తెలంగాణ

telangana

దర్శక రుషి.. అసమాన యశస్వి.. తొలి సినిమాతోనే 'నంది' అందుకున్న కళా తపస్వి..

By

Published : Feb 3, 2023, 6:50 AM IST

ఆయన సినిమాల్లో.. గజ్జెలు ఘల్లుమంటే.. ప్రేక్షకుల గుండెలు ఝల్లుమంటాయి.. అందెల రవళి వింటుంటే.. అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి.. అమృతగానాలు చెవినపడి..అమితానందపు ఎదసడిని కలిగిస్తాయి.. సంగీత, నృత్యాలు కలగలిసి.. సాగరసంగమాన్ని తలపిస్తాయి.. ఈ గాలి.. ఈ నేల.. ఈ సినిమా తమదనిపిస్తాయి.. ఆయన సినిమాలు చూస్తుంటే...సరస స్వర సుర ఝరీ గమనం గుర్తొస్తుంది..ఆయనే కె.విశ్వనాథ్‌.. కళాతపస్వి విశ్వనాథ్‌!

tollywood director k viswanath death
tollywood director k viswanath

ఏ ఖజురహోలోనో, హళేబీడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో శ్రద్ధగా చెక్కిన శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు కొలువుదీరాయి. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా గురించైనా ఒక్కో ప్రత్యేకమైన వ్యాసం రాయవచ్చు. అన్నీ గుదిగుచ్చి చెప్పాలంటే విహంగవీక్షణమే శరణ్యం.

తొలి సినిమాతోనే నంది అవార్డు
కె.విశ్వనాథ్‌ తొలిసారి దర్శకుడిగా మారి 1963లో తీసిన 'ఆత్మగౌరవం'సినిమాలోనే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి ప్రయత్నంతోనే నంది అవార్డును అందుకున్న ఆ సినిమాను ఇప్పటి యువతరం చూసినా వారికి విసుగు కలిగించని రీతిలో కథనం ఉంటుంది. అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో 'అందెను నేడే అందని జాబిల్లి.. నా అందాలన్నీ ఆతని వెన్నెలలే..'అన్న పాటని, 'రానని రాలేనని ఊరక అంటావు.. రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?'పాటని ఓసారి చూడండి. శృంగారం అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి కూడా గిలిగింతలు పెడుతుంది.

సిరివెన్నెల దంపతులతో

ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన భావజాలాన్ని ప్రేక్షకుల హృదయాలకు చక్కిలిగింతలు పెట్టే రీతిలో చిత్రీకరించే ఒరవడి ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. సంగీత నృత్య భరితమైన శంకరాభరణంలో కూడా మరచెంబుతో ఆయన నడిపిన ప్రేమ రాయబారాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు?'ఓసీత కథ’లో 'మల్లె కన్న తీయన మా సీత మనసు..'పాటను గుర్తుకు తెచ్చుకోండి. బావామరదళ్ల మమకారం ఎంత సహజంగా తెరమీద ఒదిగిందో తెలుస్తుంది.

ఒకరి మీద ఒకరికి కలిగీ కలగని ఇష్టాన్ని, ఆ ఇష్టత వ్యక్తమయ్యే సున్నితమైన తీరుని అర్థం చేసుకోవాలనుకుంటే 'సాగరసంగమం’లో 'మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి'పాటను ఓసారి చూడండి. సరిగమలతో సైతం ప్రేమలేఖను పంపవచ్చనే సంగతిని 'సప్తపది’ చెబుతుంది. 'నగుమోము కనలేని నా బాధ తెలిసి.. నను బ్రోవ రారాదా?'అనే సంగీత కృతి స్వరకల్పనను కాగితంపై రాసి పంపితే ఏ ప్రేయసి పరిగెత్తుకుని సంకేత స్థలానికి రాకుండా ఉండగలుగుతుంది? ఇద్దరు కళాకారుల మధ్య అల్లుకున్న అనుబంధాన్ని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాత్తమైన సన్నివేశం ఏముంటుంది? ఇంత చక్కని ఆలోచన ఎవరికి కలుగుతుంది, కళాతపస్వికి తప్ప!

నాటి రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారాన్ని అందుకుంటూ

ఇలా చూస్తే 'శుభలేఖ’లో 'రాగాల పల్లకిలో కోయిలమ్మ..'పాటను తల్చుకున్నా, 'ఆపద్బాంధవుడు’లో 'ఔరా.. అమ్మకచెల్ల.. ఆలకించి నమ్మడమెల్ల..'పాటను చూసినా, ఇలా ఒకటేమిటి, విశ్వనాథ్‌ సినిమాల్లో సున్నితమైన భావజాలాన్ని, ప్రేమ చేసే ఇంద్రజాలాన్ని మనసుకు హత్తుకుపోయే రీతిలో చిత్రీకరించే తీరుకు మెచ్చుతునకలు అనేకం కనిపిస్తాయి.

మహా సాహసి కూడా..
ఇక విశ్వనాథ్‌ వెండితెరపై మలిచిన పాత్రల్ని చూస్తే, కళాతపస్వి మహా సాహసి అని కూడా అనిపిస్తాయి. హీరో అంధుడు.. హీరోయిన్‌ మూగ. ఇక వాళ్ల మధ్య సంబంధం కళానుబంధం! సినిమా రంగంలో వ్యాపారాత్మక సూత్రాలు, ఫార్ములాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ కథను ఊహించడానికి ఎంత ధైర్యం కావాలి? నిర్మాతకు చెప్పాలంటే తన ఆలోచనలపైన ఎంత స్పష్టత ఉండాలి? ఆపై వెండితెరపైకి మలచాలంటే ఇంకెంత ఆత్మవిశ్వాసం కావాలి? కానీ ఆయన నమ్మకం, ఆత్మవిశ్వాసం ఊరికే పోలేదు. ఆ సినిమా వెండితెరపై 'సిరివెన్నెల'కురిపించింది. చూడలేనివారికి సైతం బృందావనాన్ని కళ్ల ముందు నిలిపింది.

