తెలంగాణ

telangana

ఈ యువ హీరోలు.. టాలీవుడ్​ 'గూఢచారులు'

By

Published : May 14, 2022, 6:33 AM IST

Upcoming Tollywood spy thriller movies: టాలీవుడ్‌లో ఒకొక్క దశలో ఒక్కో రకమైన కథల హవా కనిపిస్తుంటుంది. అలా ఈ సారి కొంతమంది యువ కథానాయకులు స్పై పాత్రలతో రాబోతున్నారు. ఇంతకీ ఆ హీరోలెవరు? ఆ చిత్రాలేంటి తెలుసుకుందాం..

2022 Upcoming spy thriller movie
2022 టాలీవుడ్​ స్పై థ్రిల్లర్ మూవీస్​

Upcoming Tollywood spy thriller movies: గూఢచర్యం నేపథ్యంలో కథలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. స్పై సినిమాలుగా ప్రపంచవ్యాప్తంగా వీటికి ప్రత్యేకమైన క్రేజ్‌, మార్కెట్‌ ఉంటుంది. స్టైల్‌, యాక్షన్‌, థ్రిల్‌, హీరోయిజం, దేశభక్తి... ఇలా బోలెడన్ని మాస్‌ అంశాలకి చోటుండే కథలు ఇవి. అందుకే స్పై కథలకి అంత గిరాకీ. అన్నీ పక్కాగా కుదిరాయంటే బొమ్మ సూపర్‌హిట్టే. మాస్‌ కథానాయకులు ఈ నేపథ్యంలో సినిమాలు చేస్తున్నారంటే వాటిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. తెలుగులో అగ్ర తారలు ఆ కథల్లో నటించకపోయినా పలువురు యువ కథానాయకులు గూఢచారులుగా, ఏజెంట్లుగా మారిపోతున్నారు.

టాలీవుడ్‌లో ఒకొక్క దశలో ఒక్కో రకమైన కథల హవా కనిపిస్తుంటుంది. పోలీస్‌, గ్యాంగ్‌స్టర్‌, దొంగ, క్రీడాకారుడు, విద్యార్థి, ప్రేమికుడు... ఇలా ఆయా పాత్రల్లో కథా నాయకులు సందడి చేస్తుంటారు. అప్పుడప్పుడూ తారలు వరుసగా ఒకే తరహా కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తూ అలరిస్తుంటారు. అలా ఇప్పుడు స్పై పాత్రలతో కొద్దిమంది కథానాయకులు ఆసక్తిని పెంచుతున్నారు.

'ఏజెంట్‌' అఖిల్‌... 'డెవిల్‌' కల్యాణ్‌రామ్‌.. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా 'డెవిల్‌' పేరుతో ఓ పీరియాడిక్‌ చిత్రం రూపొందుతోంది. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కల్యాణ్‌రామ్‌ బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఆ నేపథ్యంతోపాటు, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదీ స్పై కథే. ‘ఏజెంట్‌’ చిత్రంలోని పాత్ర కోసం అఖిల్‌ సిక్స్‌ప్యాక్‌ దేహం సిద్ధం చేశారు. ఆయన లుక్‌ పూర్తిగా మారిపోయింది. ఇందులో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

రెండో గూఢచారి... 'స్పై' పేరుతోనే ఓ చిత్రం చేస్తున్నారు మరో యువ కథానాయకుడు నిఖిల్‌. ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘గూఢచారి’గా కనిపించి విజయాన్ని అందుకున్న అడవి శేష్‌ మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్నారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ‘గూఢచారి’ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దానికి కొనసాగింపుగా మరో చిత్రం తెరకెక్కనుంది.

తమిళంలోనూ ఈ చిత్రాల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. విక్రమ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'ధ్రువనక్షత్రం' ఇలాంటి కథే. విక్రమ్‌ అందులో గూఢచారిగా నటించినట్టు సమాచారం. ‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌హాసన్‌ స్పైగానే కనిపిస్తారని కోలీవుడ్‌ చెబుతోంది.

మహేష్‌ కథ అదేనా?.. తెలుగులో గూఢచారి పాత్రలపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కథానాయకుడు కృష్ణ. బాండ్‌ తరహా చిత్రాలతో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ తరహా కథల్లో మహేష్‌బాబుని చూడాలనేది అభిమానుల కోరిక. అందుకే మహేష్‌ ఎప్పుడు స్పై సినిమా చేసినా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాండ్‌ తరహా కథతోనే ఆ చిత్రం రూపొందుతుందనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అది ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. మరి మహేష్‌ కోసం రాజమౌళి ఎలాంటి కథని సిద్ధం చేస్తున్నారన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరో రెండు మూడు నెలలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి:'నీకోసం 50వ అంతస్తు నుంచి దూకేస్తా'.. హీరోయిన్​ సంచలన కామెంట్స్​!

ABOUT THE AUTHOR

...view details