తెలంగాణ

telangana

Marijuana smuggling: గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం.. పలు ప్రాంతాల్లో ధ్వంసం

By

Published : Oct 23, 2021, 3:18 PM IST

మత్తుకు అలవాటుపడి... అదే ప్రపంచంగా భావిస్తున్నవారిని ఆసరాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగుచేస్తున్న ప్రాంతాలపై పోలీసులు కొరడా జులిపించారు. పత్తి, కంది పంటల మధ్యలో సాగు చేస్తున్న గంజాయిని (Marijuana smuggling) పలు ప్రాంతాల్లో ధ్వంసం చేశారు. దళారులు గిరిజనులకు మాయమాటలు, డబ్బుల ఆశ చూపి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Marijuana smuggling
Marijuana smuggling

కొమురంభీం జిల్లాలోని పలు మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగవుతుందన్న (Marijuana smuggling) సమాచారంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పత్తి, కంది పంటల మధ్యలో సాగు చేస్తున్న గంజాయిని పలు ప్రాంతాల్లో ధ్వంసం చేశారు. కొంతమంది తక్కువ శ్రమతో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో అధికారుల కళ్లుగప్పి గుట్టుగా సాగు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తి, కంది పంటలలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగవుతోందని పేర్కొన్నారు. కంది మొక్కలు గంజాయి మొక్కల ఆకులు ఒకే విధంగా ఉండడంతో... తిర్యాణి, జైనూర్, సిర్పూర్, కాగజ్ నగర్ కెరమెరి, ఆసిఫాబాద్, లింగపూర్ మండలాల్లో కందిలో దొంగచాటుగా గంజాయిని సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.

దళారుల మాయమాటలతో...

దళారులు గిరిజనులకు మాయమాటలు, డబ్బుల ఆశ చూపి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పండిన పంటను కొద్ది కొద్దిగా సేకరించి జిల్లా సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కారు సీట్ల కింద, యువకుల బ్యాగుల్లో గంజాయిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కళ్ల జోళ్లు విక్రయిస్తామని సూట్ కేసులు పట్టుకుని దళారులు వచ్చి గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు.

మూడు నెలల క్రితం బెంగళూరులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేయగా కొమురంభీం జిల్లా సిర్పూర్ మండలం రాఘపుర్‌లో పండిచినట్లుగా తేలింది. నెల రోజుల క్రితం జైనూర్ మండలం పోచంలొద్ది వద్ద ఆటోలో మహారాష్ట్రకు తీసుకువెళ్తున్న 30 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో గంజాయి సాగు పెరిగిన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ కట్టడి చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:Marijuana smuggling: గంజాయి కట్టడికి అధికారులు సమాయత్తం.. అంతర్రాష్ట్ర సరిహద్దులే కీలకం

ABOUT THE AUTHOR

...view details