తెలంగాణ

telangana

ట్రంప్ గెలుపునకు ఈ మెలికే కారణం!

By

Published : Nov 4, 2020, 10:42 AM IST

జాన్ ఆడమ్స్​, రూథర్​ఫర్డ్ హేయ్స్, బెంజమిన్ హారిసన్, జార్జి బుష్, డొనాల్డ్ ట్రంప్... అమెరికాను ఏలిన వీరందరికీ ఒక విషయంలో పోలికుంది. ఎన్నికల్లో వీరంతా పాపులర్ ఓట్లు దక్కించుకోకపోయినా అధ్యక్ష పదవిని అలంకరించారు. ట్రంప్ అయితే ఏకంగా 28 లక్షల ఓట్ల తేడా ఉన్నప్పటికీ ఎలక్టోరల్ ఓట్ల సాయంతో శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. మరి ఈసారి ఏం జరుగుతుందనేదే ప్రశ్న!

EXPLAINER: They lost the popular vote but won the elections
పాపులర్ ఓట్లలో వెనకబడినా అధ్యక్ష పీఠం గెలిచారు

అమెరికా చరిత్రలో పాపులర్ ఓట్లు దక్కించుకోకపోయినా ఐదుగురు అభ్యర్థులు శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ సైతం ఇలాగే గెలుపొందారు. మరి ఈసారి కూడా ట్రంప్ ఇదే ఫలితం కొనసాగిస్తారా? అమెరికా చరిత్రలో రెండు సార్లు పాపులర్ ఓట్లు దక్కించుకోకపోయినా గెలిచి రికార్డుకెక్కుతారా?

పాపులర్xఎలక్టోరల్.. తేడా ఇదే

అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పాపులర్ ఓట్లు అంటారు. పాపులర్ ఓట్ల ద్వారా అమెరికా కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, గవర్నర్లు, రాష్ట్ర శాసనసభ్యులను ఎన్నుకుంటారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా ఎలక్టార్ల సంఖ్య ఉంటుంది. రాజకీయ పార్టీల తరపున ఆయా రాష్ట్రాల్లో బరిలో ఉన్న ఎలక్టార్లకు ఓటేస్తే.. వారు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

ఇలా పాపులర్ ఓట్ల విషయంలో వెనకబడి ఎలక్టోరల్ ఓట్లతో శ్వేతసౌధాన్ని అధిరోహించిన ఐదుగురు వీరే...

జాన్ క్విన్సీ ఆడమ్స్

జాన్ క్విన్సీ ఆడమ్స్

1824లో ఆండ్రూ జాక్సన్ పాపులర్ ఓట్లతో పాటు, ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను దక్కించుకున్నారు. కానీ మెజారిటీకి దూరంగా నిలిచిపోయారు. దీంతో అధ్యక్షుడి ఎన్నిక బాధ్యత ప్రతినిధుల సభపై పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేత ఆండ్రూ జాక్సన్​తో పాటు జాన్ క్విన్సీ ఆడమ్స్, విలియమ్ క్రాఫోల్డ్, హెన్రీ క్లే సైతం ఎన్నికల బరిలో ఉన్నారు. చివర్లో హెన్రీ క్లే.. ఆడమ్స్​కు తన మద్దతును ప్రకటించారు. దీంతో ఆడమ్స్​కు మెజారిటీ లభించింది. క్లేను తన మంత్రివర్గంలోకి చేర్చుకున్న ఆడమ్స్.. విదేశాంగ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో పాపులర్ ఓట్లు తగ్గినా ఆడమ్స్ శ్వేతసౌధంలోకి ప్రవేశించగలిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆండ్రూ జాక్సన్ సెనేట్​ను వదిలేసి 1828లో మరోసారి పోటీ చేశారు. ఈసారి సునాయాస విజయాన్ని అందుకున్నారు.

రూథర్​ఫర్డ్​ బీ హేయ్స్

రూథర్​ఫర్డ్ హేయ్స్

1876లో డెమొక్రటిక్ శామ్యూల్ టిల్డెన్.. రిపబ్లికన్ రూథర్​ఫర్డ్​ బీ హేయ్స్​పై రెండు లక్షల ఓట్ల ఆధిక్యం కనబరిచారు. 185 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరం కాగా.. ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయారు. టిల్డెన్​కు 184 ఓట్లు వస్తే, హేయ్స్​కు 165 ఓట్లు లభించాయి. ఫ్లోరిడా, లూసియానా, ఓరెగాన్, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లోని 20 ఓట్ల విషయం వివాదాస్పదంగా మారింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు ఇరుపార్టీలకు చెందిన ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ప్రమాణ స్వీకారానికి మూడు రోజుల ముందు(మార్చి 2న) హేయ్స్​ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది కమిటీ. దక్షిణ రాష్ట్రాల నుంచి ఫెడరల్ బలగాలను ఉపసంహరిస్తామన్న రిపబ్లికన్ల హామీతో డెమొక్రాట్లతో సంధి కుదిర్చింది.

బెంజమిన్ హారిసన్

బెంజమిన్ హారిసన్

1888లో ఎన్నికల ప్రచారం అవినీతి మయమైంది. నల్లజాతీయుల ఓట్లను అణచివేస్తున్నారనే ఆరోపణలతో పాటు ఓట్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత గ్రూవర్ క్లీవ్​లాండ్... రిపబ్లికన్ నేత బెంజమిన్ హారిసన్​పై 90 వేల పాపులర్ ఓట్ల మెజారిటీ సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. హారిసన్ 233 ఎలక్టోరల్​లు సాధించి అధ్యక్షుడిగా గెలుపొందారు.

జార్జి బుష్

జార్జి డబ్ల్యూ బుష్

2000 సంవత్సరంలో రిపబ్లికన్ నేత జార్జి బుష్ సైతం ఇదే విధంగా విజయం సాధించారు. పాపులర్ ఓట్ల విషయంలో వెనకబడినా.. అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. అయితే ఎలక్టోరల్ ఫలితాలు హోరాహోరీగా కొనసాగాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యక్తిగత ఓటింగ్ బ్యాలెట్ గుర్తుల విషయంలో వివాదాలు తలెత్తాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. బుష్ ఆధిక్యం సాధించడం వల్ల రీకౌంటింగ్ ప్రక్రియను డిసెంబర్ 12న సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ ఎన్నికల్లో బుష్ 271 ఎలక్టోరల్​ ఓట్లు కైవసం చేసుకోగా.. డెమొక్రటిక్ నేత అల్ గోరే 266 ఓట్లు సంపాదించారు.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

2016లో నిర్వహించిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే రకంగా గెలుపొందారు. 304 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ఆయనకు.. హిల్లరీ క్లింటన్​తో పోలిస్తే 28 లక్షల పాపులర్ ఓట్లు తక్కువగా పడ్డాయి. అమెరికా చరిత్రలో పాపులర్ ఓట్లలో ఇంత తేడా ఉన్నప్పటికీ గెలిచిన అధ్యక్షుడు ట్రంపే కావడం విశేషం.

ఇప్పుడేం జరుగుతుంది?

అయితే ప్రస్తుత ఫలితాల సరళి పరిశీలిస్తే పాపులర్, ఎలక్టోరల్ ఓట్లు ఒకే వ్యక్తికి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్ ప్రస్తుతం ముందంజలో ఉండగా.. పాపులర్ ఓట్లు, ఎలక్టార్ ఓట్లలో ఆధిక్యం కనబరుస్తున్నారు. అయినా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారో తేలాలంటే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details