కప్పా... ఇవన్నీ అంత ఎక్కువగా వ్యాప్తి చెందకపోయినా, డెల్టా రకం(Delta Variant) అత్యంత వేగంగా విస్తరిస్తోంది. డెల్టా ఉత్పరివర్తనమే ప్రమాదకరంగా మారుతోందంటే, అందులోనూ రోజురోజుకూ మరిన్ని కొత్త రకాలు బయటపడుతూ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి.

ప్రపంచంపై డెల్టా రకం(Delta Variant) మళ్లీ కోరలు చాస్తోంది. ప్రస్తుతం 185 దేశాల్లో ఇది పాగా వేసిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(Who Delta Variant) తాజాగా హెచ్చరించింది. జూన్‌ 15 నుంచి సెప్టెంబరు 15 మధ్య సేకరించిన నమూనాల్లో 90శాతం డెల్టా కేసులే ఉన్నట్లు తన వారాంతపు నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్‌ ఆల్ఫా, బీటా, గామా, కప్పా... ఇవన్నీ అంత ఎక్కువగా వ్యాప్తి చెందకపోయినా, డెల్టా రకం(Delta Variant) అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో ఆల్ఫా, బీటా, గామా రకం కేసులు ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నాయని, ఇప్పుడు ఎక్కడ చూసినా డెల్టా(Delta Variant) చాలా తీవ్రంగా కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొవిడ్‌ సంబంధిత సాంకేతిక విభాగం అధిపతి మారియా వాన్‌ కెర్ఖొవ్‌ వెల్లడించారు. టీకాలు తీసుకోని వారితో పాటు, రెండు డోసుల టీకా తీసుకున్నవారికీ ఇది వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రయాణాలపై చైనా నిషేధం

డెల్టా ఉత్పరివర్తనమే ప్రమాదకరంగా మారుతోందంటే, అందులోనూ రోజురోజుకూ మరిన్ని కొత్త రకాలు(Delta Mutation) బయటపడుతూ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. వాటిలో ఏవై12 రకం కేసులు ఇజ్రాయెల్‌, ఇండియాల్లో వెలుగుచూస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో గుర్తించిన డెల్టా(Delta Variant) నమూనాల్లో 51శాతం ఏవై12 రకానివే. ప్రపంచంలో 2020 సెప్టెంబరు ఏడున తొలి ఏవై12 కేసును గుర్తించారు. అప్పటినుంచి ఈ ఏడాది ఆగస్టు 26 నాటికి 44 వేలకు పైగా నమోదయ్యాయి. భారత్‌లో ఈ సంవత్సరం ఆగస్టు 30న తొలి ఏవై12 కేసు ఉత్తరాఖండ్‌లో కనిపించింది. అప్పటినుంచి దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏవై12 కేసులు ఉన్నాయి. ఏవై12ని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రమాదకర రకంగా ప్రకటించింది. తొలిదశలో ఒక వ్యక్తికి కొవిడ్‌ వస్తే అదే ఇంట్లో ఉండేవారిలోని 20శాతం సభ్యులకే సోకింది. రెండో దశలో 80శాతం సభ్యులకు పాకింది. డెల్టా రకం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. డెల్టా సోకినవారిలో దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మందికి త్వరగా వ్యాపిస్తోందన్నది వైద్యరంగ నిపుణుల మాట.

చైనాలో డెల్టా కలవరం..

కొవిడ్‌కు పుట్టినిల్లయిన చైనాతో పాటు, అమెరికానూ డెల్టా(Delta Variant) వణికిస్తోంది. చైనాలో ఇప్పటికే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం, కేసులు ఎక్కువగా వస్తున్న నగరాల మూసివేత వంటి చర్యలు మొదలయ్యాయి. అక్టోబరు ఒకటి నుంచి వారం పాటు సెలవులు ఉండటంతో ఎక్కువమంది పర్యటనలకు వెళ్తుంటారు. వాటిని విరమించుకోవాలని చైనా అధికారులు సూచిస్తున్నారు. పర్యాటక స్థలాలతో పాటు జిమ్‌లు, వినోదకేంద్రాలనూ మూసివేశారు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్‌ నగరంలో ఇటీవలే కేసుల సంఖ్య పెరిగింది. రేవు పట్టణమైన షియామెన్‌లోనూ కొత్త కేసులు బయటపడ్డాయి. తీరప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పుతియాన్‌ పట్టణంలోనూ డెల్టా కేసులు వస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఆ మూడు ప్రాంతాలనూ మూసేశారు. అమెరికాలో వస్తున్న కేసులను నియంత్రించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం నూతన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, గుత్తేదారులు, వైద్యసిబ్బంది, 100 లేదా అంతకంటే ఎక్కువమంది పనిచేసే కార్యాలయాల సిబ్బంది తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని సూచించింది. లేకుంటే వారానికి రెండుసార్లు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని నిబంధనలు విధించింది. వైద్యసిబ్బంది సహా ముప్పు ఎక్కువగా ఉంటుందనుకునేవారికి బూస్టర్‌ డోసులూ ఇస్తామంటున్నారు.

అందరికీ అందని టీకా

పన్నెండేళ్లు దాటిన పిల్లలకు మాత్రమే టీకాలు(Vaccine For Kids) అందుబాటులో ఉండటంతో, ఆ వయసు లోపువారు కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లో చేరడం ఈమధ్యకాలంలో పెరిగింది. జనవరిలో ప్రతి లక్షమంది పిల్లల్లో 0.31 మందికే కొవిడ్‌ సోకగా, ఇప్పుడు 0.41 మంది పిల్లలకు వస్తోందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నిరోధక విభాగం తెలిపింది. టెక్సాస్‌లో డిసెంబరులో 163 మంది పిల్లలకే కొవిడ్‌ సోకగా, ప్రస్తుతం ఆ సంఖ్య 196కి చేరింది. అమెరికాలోనే అతి పెద్దదైన హ్యూస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న చిన్నారుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. పిల్లల్లో కొవిడ్‌ కేసులు ఎక్కువకావడం ఆందోళనకరమేనని జాతీయ వైద్యసంస్థ అధిపతి డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ పేర్కొన్నారు. పిల్లలకు కొవిడ్‌ సోకకుండా ఉండాలంటే పెద్దలంతా టీకాలు వేయించుకోవాలని సూచించారు. పాఠశాలలు తెరవడంపైనా అక్కడ సందేహాలు తలెత్తుతున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితులు ఇలా ఉంటే- ఇండియాలో ఇంకా మొదటిడోసు సైతం అందరికీ అందలేదు. రెండు డోసులు తీసుకున్నవారు 22 కోట్లలోపు. 12-18 ఏళ్లవారికి ఇప్పటికీ టీకా అందుబాటులోకి రాలేదు. మొదటి డోసు తీసుకున్న నాలుగు నెలలకల్లా ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) గణనీయంగా పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఫైజర్‌/బయోఎన్‌టెక్‌, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే రక్షణ ఆరు నెలలే ఉంటుందని బ్రిటిష్‌ పరిశోధకులు అంటున్నారు. బూస్టర్‌ డోసులు ఇస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నా, దేశంలోని వయోజనులందరికీ పూర్తిగా రెండు డోసులు ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది.

- రఘురామ్‌

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details