తెలంగాణ

telangana

చైనాలో కొవిడ్ ఆంక్షలు సడలింపు.. సందడిగా మారిన రెస్టారెంట్స్​, మాల్స్​

By

Published : Dec 2, 2022, 7:23 PM IST

China Zero Covid Policy : చైనాలో జీరో కొవిడ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన వేళ వెనక్కి తగ్గిన డ్రాగన్‌ ప్రభుత్వం ఆంక్షల చట్రాన్ని సడలిస్తోంది. ఫలితంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన చైనీయులు.. కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్వాంగ్జౌ నగరంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెస్టారెంట్లు, మాల్స్‌, ప్రజా రవాణా వ్యవస్థలు ప్రజలతో సందడిగా మారాయి. ఆంక్షల సడలింపులను కొందరు చైనీయులు సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

china covid
చైనాలో జీరో కొవిడ్ పాలసీ

China Zero Covid Policy : కరోనా కట్టడికి చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికిన వేళ ఆ దేశ అధికారులు వెనక్కి తగ్గారు. గ్వాంగ్జౌ సహా పలు నగరాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. గ్వాంగ్జౌ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల రోజులుగా ఇళ్లకే పరిమితమైన గ్వాంగ్జౌ పరిధిలోని 18లక్షల మంది ప్రజలు నిబంధనల సడలింపుతో బయటకు వస్తున్నారు. ఆంక్షల్లో భాగంగా రోడ్లపై ఏర్పాటు చేసిన బారిగేడ్లను అధికారులు తొలగిస్తున్నారు.

చైనాలో కొవిడ్ ఆంక్షలు సడలింపు

ట్రాఫిక్‌ నిబంధనలు ఎత్తివేయడం సహా ఇండోర్‌ డైనింగ్‌కు అనుమతిస్తుండడం వల్ల రెస్టారెంట్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. పలు మాల్స్ కూడా వినియోగదారులతో దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు క్యూలతో కనిపించిన నగరంలోని కరోనా పరీక్షా కేంద్రాలు, ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. కొత్తగా 6,312 కొవిడ్ కేసులు బయటపడినప్పటికీ నిబంధనల సడలింపుతో ప్రజలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. గ్వాంగ్జౌ నగర మెట్రో గతంతో పోలిస్తే ప్రయాణికులతో సందడిగా కనిపిస్తోంది.

బయటకు వచ్చిన చిన్నారులు

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డ్రాగన్‌ ప్రభుత్వం ఆంక్షల సడలిస్తుండడంపై చైనీయుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కనీసం ఒక వ్యాక్సిన్‌ కూడా తీసుకోని వ్యక్తులు.. ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన 80ఏళ్ల తల్లి గురించి ఆందోళన చెందుతున్నారు. 3వారాలకు ఒకసారి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని, బయట కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వాపోయారు. గ్వాంగ్జౌలోని ఓ రెస్టారెంట్‌ నిర్వాహకురాలు 41ఏళ్ల లిలి అనే మహిళ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. లాక్‌డౌన్‌ వల్ల తమ ఆదాయం 30శాతం మేర తగ్గిందని, ఆంక్షల సడలింపుతో.. ఊపిరి పీల్చుకుంటున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details