తెలంగాణ

telangana

Couple Cheating: 'నమ్మకంగా ఉంటూ మమ్మల్ని నట్టేట ముంచారు.. న్యాయం చేయండి'

By

Published : Feb 6, 2022, 6:30 PM IST

Cheating in the name of Chits: ఒకటి కాదు రెండు కాదు.. ఇరవై ఏళ్లకు పైగా పరిచయం. పెద్దమ్మా, పిన్నీ, వదినా అంటూ వరసలు కలిపేవారు. చిట్టీల వ్యాపారంతో స్థానికంగా మరింత చనువు పెంచుకున్నారు. వారిళ్లలో ఏ దావతులైనా కుటుంబసమేతంగా వెళ్లేవారు. ఆ చనువుతో పెద్దమొత్తంలో చిట్టీలు వేయించారు. నమ్మకస్థులే కదా అని ఒక్కొక్కరు ఏకంగా 5, 6 చిట్టీలు వేశారు. మొదట్లోనే చిట్టీ పాడుకుంటే డబ్బు తక్కువగా వస్తుందనే భావనతో.. చివరివరకూ కట్టుకుంటూ పోయారు. అదే వారిని నిండాముంచింది. ఇలా ఒకరిద్దరు కాదు.. దాదాపు 100 కు పైగా బాధితులు ఇదే ఆశతో కోట్లలో వారి దగ్గర డబ్బు దాచారు. చివరకు మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. చిట్టీల పేరుతో దంపతుల వలలో పడి మోసపోయిన ఉదంతం హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Cheating in the name of Chits
దంపతుల బారిన పడి మోసపోయిన బాధితులు

Cheating in the name of Chits: హైదరాబాద్​ లాంటి మహానగరంలో విభిన్న ప్రాంతాల మనుషులు ఉంటారు. కొత్త వారిని మనం నమ్మకపోయినా.. ఏళ్ల తరబడి మనతో కలిసి ఒకే కాలనీలో ఉంటున్న వారిని ఆత్మీయులుగా భావిస్తాం. ఆ పరిచయాన్నే ఆసరాగా చేసుకుని ఏదో విధంగా మోసం చేసి నమ్మిన వారికి గుండె కోతను మిగులుస్తున్నారు. కూతురు పెళ్లి కోసమనో, ఇల్లు కట్టుకోవచ్చనే ఆశతో పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేయడం ఓ మధ్య తరగతి కుటుంబ లక్షణం. వారి ఆశనే పెట్టుబడిగా పెట్టి రూ.2.5 కోట్లకు పైగా దండుకుని ఉడాయించారు ఈ కిలాడి దంపతులు. వారి ఉచ్చులో చిక్కిన బాధితుల వేదన వర్ణనాతీతం.

దంతులు పద్మ, విజయ్​కుమార్​

రూ. 2.5 కోట్ల మోసం

రాష్ట్రంలో పలు చోట్ల తరచూ 'చిట్టీల పేరుతో మోసాలు' ఘటనలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. నమ్మించి రూ. కోట్లలో బాధితుల నుంచి వసూలు చేసి.. సమయం చూసుకుని ఉడాయించిన ఘటనలు ఎన్నో. తాజాగా హైదరాబాద్​ సూరారం కాలనీలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. దాదాపు 100 కు పైగా బాధితుల నుంచి రూ. రెండున్నర కోట్లకు పైగా నగదుతో ఉడాయించారు దంపతులు.

చిట్టీల పేరుతో వెలుగుచూసిన భారీ మోసం

నమ్మించి మోసం

సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణ దుకాణం నిర్వహిస్తున్న దంపతులు.. మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తమ వద్ద చిట్టీలు వేసిన వారికి ఎప్పటికప్పుడు వారు అడిగిన వెంటనే నగదు సమకూర్చేవారు. దీంతో వారిని నమ్మి స్థానికులంతా ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. దీంతో భారీ మొత్తం నగదు కూడబెట్టుకుని గత వారం.. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బాధితులు ఫోన్​ చేస్తే రేపు మాపు అంటూ సాగదీశారు. ఆ తర్వాత రెండ్రోజులకు ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేశారు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. పద్మ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

బాధలు వర్ణనాతీతం

ఈ దంపతుల బారిన పడి మోసపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. భర్త ఆరోగ్యం బాగోలేక మంచాన పడితే.. ఇంటి ఇల్లాలు ఒక్కరే కష్టపడుతూ కుమార్తె పెళ్లి కోసమని వారి వద్ద చిట్టీ వేశారు. ఆరోగ్య అవసరాల దృష్ట్యా మరొకరు. ఇదే కాకుండా బంగారం అరువు ఇచ్చిన వారితో పాటు.. అప్పులిచ్చిన వారూ ఉన్నారు. మరికొందరు మొదట్లోనే చిట్టీ పాడితే తక్కువ వస్తుందనే ఉద్దేశంతో.. చివరి వరకు ఆగిన వారున్నారు. అసలే మధ్య తరగతి బతుకులు.. ఇలా నమ్మించి మోసం చేస్తే తమ పరిస్థితి ఏం కాను అని రోదిస్తున్నారు.

ఎక్కువ వస్తుందని

"20 ఏళ్లుగా పద్మ కుటుంబంతో పరిచయం ఉంది. అప్పటి నుంచి చిట్టీలు వేస్తున్నాం. ఎప్పటికప్పుడు సమయానికి ఇచ్చేవాళ్లు. చివరికి పాడుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని ఆగాం. కానీ ఇలా మమ్మల్ని నట్టేట ముంచి ఉడాయిస్తారనుకోలేదు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం." -బాధితురాలు

"నా భర్త ఆరోగ్యం బాగాలేదు. కూతురు పెళ్లి కోసమని రూ.2 లక్షలు చిట్టీ వేశాను. కొద్ది నెలలు అయితే అయిపోతుంది. వచ్చే నెలలో పెళ్లి పెట్టుకోవాలని అనుకున్నాం. ఇంతలో మమ్మల్ని ఇలా మోసం చేస్తారని ఊహించలేదు. చాలా నమ్మకంగా ఉండేది." -బాధితురాలు

వదినా వదినా అంటూ

"వదినా.. వదినా అంటూ నాతో చనువుగా ఉండేది. ఆమె దగ్గర నేను ఏ చిట్టీలు వేయలేదు. ఇంట్లో ఫంక్షను ఉంది. నగలు లేవు.. బంగారం అరువివ్వమంటే నా మనవళ్ల ఒంటి మీద దానితో కలిపి రెండున్నర తులాలు ఇచ్చాను. ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. నాకు ఆర్థికంగా భరోసా లేదు. పోలీసులు వారిని పట్టుకుని మాకు న్యాయం చేయాలి." -బాధితురాలు

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందే వారు నివసించే ఇల్లును సైతం విక్రయించేశారనే సమాచారం కొసమెరుపు.

ఇదీ చదవండి:పంట దక్కక.. అప్పు తీర్చలేక.. ఇద్దరు అన్నదాతలు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details