తెలంగాణ

telangana

వరద ముట్టడిలో నగరాలు- డ్రైనేజీ వ్యవస్థలే కారణాలు

By

Published : Sep 10, 2022, 9:59 AM IST

Causes of urban floods in India : నగరాల విస్తరణకు అనుగుణంగా అదే స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ జరగడం లేదు. మురుగు నీటికాలువల సామర్థ్యం తగినంతగా లేకపోవడం, చాలాచోట్ల వరదనీటి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల వర్షం కురిస్తే వరదలు ముంచెత్తుతున్నాయి.

causes of urban floods in india
వరద ముట్టడిలో నగరాలు- డ్రైనేజీ వ్యవస్థలే కారణాలు

Causes of urban floods in India : తాజా కుండపోత వానలకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం అతలాకుతలమైంది. భారత సిలికాన్‌ వ్యాలీ ప్రస్తుతం సింకింగ్‌ (మునిగిపోయిన) సిటీగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలనూ గతంలో వరదలు ముంచెత్తాయి. లోపభూయిష్ఠమైన పట్టణ ప్రణాళికలు, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థల వల్ల ఇటీవలి కాలంలో నగరాలు, పట్టణాలు కొద్దిపాటి వానలకే ముంపునకు గురవుతున్నాయి. వాననీరు, మురుగు కలగలిసి రోజుల తరబడి కాలనీలను ముంచెత్తుతుండటంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. దేశంలోని నగరాలు, పట్టణాల్లో శతాబ్దాలు, దశాబ్దాల నాటి పాత మురుగునీటి పారుదల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. చాలాచోట్ల అది శిథిలావస్థకు చేరుకుంది. నగరాల విస్తరణకు అనుగుణంగా అదే స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ జరగడం లేదు. మురుగు నీటికాలువల సామర్థ్యం తగినంతగా లేకపోవడం, చాలాచోట్ల వరదనీటి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల వర్షం కురిస్తే వరదలు ముంచెత్తుతున్నాయి.

తీవ్ర సమస్య
Reasons for floods in India : భారత్‌లోని నగరాలు, పట్టణాల్లో ప్రధాన రోడ్లు, కాలనీలు, వీధుల వెంట భూమి లోపల పైపులతో నిర్మించిన మురుగునీటి కాలువల (భూగర్భ డ్రైనేజీ) కన్నా, ఉపరితల కాలువలే అధికంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో అవి నిండిపోయి వాననీరు, మురుగు రోడ్లపైకి, వీధుల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రజలకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది. బయటకు వెళ్ళే మార్గం లేకపోవడంతో కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉంటోంది. ఆక్రమణల్లో కుంచించుకుపోయిన నాలాలు, చెరువులు పొంగి పరిసర కాలనీలను జలమయం చేస్తుంటాయి. వీటితో పోలిస్తే బహిరంగ కాలువలు నిండి వరద ముంచెత్తుతున్న ప్రదేశాల వైశాల్యమే నగరాలు, పట్టణాల్లో అధికమని క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి.

జలమయం అయిన బెంగళూరు రోడ్లు

మెట్రో పాలిటన్‌ కాని నగరాల్లో అరవై శాతం గృహాలు బహిరంగ కాలువలతోనే అనుసంధానమై ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ గతంలో వెల్లడించింది. దేశంలోని 416 నగరాల్లో 20శాతం కన్నా తక్కువ గృహాలు మాత్రమే భూగర్భ డ్రైనేజీతో అనుసంధానత కలిగి ఉన్నాయి. దేశంలోని ఎనిమిది నగరాల్లో మాత్రమే 80శాతం గృహాలకు భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం ఉందని ఆ నివేదిక కుండ బద్దలుకొట్టింది. మైసూరు నగరం పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ సౌకర్యం సాధించింది. పారిశుద్ధ్య మెరుగుదలకు, వరద నివారణకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ వ్యవస్థలో భూగర్భ సొరంగాల ద్వారా గృహాలు, పరిశ్రమల నుంచి వెలువడిన మురుగునీరు నేరుగా శుద్ధి కేంద్రాలలోకి చేరుతుంది. అక్కడ శుద్ధి చేసిన జలాన్ని చెరువులు, నదుల్లోకి పంపిస్తారు. బహిరంగ కాలువల ద్వారా ప్రవహించిన మురుగునీరు పట్టణాలు, నగరాల శివార్లలో మురుగు నీటి కుంటలుగా ఏర్పడి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.

