తెలంగాణ

telangana

'వీరసింహారెడ్డి విస్ఫోటనం అని చెప్పా.. అన్నట్టుగానే గొప్ప విజయం సాధించింది'

By

Published : Jan 22, 2023, 11:02 PM IST

Updated : Jan 23, 2023, 7:21 AM IST

hero balakrishna speech in veerasimhareddy movie success meet

'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. యువ కథానాయకులు విష్వక్‌సేన్‌, సిద్ధు జొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు.

"నటుడిగా భిన్న రకాల పాత్రలు చేసే అవకాశం లభించిందంటే అది ఈ జన్మకి నాకు లభించిన అదృష్టం. ఇంకా కుర్రాడిలా కనిపించడం వెనక అదే రహస్యం" అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన 'వీరసింహారెడ్డి' విజయోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన చిత్రమిది. బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్‌, హనీరోజ్‌ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా 'వీరమాస్‌ బ్లాక్‌బస్టర్‌' పేరుతో విజయోత్సవాన్ని నిర్వహించారు. యువ కథానాయకులు విష్వక్‌సేన్‌, సిద్ధు జొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు.

ఈ వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ "ఒక్కొక్కసారి ఒక్క డైలాగ్‌ నుంచి, ఒక్క మేనరిజమ్‌ నుంచే కథ పుడుతుంటుంది. దీనికి ఆద్యుడు మా బోయపాటి శ్రీను. గోపీచంద్‌ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా. నా అభిమాని కాబట్టి గోపీచంద్‌ మలినేని వెంటనే 'చెన్నకేశవరెడ్డి' అన్నాడు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ, పాటల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచారు సాయిమాధవ్‌ బుర్రా, రామజోగయ్యశాస్త్రి. తమన్‌ సంగీతం అద్భుతంగా ఉంది. ఒకొక్క పాట నా ఆహార్యానికి సరిపడేలా ఉంటుంది. ఇదొక విస్ఫోటనం అని చెప్పా. అన్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది" అన్నారు.

వీరసింహారెడ్డి సెక్సెస్​ మీట్
  • కథానాయకుడు విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ "చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఏం సాధించావని అడిగితే.. 'బాలకృష్ణ సర్‌' ప్రేమని సాధించానని చెబుతా. ఆయన కోసం కొత్త అభిమానులు పుడుతున్నారు. అందరికీ జరగదు అది" అన్నారు.
  • సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ "ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. మన దగ్గర మంచి సినిమాతోపాటు, హిట్‌ సినిమా కూడా తీయాలి. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ అనే పేరున్న బాలకృష్ణతో సినిమా తీయాలంటే అది ఎంత కష్టమో. ఒక మేజిక్‌ని సృష్టించాలి. దర్శకుడు గోపీ అద్భుతంగా ఆ మేజిక్‌ని సృష్టించారు" అన్నారు.
  • గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ "ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణతో ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన కథానాయకుడు బాలకృష్ణకి రుణపడి ఉంటా. ఒక అభిమానిగా ఈ సినిమా చేశా. ఫ్యాన్‌ మూమెంట్స్‌, ఫ్యామిలీ మూమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులవల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది" అన్నారు.
  • "ఈ చిత్ర విజయంలో నేను భాగం కావడం, మీనాక్షి పాత్ర దొరకడం గొప్ప వరం" అన్నారు హనీరోజ్‌.
  • "'అఖండ' సినిమా నుంచి బాలకృష్ణే నా జీవితానికి శివుడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు రోజూ లింగపూజ చేస్తూ ఆ సినిమాకోసం కష్టపడ్డాను. ఆ సినిమాలో నటిస్తూ ఆయన పడిన కష్టాన్ని గుర్తించి ఈ సినిమాకి పనిచేశా. బాలకృష్ణ నిజమైన మనిషి, ఆయన కోసం అందరం నిజంగానే పనిచేస్తుంటాం. చాలామందికి పనిచేయాలనుకుంటాం. రజనీకాంత్‌, బాలకృష్ణ, చిరంజీవిలకి పనిచేయడం మాకు పెద్ద బహుమానం" అన్నారు సంగీత దర్శకుడు తమన్‌.
  • "బాలకృష్ణ 'అఖండ' తర్వాత మాకు ఈ సినిమా అవకాశం ఓ పెద్ద బాధ్యత. ఇంత మంచి సినిమానిచ్చిన కథానాయకుడు, దర్శకులకి కృతజ్ఞతలు" అన్నారు నిర్మాత నవీన్‌ యెర్నేని.
  • సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ "ఇంత విజయం సాధిస్తుందని, ఇన్ని సంచలనాలు సాధిస్తుందని మాస్‌ కమర్షియల్‌ సినిమా దొరికితే ఎలా రాయగలనో చూపించాలనే తపన ఉండేది. ఇంత అద్భుతమైన కథ, సన్నివేశాల్ని ఇచ్చి మాటలు రాసే అవకాశాన్నిచ్చిన గోపీకి కృతజ్ఞతలు"అన్నారు.
  • రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ "సినిమా విజయంలో సింహభాగం వాటా పాటలకి దక్కింది. ఇంత గొప్ప విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది" అన్నారు.
  • "ఇంత పెద్ద సినిమాలో నన్ను భాగం చేయడంతోపాటు, నటిస్తున్నప్పుడు నాకు ప్రోత్సాహం అందించిన బాలకృష్ణకి కృతజ్ఞతలు. ఓ సన్నివేశంలో ఆయన్ని పొడవాలన్నప్పుడు నాకు భయమేసింది.. అభిమానులు ఎలా స్వీకరిస్తారో అని! కానీ నా అభిమానులు పాత్రలానే చూస్తారంటూ ధైర్యం చెప్పారు బాలకృష్ణ. అందుకే ఆయన పక్కన అంత బాగా నటించగలిగా" అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌.
  • హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ "సంక్రాంతి పండగని కొనసాగిస్తోంది 'వీరసింహారెడ్డి’. ఈ సినిమా తొలి షాట్‌కి నేను దర్శకత్వం చేశా. త్వరలోనే బాలకృష్ణ సర్‌ని ఒప్పించి మంచి కథతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా" అన్నారు.
  • అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సీజన్‌ నడుస్తోంది. ఆయనదైన టచ్‌తోనే 'వీరసింహారెడ్డి' వచ్చింది. అదే టచ్‌తోనే తదుపరి సినిమా రాబోతోంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాకుండా, తెలంగాణలో దిగుతాడు. ఈసారి బాక్సాఫీసు ఊచకోత షురూ చేసి, కలెక్షన్లతో ఖుర్బానీ పెడతాడు" అన్నారు. ఈ కార్యక్రమంలో దునియా విజయ్‌, రాహుల్‌ సాంకృత్యాన్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి, అవినాష్‌, జాన్‌, నాగమహేష్‌, రామ్‌ లక్ష్మణ్‌, వెంకట్‌, శంకర్‌, సచిన్‌ ఖేడేకర్‌, లాల్‌, బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.
Last Updated :Jan 23, 2023, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details