తెలంగాణ

telangana

122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా- ఉక్రెయిన్​తో యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే!

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 7:22 AM IST

Updated : Dec 30, 2023, 7:58 AM IST

Russia Attack On Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్​ రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలన్నింటిపైనా శుక్రవారం భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 27 మంది పౌరులు మృతి చెందారు. 144 మందికి గాయాలయ్యాయి.

russia attack on ukraine
russia attack on ukraine

Russia Attack On Ukraine :ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భీకర దాడుల్లో 27మంది పౌరులు మరణించారు. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్​ రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలన్నింటిపైనా శుక్రవారం భారీ స్థాయిలో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 27 మంది మరణించగా, మరో 144 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద గగనతలదాడి అని ఉక్రెయిన్‌ వెల్లడించింది.

'ఈ రోజు రష్యా తన అమ్ములపొదిలోని ప్రతి అస్త్రాన్ని మాపై ప్రయోగించింది' అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్​(ఎక్స్​)లో తెలిపారు. గతేడాది నవంబరులో 96 క్షిపణులు, ఈ ఏడాది మార్చిలో 81 క్షిపణులు రష్యా ప్రయోగించిందని, ఆ తర్వాత ఆ స్థాయిలో మాస్కో దాడి చేయడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది. 'శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక సిబ్బంది, బాధిత కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ ప్రజలకు ఇది మరో చీకటి రోజు' అని తెలిపింది.

దాడులతో రష్యా పంపుతున్న సందేశాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలని ఉక్రెయిన్‌ విదేశాంగమంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపై చర్చలు జరుపుతున్న పార్లమెంట్​లు, చర్చలకు రష్యా సానుకూలంగా ఉందని వార్తలు రాస్తున్న ప్రసార మాధ్యమాలు ఈ శబ్దాలను ఆలకించాలని అన్నారు. భారీగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయాలని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు దిమిత్రి కులేబా.

'కవికి ఏడేళ్ల జైలుశిక్ష'
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తప్పుపట్టిన కవి కమార్దిన్‌కు మాస్కో జిల్లా న్యాయస్థానం గురువారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. 2022 సెప్టెంబరులో మాస్కోలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో కమార్దిన్‌ యుద్ధ వ్యతిరేక కవితలు వినిపించారని ప్రాసిక్యూషన్‌ అభియోగాలు మోపింది. ఆ కార్యక్రమంలో కమార్దిన్‌ కవితలను చదివిన యెగోర్‌ స్తోబాకు కూడా కోర్టు ఐదున్నరేళ్ల జైలుశిక్ష విధించింది.

గాజాపై దాడి, 35మంది మృతి
మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్‌ దూకుడు కొనసాగుతోంది. సెంట్రల్‌ గాజాలోని నుసెయ్‌రత్‌, మగాజి శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దక్షిణ గాజాలోని కువైట్‌ ఆసుపత్రి దగ్గర నివాస సముదాయంపైనా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

క్రిమియాలో ఉక్రెయిన్ దూకుడు- రష్యా సైనిక నౌకపై క్షిపణి దాడి- ఆ దేశంతో భారత్​ కీలక ఒప్పందం!

టెస్లా ఇంజినీర్​పై రోబో దాడి- బలంగా పట్టుకొని శరీరంపై గాయాలు చేసిన 'చిట్టి'!

Last Updated :Dec 30, 2023, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details