తెలంగాణ

telangana

Blinken China Visit : అమెరికా-చైనా విదేశాంగ మంత్రుల భేటీ.. ఐదేళ్ల తరువాత పర్యటన..

By

Published : Jun 18, 2023, 10:52 PM IST

Blinken China Visit : చైనా-అమెరికా మధ్య సంబంధాలు తిరిగి పూర్వస్థితికి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి దాదాపు ఐదేళ్ల తర్వాత బీజింగ్‌కు వెళ్లారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్.. చైనా విదేశాంగ మంత్రి గాంగ్ మధ్య విసృత స్థాయి సమావేశం జరిగింది.

antony-blinken-china-visit-held-an-extended-round-of-talks-with-qin
చైనా విదేశాంగ మంత్రి గాంగ్​

Blinken China Visit : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్.. చైనా విదేశాంగ మంత్రి గాంగ్​ మధ్య విసృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తైవాన్​ సమస్య, ఉక్రెయిన్​ యుద్ధంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. రక్షణ రంగంలోనూ ఇరుదేశాల సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే నిర్ణయానికి.. వచ్చినట్లు సమాచారం. అనంతరం విదేశీ విధాన సీనియర్‌ అధికారి వాంగ్‌యితో కూడా బ్లింటన్​ భేటీ కానున్నారు. ఈ సమావేశాలతో చైనా-అమెరికా మధ్య సంబంధాలు తిరిగి పూర్వస్థితికి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్​.. ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్​కు చేరుకున్నారు. దాదాపు ఐదేళ్ల తరువాత అమెరికాకు చెందిన ఓ అత్యున్నతస్థాయి దౌత్యాధికారి.. తొలిసారి చైనాను సందర్శించారు. రెండు రోజులపాటు చైనాలో బ్లింకన్​ పర్యటన జరగనుంది. అమెరికా-చైనా మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ పర్యటన జరగడం ప్రాధాన్యం సంతరించుకొంది. వాస్తవానికి ఈ పర్యటన గతంలోనే జరగాల్సి ఉండగా.. చైనా నిఘా బెలూన్‌ ఘటనతో బ్లింకన్‌ పర్యటన నిలిచిపోయింది.

ఈ పర్యటన ద్వారా చైనా-అమెరికా మధ్య ఉన్నత స్థాయి కమ్యూనికేషన్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకపోతే ఇప్పటి పరిస్థితుల ప్రకారం భారీ మార్పులు చోటు చేసుకొనే అవకాశం మాత్రం లేదని అగ్రరాజ్య వర్గాలు బలంగా భావిస్తున్నాయి. ఈ పర్యటనలో బ్లింకన్‌ చైనా అధినేత షీజిన్‌పింగ్‌తో భేటీ అవుతారా లేదా అనే అంశంపై స్పష్టత కొరవడింది.

జో బైడెన్‌ 2021లో అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. చైనాను సందర్శిస్తున్న అత్యున్నత స్థాయి అమెరికా నేత బ్లింకెన్‌ కావడం గమనార్హం. తాము అనుకొంటే చేయగలమని.. చైనాతో ఉన్న పోటీని వివాదంగా మార్చదల్చుకోలేదని అని బ్లింకెన్‌ శుక్రవారం వెల్లడించారు. వచ్చే మరికొన్ని నెలల్లో తాను జిన్‌పింగ్‌ను కూడా కలిసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో ఇండోనేసియాలోని బాలీలో జిన్‌పింగ్‌, జోబైడెన్‌ భేటీ అయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.

యుద్ధానికి మేం సిద్ధం.. విదేశాలు అడ్డువస్తే అంతు చూస్తాం : చైనా ​
కాగా కొద్ది రోజుల క్రితం తైవాన్‌ సరిహద్దుల్లో మూడు రోజుల పాటు భీకర సైనిక విన్యాసాలు చేసిన చైనా ఆర్మీ.. యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన అనంతరం.. పోరుకు సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్‌ స్పష్టం చేసింది. జాయింట్‌ స్వార్డ్‌ పేరుతో నిర్వహించిన పోరాట విన్యాసాల అనంతరం.. డ్రాగన్‌.. తైవాన్‌తో పాటు ప్రపంచానికి గట్టి హెచ్చరిక పంపింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details