తెలంగాణ

telangana

ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?

By

Published : Aug 9, 2022, 9:37 AM IST

FBI raids on Trump home: అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

fbi raids on donald trump home in florida
fbi raids on donald trump home in florida

Trump FBI raids: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఆ దేశ ఫెడరల్ దర్యాప్తు సంస్థ(ఎఫ్​బీఐ) దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్​లో ఉన్న మార్-ఎ-లాగో నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. తన ఇంటిని పూర్తిగా నిర్బంధించారని చెప్పారు.

"ఇవి మన దేశానికి చీకటి రోజులు. నా అందమైన ఇంటిని నిర్బంధించి, సోదాలు చేసి ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు. గతంలో ఏ అధ్యక్షుడి విషయంలో ఇలాంటి దాడులు జరగలేదు. నా ఇంటిపై అప్రకటిత సోదాలు అనవసరం, అనుచితం. నా లాకర్లను సైతం పగులగొట్టారు. వాటర్​గేట్ ఘటనకు, దీనికి తేడా ఏంటి? అప్పుడు డెమొక్రాట్ నేషనల్ కమిటీ భవనంలోకి అధికారులు చొరబడితే.. ఈసారి డెమొక్రాట్లు అమెరికా 45వ అధ్యక్షుడి ఇంట్లోకి బలవంతంగా వచ్చారు. ఇలాంటి ఘటనలు మూడో ప్రపంచ (వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న) దేశాల్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు అమెరికా కూడా ఆ దేశాల్లో ఒకటిగా మారిపోవడం బాధాకరం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎఫ్​బీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తనను అడ్డుకునేందుకు డెమొక్రాట్లు ఇలా చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. 'న్యాయవ్యవస్థను ఆయుధంలా మార్చుకుంటున్నారు. డెమొక్రాట్లు నన్ను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి పోల్స్​ చూసి ఎలాగైనా రిపబ్లికన్లను నియంత్రించాలని అనుకుంటున్నారు. రాజకీయ కక్షసాధింపులో ఇది అత్యున్నత దశ! అమెరికా ప్రజల కోసం నేను పోరాడుతూనే ఉంటా' అని ట్రంప్ పేర్కొన్నారు.

రహస్య దస్త్రాల విషయంపైనే!
శ్వేతసౌధాన్ని వీడిన తర్వాత ట్రంప్ ఏవైనా రహస్య పత్రాలను తన వెంట తీసుకెళ్లారా? అన్న విషయంపై అమెరికా న్యాయ శాఖ విచారణ జరుపుతోంది. రహస్య దస్త్రాలను ఫ్లోరిడాలోని తన ఇంటికి తీసుకెళ్లి ఉంటారేమోనని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్​బీఐ సోదాలు జరగడం గమనార్హం. మరోవైపు, 2021 జనవరి 6 నాటి అల్లర్లపైనా ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించడం, క్యాపిటల్ భవనంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లేలా ప్రేరేపించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details