తెలంగాణ

telangana

భయపడేది లేదు ఎదురొస్తే కొట్లాడటమే, బాయ్​కాట్​ గ్యాంగ్​కు విజయ్​ స్ట్రాంగ్​ రిప్లై

By

Published : Aug 21, 2022, 9:32 AM IST

Vijay Devarakonda On BoyCott Liger
Vijay Devarakonda On BoyCott Liger

లైగర్​ ప్రమోషన్స్‌లో భాగంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలు ప్రేమిస్తున్నారని, వాళ్ల కోసమే ఈ సినిమా చేశామని చెప్పారు హీరో విజయ్​ దేవరకొండ. ప్రేక్షకులు ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదంటూ బాయ్​కాట్ లైగర్​పై స్పందించారు. మన ధర్మం మనం పాటించినప్పుడు ఎవరి మాట వినాల్సిన పనిలేదని అన్నారు విజయ్.

Vijay Devarakonda On BoyCott Liger: సినిమాను ఆదరించే ప్రజలు, ప్రేక్షకులు ఉన్నంతకాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం 'లైగర్‌'. శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అంతకన్నా ముందు విజయవాడకు వచ్చిన 'లైగర్‌' టీమ్‌ మాట్లాడింది. ఈ సందర్భంగా 'బాయ్‌కాట్‌ లైగర్‌' అంశంపై విజయ్‌ స్పందించారు.

విజయ్​ దేవరకొండ
విజయ్​ దేవరకొండ

"మూడేళ్ల కిందట సినిమా మొదలు పెట్టాం. అప్పటికి 'బాయ్‌కాట్‌' గొడవలేమీ లేవు. దేశవ్యాప్తంగా 'లైగర్‌'ను తీసుకెళ్లాలంటే కరణ్‌జోహార్‌ కన్నా మించినవారు లేరు. ఆయన 'బాహుబలి'లాంటి చిత్రాన్ని అక్కడి వారికి చేరువయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తరాదిలో మనకు ఆయన దారి చూపించారు. 'లైగర్' స్క్రిప్ట్‌ మనది, ప్రొడక్షన్‌ మనది. 'హిందీలో మీరు విడుదల చేయండి' అని ఆయన చెబితే, ఈ సినిమా బాధ్యత తీసుకున్నారు. అసలు బాలీవుడ్‌లో ఏం గొడవ జరిగిందో పూర్తిగా నాకు తెలియదు. మేము కరెక్ట్‌గానే ఉన్నాం. నేను హైదరాబాద్‌లో పుట్టా. ఛార్మి పంజాబ్‌లో పుట్టింది. పూరి సర్‌ నర్సీపట్నంలో పుట్టారు. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాం. మేం సినిమా రిలీజ్‌ చేసుకోకూడదా? ఇంట్లో కూర్చోవాలా? ప్రమోషన్స్‌లో భాగంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలు ప్రేమిస్తున్నారు. వాళ్ల కోసం మేం ఈ సినిమా చేశాం. మనవాళ్లు మనకు ఉన్నంత సేపూ భయపడాల్సిన అవసరం లేదు. మన ధర్మం మనం పాటించినప్పుడు ఎవరి మాటా వినాల్సిన పనిలేదు"

-- హీరో విజయ్​ దేవరకొండ

"ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్‌ కాదు మేము. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే. లాక్‌డౌన్‌ సమయంలో నేను మొదలు పెట్టిన 'మిడిల్‌క్లాస్‌ ఫండ్‌' కోసం ఎంతో మంది విరాళం ఇచ్చారు. అలాంటి వాళ్లు మనకు కావాలి. ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు 'లైగర్‌' కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్‌ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్‌ చేస్తారా. ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదు" అంటూ విజయ్‌ అన్నారు.

అసలేమైందంటే..
Boycott Liger Tag: 'లైగర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు శుక్రవారం విజయ్‌ దేవరకొండ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'బాయ్‌కాట్‌' ట్రెండ్‌పై స్పందించాలని కోరగా.. "సినిమా నిర్మాణం గురించి ఒక్కసారి ఆలోచిస్తే.. నటీనటులు, దర్శకుడు, నిర్మాత, ఇతర సహాయనటులు ఇలా సుమారు 300 మంది ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తారు. వాళ్లందరికీ ఎంతోమంది సిబ్బంది ఉంటారు. కాబట్టి ఒక సినిమా మాలాంటి వారికి ఉద్యోగాన్ని ఇస్తుంటే మరెంతోమందికి జీవనోపాధిని అందిస్తోంది"

"ఉదాహరణకు ఆమిర్‌ నటించిన 'లాల్‌ సింగ్‌ చడ్డా'ని తీసుకోండి. దీన్ని ఆమిర్‌ నటించిన చిత్రంగా చెప్పుకొంటున్నాం. కానీ.. ఆ సినిమాపై సుమారు 3000 మంది కుటుంబాలు జీవనోపాధి పొందాయి. మీరు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయడం వల్ల ఆమిర్‌కు నష్టం ఉండదని, ఆ సినిమాపై జీవనోపాధి పొందుతున్న వేలమందిని ఇబ్బందిపెడుతున్నారని తెలుసుకోవాలి. ఎంతోమంది సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించిన నటుడు ఆమిర్‌. బాయ్‌కాట్‌ ఎందుకు జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ.. అపార్థాలే దీనికి కారణమై ఉండొచ్చు. దయచేసి ఇకనైనా తెలుసుకోండి.. బాయ్‌కాట్‌తో మీరు ఆమిర్‌ ఒక్కడినే ఇబ్బందిపెట్టడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెడుతున్నారు" అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

విజయ్​ దేవరకొండ
విజయ్​ దేవరకొండ

ట్విట్టర్​లో ఏం జరుగుతోంది..
BoyCott Liger Twitter War: 'లాల్‌ సింగ్‌ చడ్డా'పై విజయ్‌ స్పందించడం కొంతమంది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో విజయ్‌ నటిస్తోన్న 'లైగర్‌'కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా ఉండటం వల్ల కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ 'బాయ్‌కాట్‌ లైగర్‌' ట్యాగ్‌ జతచేస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌ వివాదానికి సంబంధించిన ఫొటోలనూ జత చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యే సరికి విజయ్‌కు గర్వం పెరిగిందంటూ విమర్శిస్తున్నారు.

విజయ్​ దేవరకొండ, అనన్య పాండే

'లైగర్‌' టీమ్‌కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అభిమానుల నుంచి సపోర్ట్‌ మాత్రం మెండుగానే లభిస్తోంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా విజయ్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టారని, ఆయన ఫ్రెండ్లీ నటుడని పేర్కొంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో విజయ్‌కు సపోర్ట్‌ చేస్తూ #Vijay Deverakonda అనే ట్యాగ్‌ సైతం ట్విట్టర్​లో దూసుకెళ్తోంది. ఏది ఏమైనా ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ సినీ పరిశ్రమకు కొత్త సమస్యగా మారిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్‌ ట్రెండ్‌కి ఏదో ఒకరకంగా ముగింపు పలకాలని కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్​ హీరోయిన్​

ఇదీ భామల బ్రాండ్‌, హిట్లు తక్కువ అవకాశాలు ఎక్కువ

ABOUT THE AUTHOR

...view details