తెలంగాణ

telangana

Canada Diplomats India : భారత్​ వార్నింగ్​కు తలొగ్గిన కెనడా.. 41 మంది దౌత్యవేత్తలు వెనక్కి..

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 10:16 AM IST

Updated : Oct 20, 2023, 12:51 PM IST

Canada Diplomats India : భారత్​ ఇచ్చిన వార్నింగ్​కు కెనడా ప్రభుత్వం తలొగ్గింది. దేశంలో పనిచేస్తున్న 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్​ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి మెలాని జోలి వెల్లడించారు.

canada diplomats india
canada diplomats india

Canada Diplomats India :భారత్​లో పనిచేస్తున్న 41 మంది దైత్యవేత్తలను వెనక్కి రప్పించినట్లు అధికారికంగా ప్రకటించింది కెనడా. దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్​ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి మెలాని జోలి వెల్లడించారు. భారత్​లో మొత్తం 62 మంది దౌత్యవేత్తలు ఉండగా.. వారిలోని 41 మందితో పాటు సిబ్బంది, కుటుంబ సభ్యులను వెనక్కి పిలిచినట్లు తెలిపారు. మిగిలిన 21 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్​లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

India Canada Diplomatic War : కెనడా దౌత్యవేత్తలకు రక్షణను ఏ క్షణమైనా తొలగిస్తామని భారత్​ తెలిపిందని.. ఈ నేపథ్యంలో వారి భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు మంత్రి జోలి. ఇందుకోసమే వారి సిబ్బంది, కుటుంబాన్ని వెనక్కి పిలిచామని వివరించారు. ఇలా దౌత్యవేత్తల రక్షణను ఉపసంహరించుకోవడం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు, ముఖ్యంగా జెనీవా ఒప్పందానికి పూర్తిగా విరుద్ధమని చెప్పారు. భారత్ చేసిన విధంగా కెనడా చేయబోదని తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరు దేశాల్లోని పౌరులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. భారత్​లోని మూడు నగరాల్లో ఉన్న తమ దేశ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Canada Embassy In India :అయితే, దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్‌ విదేశాంగ శాఖ.. దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబరు 10వ తేదీ వరకు భారత ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించిందని వార్తలొచ్చాయి. అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది.

వీసా ప్రక్రియపై ప్రభావం
కెనడాతో నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన.. అందరూ ఊహించినట్లుగానే భారతీయుల వీసా దరఖాస్తు ప్రక్రియపై పడనుంది. భారతీయుల వీసా దరఖాస్తుల ప్రక్రియ.. ఇకపై మందగమనంగా సాగవచ్చని ఇమ్మిగ్రేషన్‌, రిఫ్యూజీస్‌ అండ్‌ సిటిజెన్‌షిప్‌ కెనడా (IRCC) ప్రకటించింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలను ఏకపక్షంగా తరలించడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారత్‌లోని తమ 27మంది సిబ్బందిని ఐదుగురికి తగ్గిస్తున్నట్లు IRCC ప్రకటనను విడుదల చేసింది. భారతీయుల నుంచి వీసా దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తామని.. అయితే ఉద్యోగుల కొరత వల్ల ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని తెలిపింది. భారతదేశం నుంచి వచ్చిన చాలా ఎక్కువ అప్లికేషన్లను ఇప్పటికే దేశం వెలుపల ప్రాసెస్ చేశామని.. 89 శాతం దరఖాస్తు ప్రక్రియను గ్లోబల్‌ నెట్‌వర్క్ ద్వారానే పూర్తి చేసినట్లు IRCC తెలిపింది. ఇండియాలో ఉన్న మిగిలిన ఐదుగురు సిబ్బంది అత్యవసర ప్రాసెసింగ్‌, వీసా ప్రింటింగ్‌, రిస్క్‌ అసెస్‌మెంట్‌ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారని వివరించింది.

Khalistan Nijjar Killed : 'నిజ్జర్​ హత్యలో చైనా ఏజెంట్ల ప్రమేయం.. ఇండియన్ ఇంగ్లిష్ నేర్చుకొని మరీ..'

Canada Reaction On Indias Ultimatum : 'భారత్​తో తెరవెనుక మంతనాలకు కెనడా సిద్ధం!'

Last Updated :Oct 20, 2023, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details