తెలంగాణ

telangana

'రక్తపాతం ముగిసింది.. ఇక అఫ్గాన్​ పునర్నిర్మాణమే'

By

Published : Sep 9, 2021, 8:19 PM IST

అఫ్గాన్ తాలిబన్​ ప్రభుత్వంలో(Taliban Government) ఆపద్ధర్మ ప్రధానిగా(Afghanistan Prime Minister) నియమితులైన మహమ్మద్​ హసన్ అఖుంద్​.. కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులు అఫ్గాన్​కు తిరిగి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే హడావుడిలో తాము లేమని అమెరికా స్పష్టం చేసింది. అయితే.. అమెరికా పౌరుల తరలింపు కోసం తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.

talliban government in afghan
అఫ్గాన్​లో తాలిబన్​ ప్రభుత్వం

అఫ్గానిస్థాన్​లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేసిన తాలిబన్ల నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి(Afghanistan Prime Minister) .. మహమ్మద్​ హసస్ అఖుంద్​... గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అఫ్గాన్​లో రక్తపాతానికి తెరపడిందన్న ఆయన... ప్రస్తుతం దేశ పునర్నిర్మాణం అనే కీలక ప్రక్రియ మిగిలి ఉందని చెప్పారు.

"ఈ చారిత్రక ఘట్టం కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డాము. భారీ మూల్యాన్ని మేం చెల్లించాం. పాత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు.. దేశంలోకి తిరిగి రావాలని మేం అభ్యర్థిస్తున్నాం. వారికి పూర్తి భద్రత కల్పిస్తాం. సుదీర్ఘ యుద్ధాలను ఎదుర్కొన్న దేశాన్ని పునర్నిర్మించే బాధ్యత మనపై ఉంది."

-ముల్లా మహమ్మద్​ హసన్ అఖుంద్​, అఫ్గాన్ ఆపద్ధర్మ ప్రధాని.

గత ప్రభుత్వంలో అమెరికా నేతృత్వంలో పని చేసిన అధికారులకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తామని గతంలో తాలిబన్లు చేసిన వాగ్దానాన్ని హసన్​ పునరుద్ఘాటించారు.

'అంత తొందర మాకు లేదు'

తాలిబన్ల ప్రభుత్వ గుర్తింపుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. వారి ప్రభుత్వాన్ని గుర్తించడంలో తాము హడావుడిగా లేమని తెలిపింది. అయితే.. అఫ్గాన్ నుంచి తమ పౌరులను తీసుకురావడం కోసం తాలిబన్లతో సంప్రదింపులు జరపుతామని చెప్పింది. ఈ మేరకు వైట్​హౌస్ ప్రెస్​ సెక్రెటరీ జెన్​సాకీ తెలిపారు.

"అధ్యక్షుడు కానీ, తమ ప్రభుత్వంలో ఇంకెవరైనా కానీ, తాలిబన్లు.. అంతర్జాతీయంగా గౌరవనీయులైన సభ్యులని భావించడం లేదు. తాలిబన్లపై సదభిప్రాయం ఏర్పడేలా వారు ఎప్పుడూ ప్రవర్తించలేదు. అఫ్గాన్​లో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. వారి కేబినెట్​లో నలుగురు మాజీ ఖైదీలు ఉన్నారు."

-జెన్ సాకీ, వైట్​హౌస్​ ప్రెస్​ సెక్రెటరీ.

"మేము వారిని గుర్తిస్తామని ఎప్పుడూ చెప్పలేదు. గుర్తించే హడావుడిలో కూడా లేము. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే ముందు వారు చేయాల్సింది చాలా ఉంది," అని జెన్​సాకి తెలిపారు. తాలిబన్ల కేబినెట్​లో.. అంతర్గత మంత్రిగా హక్కానీ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి ఉన్నారని జెన్​సాకి అన్నారు. అయినప్పటికీ.. అమెరికా ప్రజల తరలింపు కోసం వారితో సంప్రదింపులు తాము జరుపుతామని చెప్పారు. అప్గాన్​లోని పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.

'60 వేల మందిని తరలించాం'

ఆగస్టు 17 నుంచి ఇప్పటివరకు.. అఫ్గాన్ నుంచి దాదాపు 60,000 మందిని తమ దేశానికి తరలించామని అమెరికా హోం శాఖ తెలిపింది. వారిలో 17శాతం మంది అమెరికా పౌరులు కాగా.. మిగతా 83శాతం మంది విదేశీయులని చెప్పింది. అఫ్గాన్​లో అమెరికా, నాటో బలగాలకు సహకరించిన వారిని స్పెషల్​ ఇమ్మిగ్రెంట్ వీసాలు ఇచ్చి, తీసుకువచ్చినట్లు పేర్కొంది.

తొలి విమానం అదే...

200మంది అమెరికన్లు.. కాబుల్​ నుంచి ఖతార్​ విమానంలో బయలుదేరారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత కాబుల్​ విమానాశ్రయం నుంచి విదేశీయులతో వెళ్లిన తొలి విమానం ఇదే.

'మళ్లీ బలపడుతుంది..'

అమెరికాపై 20ఏళ్ల క్రితం దాడికి పాల్పడ్డ అల్-ఖైదా ఉగ్రసంస్థ.. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగిన నేపథ్యంలో మళ్లీ బలపడే అవకాశం ఉందని అగ్రరాజ్య రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. 'అది అల్​-ఖైదా నైజం' అని పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్​ దేశాల పర్యటనలో ఉన్న ఆయన... కువైట్​లో నిర్వహించిన ఓ విలేకరు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details