ETV Bharat / city

Marijuana smuggling: గంజాయి కట్టడికి అధికారులు సమాయత్తం.. అంతర్రాష్ట్ర సరిహద్దులే కీలకం

author img

By

Published : Oct 23, 2021, 9:23 AM IST

అంతర్రాష్ట్ర సరిహద్దులే కీలకం
అంతర్రాష్ట్ర సరిహద్దులే కీలకం

తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా(Marijuana smuggling)కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ఎక్కువగా రవాణా జరుగుతోందని గుర్తించిన అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దులపై నిఘా పెట్టనున్నారు.

తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా(Marijuana smuggling)ను అరికట్టడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దిశగా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎక్సైజ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా గంజాయి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక.. తదితర రాష్ట్రాలకూ అక్రమ రవాణా(Marijuana smuggling) అవుతోంది.

అందుకే అంతర్రాష్ట్ర సరిహద్దులపై నిఘా ఉంచడమే కీలకమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు కలిగిన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, పాల్వంచ.. ఖమ్మం జిల్లా కల్లూరు పరిధిలోని ముత్తుగూడెం ఎక్స్‌ రోడ్డు; సూర్యాపేట జిల్లా కోదాడ, మఠంపల్లి, రామాపురం; నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌, విష్ణుపురం లాంటి కీలక ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులుగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో కేంద్రాలు మూయించే దిశగా...

హైదరాబాద్‌ మీదుగా పెద్దఎత్తున అక్రమ రవాణా(Marijuana smuggling)కు పాల్పడుతున్నట్లు అనేక సందర్భాల్లో బహిర్గతమైంది. పండ్లు, కూరగాయలు, గన్నీ సంచులు, నర్సరీ మొక్కలు.. ఇలా వివిధ వస్తువుల మాటున గంజాయిని తరలిస్తూ ముఠాలు హైదరాబాద్‌ పరిసరాల్లో చిక్కాయి. అందుకే ఆ ముఠాల కదలికలపై కన్నేసి, తనిఖీ కేంద్రాల్ని పటిష్ఠం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నగరంలోని పలు విక్రయ కేంద్రాలపై ఇప్పటికే కొంత సమాచారం ఉండటంతో వాటిని మూయించే దిశగా కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో సాగుపై కన్ను

ఉమ్మడి మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ప్రాంతంలో గతంలో పెద్దఎత్తున గంజాయి సాగయ్యేది. అక్కడి నుంచే కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిపోయేది. అయితే ఎక్సైజ్‌, పోలీసుల వరుస దాడులతో ఆ ప్రాంతంలో సాగు దాదాపుగా నిలిచిపోయింది. కానీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు జరుగుతోందని అధికారుల పరిశీలనలోనూ వెల్లడవుతోంది. వరంగల్‌ గ్రామీణం, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌.. తదితర ప్రాంతాల్లో అంతరపంటగా దీనిని సాగు చేస్తున్నారనే అనుమానాలున్నాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ వ్యవహారంపైనా దృష్టి సారించనున్నారు. గంజాయి సాగు లేదా అక్రమరవాణాను గుర్తించే అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనుండటంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నారు.

డీజీ స్థాయి అధికారి ఎవరో?

తాజా నిర్ణయం దృష్ట్యా ఎక్సైజ్‌ శాఖపైనే ఎక్కువ బాధ్యత పెరిగినా నోడల్‌ అధికారిగా డీజీపీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ అధికారి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆరుగురికి డీజీపీ స్థాయి ఉండగా.. ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు బాస్‌గా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌మెహ్రా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాజీవ్‌రతన్‌కు ఎస్పీఎఫ్‌, ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, గోవింద్‌సింగ్‌కు ఏసీబీ బాధ్యతల్ని అప్పగించారు. రవిగుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంజనీకుమార్‌ సుదీర్ఘకాలంగా నగర పోలీస్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి అప్పగిస్తారో అనే ఆసక్తి నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.