మరో సినిమాలో కథానాయిక పలుకే బంగారమైన మూగమ్మాయి. నాట్యమంటే మక్కువ. మరి కథానాయకుడు? డప్పు కళాకారుడు. ఆమె అతడికి యజమాని కూతురు. ఆ కుటుంబంపై ఆధారపడే అతడే ఆమెకు రక్షకుడిగా మారతాడు. అతడి నిజాయితీ, అభిమానం ఆమెలో ప్రేమను రగిలిస్తే ఆ మూగ ఇష్టాన్ని తెరపై ఎలా చూపించాలి? ఎవరికైనా కష్టమేమో కానీ విశ్వనాథ్‌కేం? ఆమె కాలికి కట్టుకునే 'సిరిసిరి మువ్వ’లు గాలికి అల్లాడి కిందనే ఉన్న డప్పుపై పడి చప్పుడు చేస్తాయి. ఆ చప్పుడులో ఆమె గుండె చప్పుడు వినిపిస్తుంది ప్రేక్షకులకు. ఎంత చక్కని వ్యక్తీకరణ? ఎంత సున్నితమైన చిత్రీకరణ?

కె విశ్వనాథ్​

ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులు తొలి రేయిని చూసి ఉంటారు. ఆ సన్నివేశంలో పాటల్ని కూడా ఆస్వాదించి ఉంటారు. కానీ తొలిరాతిరి భార్యను చూస్తూనే ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 'అయిగిరి నందిని.. నందిత మోహిని.. విశ్వవినోదిని నందినుతే..'అంటూ పాడుతూ పూజ చేసే భర్తను చూశారా? ఆ సన్నివేశంలో భార్య తెల్లబోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ, ఆలయంలో అమ్మవారు తప్ప మరో స్త్రీమూర్తిని వేరే దృష్టిలో చూడని ఆ యువ పూజారికి, మనసు అన్యాక్రాంతమైన భార్య జగన్మాతగా కనిపించడంలో వింత లేదని అర్థం చేసుకునే ప్రేక్షకుడు మాత్రం తెల్లబోడు. పైగా ఆ అద్భుత వైవిధ్య చిత్రీకరణకు జోహార్లు అర్పిస్తాడు. అందుకే 'సప్తపది’, పది కాలాల పాటు చెప్పుకొనే సినిమాగా మిగిలింది.

ఇవన్నీ పక్కన పెడితే హీరో వట్టి వెర్రిబాగులవాడు. వయసు ఎదిగినా బుద్ధి మందగించిన వాడు. అమ్మాయి వీపు తోముతున్నా, గుడి మెట్లు కడుగుతున్నా పని మీద శ్రద్ధ తప్ప, మరే ధ్యాసలూ ఉండనంత అమాయకుడు. అలాంటి హీరోతో 'స్వాతిముత్యం’లాంటి సినిమా తీశారు విశ్వనాథ్‌. అలా ఆయన ఓ చెప్పులు కుట్టేవాడితో స్ఫూర్తిని పంచగలరు. ఓ ఆవులు కాసేవాడితో మంచితనానికి అర్థం చెప్పించగలరు. ఓ జాలరితో బంధమంటే ఏంటో చూపించగలరు. బాధ్యతను తప్పించుకోడానికి సన్యాసులలోనైనా చేరడానికి సిద్ధపడే ఓ బద్ధకస్తుడితో పని విలువేంటో తెలియజెప్పగలరు.

సిరి సిరి మువ్వ

సామాజిక సమస్యలకూ ప్రతిబింబాలు
సమాజంలో వేళ్లూనుకుపోయిన సమస్యలను కూడా విశ్వనాథ్‌ చిత్రాలు కట్టెదుట నిలిపి, నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి. అలా అని అవి ఏ ఆర్ట్‌ సినిమాలో కాదు. వ్యాపారాత్మక విలువలతో పండిత పామరులను సైతం అలరించగలిగేవే! ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం? మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని 'సప్తపది'స్పష్టం చేస్తే ఎలా కాదనగలం? చేసే పని తపస్సయితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని 'స్వయంకృషి'చెబితే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం? అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని 'సూత్రధారులు'బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం? వరకట్నం సమస్యని సునిశిత హాస్యంతో మేళవించి 'శుభలేఖ'చూపిస్తే ఆలోచించకుండా ఉండగలమా? ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయాద్వేషాలు అధఃపాతాళానికి దిగజారుస్తాయని 'స్వాతికిరణం'కళ్లు తెరిపిస్తే అంధుల్లాగా ఎలా ప్రవర్తించగలం?

చిరంజీవితో విశ్వనాథ్​

కె. విశ్వనాథ్‌ సినిమాలను వ్యాపారంగానో, కాసులు కురిపించే కళగానో చూడలేదు. సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా, వాచా, కర్మణా నమ్మారు. ఆ నమ్మకానికి ఊహను జోడించి, అందమైన కథను అల్లి, ఎక్కడ ఏది ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెబుతూ ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసే అరుదైన, అద్భుత చిత్రాలను వెండితెరపై కమనీయంగా మలిచారు. అందుకే ఆయన కళాతపస్వి మాత్రమే కాదు, చిరకాలం తల్చుకోగలిగే అసమాన యశస్వి!!

స్వయం కృషి

ABOUT THE AUTHOR

...view details