ఇంట్లోకి వరద నీరు

ముంబయి నగరంలో 2000 కిలోమీటర్ల మేర ఉపరితల కాలువలు, 440 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే భూగర్భ డ్రైనేజీలు విస్తరించి ఉన్నాయి. చాలా కాలువలు గంటకు 25 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకొంటాయి. 2005లో ముంబయిలోని ముంపు సమస్య ప్రాంతాల్లో వరద నీటిని తోడే పంపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినా, పరిస్థితి మెరుగుపడలేదు. దిల్లీలో 1976 నాటి డ్రైనేజీ మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటికీ అమలులో ఉంది. 2016లో నూతన బృహత్‌ ప్రణాళికను రూపొందించినా, నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. చెన్నైలో పూడుకుపోయిన డ్రైనేజీలే వరదలకు కారణమై అధిక నష్టం కలిగించాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌ నగరంలో 5000 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉంది. ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. రూ.3700 కోట్లతో భాగ్యనగరంలో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణలో తీవ్ర జాప్యంతో ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సైతం ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

బెంగళూరును ముంచెత్తిన వరద

దశలవారీగా...
నగరాలు, పట్టణాల్లో దశాబ్దాల క్రితంనాటి మురుగునీటి పారుదల వ్యవస్థనుతొలగించి విశాలమైన, సురక్షితమైన, ఆధునికమైన భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యమివ్వని నగర విస్తరణ ప్రణాళికలే దానికి ప్రధాన కారణం. పట్టణాలు, నగరాల్లో ఉపరితల కాలువలను మురుగునీటి శుద్ధి వ్యవస్థతో అనుసంధానించి వాటిని కాంక్రీట్‌తో మూసివేయాలి. వరదనీరు వెళ్ళడానికి వీలుగా వాటిపై ఛాంబర్లను ఏర్పాటు చేయాలి. వరద కాలువల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరమూ ఉంది. ఉపరితల కాలువలను తొలగించి నగరాల్లో, పట్టణాల్లో దశల వారీగా భూగర్భ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి.

బెంగళూరులో వరద సహాయక చర్యలు

జపాన్‌ రాజధాని టోక్యోలో జి-క్యాన్స్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అన్ని నగరాలకు ఆదర్శనీయమని నిపుణులు చెబుతున్నారు. నగరాల చిత్తడి నేలలు క్షీణతకు గురి కాకుండా డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, అభివృద్ధి జరగాలని నీతి ఆయోగ్‌ ‘వరద నివారణ వ్యవస్థల నిర్వహణ వ్యూహాలు’ నివేదికలో స్పష్టం చేసింది. ఎత్తయిన ప్రదేశాల నుంచి లేదా తక్కువ ఎత్తు ప్రదేశాల నుంచి అయినా వరద నీరు దాని గమ్యస్థానం చేరేలా భూగర్భ డ్రైనేజీలు నిర్మించాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సు శిరోధార్యం. వరద విపత్తుల నుంచి నగరాలు బయటపడాలంటే పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించుకోవడం అత్యావశ్యకం.

అసోంలో వరదలు(పాత చిత్రం)

కొరవడిన అనుసంధానత
మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో ప్రణాళికారాహిత్యం, డిజైన్‌ లోపాలు, జనాభాకు తగినట్టుగా విస్తరణ, సామర్థ్య లేమి, ఆధునికీకరణ సాంకేతికత వినియోగంలో అలసత్వం- విపత్తుల సమయంలో డ్రైనేజీ వ్యవస్థ ఘోర వైఫల్యానికి కారణమవుతున్నాయి. వరద నీటిని పట్టణాలు, నగరాల బయటకు పంపించే ప్రధాన, అంతర్గత కాలువలకు చాలాచోట్ల అనుసంధానత లేకపోవడం వల్ల వీధుల్లో నీరు నిలిచిపోతోంది. రోడ్ల నిర్మాణంలో మురుగు నీటి పారుదల వ్యవస్థకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికను తొలగించకపోవడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి కొద్దిపాటి వానకే వరద సమస్య తలెత్తుతోంది. చెరువుల్లోకి, నదుల్లోకి చేరుతున్న మురుగునీరు వాటిని కాలుష్య కాసారాలుగా మారుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details