తెలంగాణ

telangana

Afghanistan News: 'నా దుస్తులు తాకొద్దు'.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం

By

Published : Sep 16, 2021, 10:02 AM IST

మహిళలు తప్పనిసరిగా బుర్ఖా ధరించాలన్న తాలిబన్ల ఆదేశాలపై (afghan taliban) బహార్​ జలాలీ అనే మహిళ సోషల్​ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. తాలిబాన్‌ ముష్కరుల ఆజ్ఞలను ధిక్కరిస్తూ రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి, ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

afghanistan taliban
నా దుస్తులు తాకొద్దు'

అఫ్గాన్‌ని తమ అధీనంలోకి తెచ్చుకుంది మొదలు.. తాలిబాన్ల ఆగడాలు (afghan taliban) రోజురోజుకీ పెచ్చుమీరుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఆంక్షలు అధికమవుతున్నాయి. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఆడవాళ్లు ముఖం, శరీరం కనిపించకుండా తల నుంచి కాలి వరకు కప్పి ఉంచేలా తప్పనిసరిగా బుర్ఖా ధరించాలనే ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ డ్రెస్‌కోడ్‌పై అత్యధికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, తాలిబాన్లకు ఎదురు నిలబడటానికి చాలామంది జంకుతున్నారు. కానీ, బహార్‌ జలాలీ అనే మహిళ ఈ బలవంతపు డ్రెస్‌కోడ్‌ వ్యవహారంపై అంతర్జాలం వేదికగా (afghanistan news) ఒక ఉద్యమమే మొదలు పెట్టారు. ఆమె అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌లో మాజీ అధ్యాపకురాలు. తాలిబాన్‌ ముష్కరుల ఆజ్ఞలను ధిక్కరిస్తూ రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి, ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.

బహార్‌ జలాలీ

DoNotTouchMyClothes, AfghanistanCultureand AfghanWomen హ్యాష్‌ట్యాగ్‌లతో మహిళల్ని చైతన్యం చేస్తున్నారు. దీనికి మద్దతుగా చాలామంది మహిళలు ముందుకొస్తున్నారు. జలాలీ తన ట్విటర్‌ ఖాతాలో పూర్తిగా నలుపురంగు బుర్ఖా ధరించిన ఒక మహిళ ఫొటోని జత చేసి 'అఫ్గాన్‌ చరిత్రలోనే ఇలాంటి వస్త్రధారణ నేనెప్పుడూ చూడలేదు. తాలిబాన్లు కోరుకుంటోంది ఇదేనా? ఇది మన సంప్రదాయం కానే కాదు. ఆ విషయానికొస్తే ఆమెను గ్రహాంతరవాసిగా భ్రమించే ప్రమాదం ఉంది' అంటూ ట్వీట్‌ చేశారు. దాంతోపాటు 'ఇదీ మన దేశ సంప్రదాయం.. దానికి భిన్నంగా ఉగ్రమూకలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడదాం' అంటూ ఆమె ఫొటో జత చేశారు. డీడబ్ల్యూ న్యూస్‌ సర్వీస్‌ హెడ్‌ వస్లాత్‌ హస్రత్‌ నజీమీ సైతం జలాలీ ట్వీట్‌ని సమర్థిస్తూ 'ఇదీ అఫ్గాన్‌ సంస్కృతి' అంటూ సంప్రదాయ వస్త్రధారణతో ఫొటో పంచుకున్నారు. అఫ్గాన్‌ తాలిబాన్‌ వశమయ్యాక మహిళలపై హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నాయనీ, వారిని రెండో తరగతి పౌరులుగా మారారని ప్రపంచం గగ్గోలు పెడుతోంది.

ఇదీ చూడండి :కాబుల్​లో.. భారత సంతతి వ్యాపారి కిడ్నాప్​!

ABOUT THE AUTHOR

...view details