తెలంగాణ

telangana

జిన్‌పింగ్‌కు అగ్నిపరీక్ష.. చైనాలో ఏమిటీ 'తెల్ల కాగిత విప్లవం'?

By

Published : Nov 30, 2022, 8:17 AM IST

Updated : Nov 30, 2022, 8:55 AM IST

చైనా పాలకులకు తెల్లకాగితం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడైనా తెల్లకాగితంతో జనం కనిపిస్తే పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఎందుకలా..?

china white paper protest
చైనాలో తెల్లకాగితం విప్లవం

China White Paper Protest: చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన తర్వాత ఇవే అతిపెద్ద నిరసనలు. చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా మంది నేతలు చదువుకున్న ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో కూడా ఇవి చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రజలు తమ నిరసనలు తెలియజేయడానికి తెల్ల కాగితాలను గుర్తుగా ఎంచుకొన్నారు. దీంతో ఈ ఆందోళనలను 'తెల్లకాగితం ఆందోళనలు' లేదా 'ఏ4 విప్లవం'గా అభివర్ణిస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా ఈ ఆందోళనలను కఠినంగా అణచివేస్తోంది.

ఏ4 తెల్లకాగితాలు ఎందుకు..?
చైనాలో సాధారణంగా ఎటువంటి ఆందోళనలనైనా మొగ్గదశలోనే అణచివేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేయాలంటే తెల్లకాగితం ఉపయోగించడం ఒక్కటే మార్గం. దీంతోపాటు చైనాలోని సెన్సార్‌షిప్‌ను తెలియజేసేందుకు కూడా ఈ శ్వేతపత్రం గుర్తుగా ఉంటుంది. ఆందోళన సమయంలో వారు ఏమి తెలియజేయకుండానే విషయం అందరికీ తెలుస్తుంది. ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. 2020లో హాంకాంగ్‌ ఆందోళనల్లో కూడా తెల్లకాగితాన్ని గుర్తుగా వినియోగించారు. ఇప్పుడు నేరుగా చైనాలోని ఆందోళనలకు వీటిని వాడటం అక్కడి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

సోషల్‌ మీడియాలో భారీగా సెన్సార్‌.. పేపర్‌ కంపెనీల షేర్ల పతనం..!
ఈ తెల్లకాగితం ప్రదర్శనలను సోషల్‌ మీడియా నుంచి మాయం చేయడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనాలో టెక్‌ దిగ్గజాలైన టిక్‌టాక్‌, విబో వంటివి ఖాళీ తెల్లకాగితం చిత్రాలను తమ వేదికలపై నుంచి తొలగిస్తున్నాయి. ఈ ఉద్యమం ఎంతగా పెరిగిపోయిందంటే.. చైనాలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని ఆపేశారనే వదంతులు కూడా వ్యాపించాయి. ఫలితంగా అక్కడ ప్రముఖ స్టేషనరీ చైన్‌ స్టోర్ల సంస్థ 'ఎం అండ్‌ జీ స్టేషనరీ' షేర్లు 3.1శాతం పతనం అయ్యాయి.

ఈ సంస్థకు చైనా వ్యాప్తంగా 80,000 స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఏ4 కాగితాల విక్రయాన్ని నిలిపివేసిందనే వార్తలే దీనికి కారణం. చివరికి ఆ సంస్థ ఆ తప్పుడు వార్తలను ఖండించాల్సి వచ్చింది.గతంలో జూన్‌ 4వ తేదీన తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడాన్ని చైనా నిషేధించింది. దీంతో చైనా వాసులు ఆరోజుకు 'మే 35' అనే కోడ్‌నేమ్‌ పెట్టారు. తర్వాత దానిని కూడా చైనా నిషేధించింది. కానీ, వైట్‌పేపర్‌ విషయంలో చైనా చేయడానికి పెద్దగా ఏమీలేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ సారి ఆందోళనలు గతంలో కంటే బలంగా కొనసాగవచ్చని చెబుతున్నారు.

జిన్‌పింగ్‌కు అగ్నిపరీక్ష..
మూడోసారి అధికారం చేపట్టిన షీజిన్‌పింగ్‌కు ఈ ఆందోళనలు అగ్నిపరీక్షగా మారాయి. జీరో కొవిడ్‌ పేరిట నెలల తరబడి ప్రజలను ఇళ్లలోనే బంధిస్తుండటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్నాయి. ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్‌లో అభిమానులు మాస్కులు వంటివి లేకుండానే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

చైనాలో మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. దీనికి తోడు సెప్టెంబర్‌లో క్వారంటైన్‌ బస్సు ప్రమాదానికి గురై 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతనెలలో కొవిడ్‌ లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ఇటీవల షింజియాంగ్‌లో ఉరుంకీ నగరంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడం ప్రజాగ్రహాన్ని తీవ్రస్థాయికి చేర్చింది. ఈ నగరం దాదాపు 100 రోజుల నుంచి కఠిన లాక్‌డౌన్‌లో ఉంది. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్‌ లాక్‌డౌన్లను దాటి.. షీజిన్‌పింగ్‌ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.

Last Updated : Nov 30, 2022, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details