తెలంగాణ

telangana

వేగవంతమైన ఓఎంసీ కేసు విచారణ.. సీబీఐ కోర్టులో నిందితులకు చుక్కెదురు

By

Published : Oct 17, 2022, 6:36 PM IST

Updated : Oct 17, 2022, 10:08 PM IST

మంత్రి సబిత
మంత్రి సబిత

18:26 October 17

వేగవంతమైన ఓఎంసీ కేసు విచారణ.. సీబీఐ కోర్టులో నిందితులకు చుక్కెదురు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితులకు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఐదుగురి డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ కృపానందం, మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై 2012లో న్యాయస్థానం సీబీఐ అభియోగపత్రాలు దాఖలు చేసింది. అయితే ఛార్జ్​షీట్ నుంచి తొలగించాలని నిందితులు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందం, వీడీ రాజగోపాల్, అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలోనే తన డిశ్చార్జ్ పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. మిగతా నిందితుల పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఓఎంసీకి లీజుల కేటాయింపుల సమయంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా.. శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా.. కృపానందం గనుల శాఖ కార్యదర్శిగా.. రాజగోపాల్ గనుల శాఖ సంచాలకుడిగా.. అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డి పీఏగా ఉన్నారు.

లీజుల కేటాయింపులో సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందం, రాజగోపాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడి గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని సీబీఐ అభియోగం. అయితే సీబీఐ తమను అనవసరంగా ఇరికించిందని.. ఛార్జ్​షీట్ నుంచి తొలగించాలని నిందితులు సీబీఐ కోర్టులో వాదించారు. తాము విధులు మాత్రమే నిర్వర్తించామని.. ఓఎంసీతో ఎలాంటి సంబంధం లేదని.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి సహా నిందితులందరి ప్రమేయంపై ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఇంకా విచారణ ప్రారంభం కానందున ప్రస్తుత దశలో నిందితులను కేసు నుంచి తొలగించవద్దని వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు నిందితుల పిటిషన్లను కొట్టివేసింది. కేసులో నిందితులుగా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డిశ్చార్జ్ పిటిషన్లను దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణ వేగం పెరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ దాటింది. అభియోగాల నమోదుపై వాదనలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details