తెలంగాణ

telangana

సీఎం సభకు వెళ్తూ.. ప్రమాదానికి గురైన వృద్ధురాలు మృతి

By

Published : Feb 3, 2023, 11:35 AM IST

Old Woman Died in AP: గత నెలలో సీఎం జగన్​ సభలో ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పార్వతి మృతి చెందింది. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన పార్వతి కాకినాడ జీజీహెచ్​లో చనిపోయారు.

Old Woman Died in AP
Old Woman Died in AP

Old Woman Died in AP: రాజమహేంద్రవరంలో నిర్వహించిన సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లకు తీవ్రగాయాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు పార్వతి (70) గురువారం మృతిచెందారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరానికి చెందిన ఆమె ముఖ్యమంత్రి జగన్‌ రోడ్‌ షో, బహిరంగసభ రోజు ఘటన జరిగింది.

గత నెల 3న రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బస్సు ఢీకొట్టింది. ఆమెపై నుంచి ముందుచక్రం వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి ఎడమ కాలును మోకాలిపై వరకు తొలగించారు.

భర్త పింఛను రద్దయిపోతుందనే భయంతో..:సీఎం సభకు వెళ్లకపోతే భర్తకు వచ్చే పింఛను రద్దయిపోతుందని వాలంటీర్లు బలవంతం చేయడంతోనే పార్వతి బయల్దేరారని అదేరోజు స్థానికులు చెప్పారు. పార్వతికి జీజీహెచ్‌ ఐసీయూలో అత్యున్నత వైద్యం అందించామని, కోలుకుంటున్న క్రమంలో మృతిచెందడం దురదృష్టకరమని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.హేమలతాదేవి తెలిపారు.

సీఎం సభకు ఏర్పాటుచేసిన బస్సులో వెళ్లి దిగుతూ జారిపోతే.. మరో వాహనం వచ్చి ఢీకొట్టిన వార్త అవాస్తవమని తూర్పుగోదావరి జిల్లా పోలీసు, కలెక్టర్‌ కార్యాలయాల ప్రతినిధులు గతంలోనే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన సొంత పనిమీద రాజమహేంద్రవరం వచ్చినప్పుడే ప్రమాదం జరిగిందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details