ETV Bharat / international

ఆంక్షల వేళ భారత్​ సాయం కోరిన రష్యా.. దిల్లీకి 500లకు పైగా ఉత్పత్తుల జాబితా!

author img

By

Published : Nov 30, 2022, 7:25 AM IST

russia requests india to deliever aircrafts parts
russia india

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను అడ్డుకునేందుకు అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో కార్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రైళ్ల విడిభాగాలతో పాటు పలు రంగాలకు సంబంధించిన ముడి పదార్థాలను పంపించాలని భారత్‌ను రష్యా కోరినట్లు సమాచారం.

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను అడ్డుకునేందుకు అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపించాయి. ఈ ఆంక్షల ప్రభావంతో రష్యాలో కీలక రంగాల కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి తలెత్తుతోంది. దీంతో మాస్కో.. భారత్‌ను సాయం కోరినట్లు తెలుస్తోంది. 500లకు పైగా ఉత్పత్తులను పంపించాలని క్రెమ్లిన్‌ కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కార్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రైళ్ల విడిభాగాలతో పాటు పలు రంగాలకు సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలు పంపించాలని రష్యా కోరినట్లు సమాచారం. ఈ మేరకు తమకు కావాల్సిన 500లకు పైగా ఉత్పత్తుల జాబితాను దిల్లీకి పంపించినట్లు సదరు కథనాలు తెలిపాయి. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందే రష్యా తన అభ్యర్థనను పంపించినట్లు తెలుస్తోంది. అయితే జైశంకర్‌ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చిందా? లేదా అన్నది తెలియరాలేదు. రష్యాకు భారత్‌ ఆ ఉత్పత్తులను ఎగుమతి చేసే విషయమై ఇరు దేశాల మధ్య మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దీనిపై భారత వాణిజ్య, విదేశాంగ మంత్రిత్వ శాఖలు గానీ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత.. రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. అయితే, భారత్‌ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించింది. ఇటీవల మాస్కో పర్యటనలో జైశంకర్‌ మాట్లాడుతూ.. "ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్యత తీసుకురావాలంటే.. రష్యాకు భారత్‌ ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆంక్షల కారణంగా రష్యాలో కొన్ని కీలక ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విదేశీ ఆటోమొబైల్‌ సంస్థలు మాస్కో మార్కెట్‌ నుంచి తరలిపోవడంతో కార్ల విడిభాగాల కొరత ఏర్పడింది. అటు ఎయిర్‌లైన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. పేపర్‌ బ్యాగులు, కన్స్యూమర్‌ ప్యాకేజింగ్‌, టెక్స్‌టైల్‌, నికెల్‌ వంటి లోహ పదార్థాలు కూడా సరిపడా అందుబాటులో లేవు. దీంతో ఆయా ముడిపదార్థాల కోసం రష్యా.. ఇప్పుడు భారత్‌ సహా కొన్ని దేశాలను సాయం కోరినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.