తెలంగాణ

telangana

జీతాల కోసం పైలట్ల బంద్​.. నిలిచిన 800 విమానాలు.. దిల్లీలో ప్రయాణికుల తిప్పలు

By

Published : Sep 2, 2022, 10:35 AM IST

Updated : Sep 2, 2022, 12:03 PM IST

జీతాలు పెంచాలని జర్మనీకి చెందిన ఓ ఎయిర్​లైన్ సంస్థ పైలట్లు బంద్​కు దిగారు. దీంతో శుక్రవారం మొత్తం 800 విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. అయితే ఫ్రాంక్​ఫర్ట్​, మ్యూనిచ్​ వెళ్లాల్సిన ప్రయాణికులు.. దిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. ఎయిర్​పోర్ట్​ ఎదుట ఆందోళనలు చేపట్టారు.

Germany's Lufthansa airlines
Germany's Lufthansa airlines

Pilot Strike lufthansa : జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా.. 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపు కోసం పైలట్ల యూనియన్ చేస్తున్న బంద్​ కారణంగా శుక్రవారం ప్యాసింజర్​తోపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. 1,30,000 మంది ప్రయాణికులపై విమానాల రద్దు ప్రభావం చూపుతుందని తెలిపింది.

ఈ ఏడాది 5.5 శాతం జీతాలు పెంచాలని లుఫ్తాన్సా పైలట్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్‌ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్‌ నిరాకరించడం వల్ల సమ్మె అనివార్యమైంది.

దిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఆందోళనలు..
దిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌కు వెళ్లాల్సిన రెండు లుఫ్తాన్సా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో సుమారు 150 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో డిపార్చర్ గేట్ నం.1, టెర్మినల్ 3, ఎయిర్​పోర్టు ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనలు చేపట్టారు. టికెట్ల డబ్బును వాపసు చేయాలని, లేదా తమ బంధువులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు దిగడం వల్ల ట్రాఫిక్​ సమస్య తలెత్తింది. దీంతో సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల బంధువులను అక్కడి నుంచి పంపేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:50 వేల మందితో రష్యా సైనిక విన్యాసాలు.. అమెరికా ఆందోళన

ఓవైపు వరదలు.. మరోవైపు అంటువ్యాధులు.. విలవిల్లాడుతున్న పాక్

Last Updated : Sep 2, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details