ETV Bharat / international

'యుద్ధంలో 13వేల మంది ఉక్రెయిన్‌ సైనికుల మృతి'

author img

By

Published : Dec 2, 2022, 3:46 PM IST

Updated : Dec 2, 2022, 3:55 PM IST

ukraine soldiers killed
ukraine soldiers killed

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రాణనష్టం భారీగా జరుగుతోంది. 13వేల మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులు మృతి చెందారని ఆ దేశాధికారులు వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. ఉక్రెయిన్‌ వైపు భారీ సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో పొడొల్యాక్‌ వెల్లడించారు. 10,000 నుంచి 13,000 మంది వరకు తమ సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం మొదలై దాదాపు తొమ్మిది నెలలు దాటినా ఇరు పక్షాల నుంచి మృతుల సంఖ్యపై కచ్చితమైన వివరాలు వెలువడలేదు. మైఖైలో జూన్‌లో ఒక సారి మాట్లాడుతూ యుద్ధంలో ప్రతి రోజు 100 నుంచి 200 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ మృతుల సంఖ్యను పారదర్శకంగా చెబుతుందని పేర్కొన్నారు."మా కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ అధికారికంగా మూల్యాంకనం చేస్తారు. వారి లెక్క ప్రకారం మృతుల సంఖ్య 10,000-13,000 మధ్యలో ఉంది" అని పేర్కొన్నారు. పౌరుల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. రష్యా వైపు లక్ష మంది మరణించగా.. మరో లక్షన్నర మంది గాయపడి ఉంటారని పేర్కొన్నారు.

మరోవైపు గత నెల అమెరికా సైనిక జనరల్‌ మార్క్‌ మిల్లీ మాత్రం పూర్తిగా భిన్నమైన సంఖ్యను చెప్పారు. వారి లెక్కల ప్రకారం సుమారు లక్ష మంది రష్యా సైనికులు చనిపోగా.. ఉక్రెయిన్‌ వైపు కూడా లక్ష మంది మరణించడమో.. గాయపడటమో జరిగిందన్నారు. ఐరోపా కమిషన్‌ అధిపతి ఉర్సులా వొన్‌డెర్‌ లెయెన్‌ కూడా బుధవారం మాట్లాడుతూ లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని వెల్లడించారు. దాదాపు 20,000 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఆమె ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అది పొరబాటున చెప్పిన అంకె అని సవరించారు. ఇరువైపుల మొత్తం లక్ష మంది మరణించారని చెప్పారు.

జెలెన్‌స్కీని కలిసిన బేర్‌గ్రిల్స్‌..
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్‌ బేర్‌ గ్రిల్స్ ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని బేర్‌ గ్రిల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఈ వారం నేను ఉక్రెయిన్‌లోని కీవ్‌కు వెళ్లి అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశాను. ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క మౌలిక వసతులపై దాడులు జరుగుతున్న సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం రోజువారీ పోరాటమే. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటి వరకు చూడని జెలెన్‌స్కీని చూస్తోంది" అని గ్రిల్స్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'అత్యాచారాలకు ప్రోత్సహిస్తున్న రష్యన్ భార్యలు'.. జెలెన్‌స్కా ఆవేదన..

ఆంక్షల వేళ భారత్​ సాయం కోరిన రష్యా.. దిల్లీకి 500లకు పైగా ఉత్పత్తుల జాబితా!

Last Updated :Dec 2, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.