తెలంగాణ

telangana

సీతారామ, పోలవరంపై సీతమ్మసాగర్ బ్యారేజీ ప్రభావమెంత?

By

Published : Apr 8, 2022, 7:31 AM IST

Sitamma Sagar Barrage : సీతమ్మసాగర్‌, దేవాదులతో పాటు చెక్‌డ్యాం కట్టడాలు, వరద కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు అయిదు ఎత్తిపోతల నిర్మాణాలు.. ఇలా పలు అంశాలపై ఏపీ.. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనికి తెలంగాణ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన బోర్డు సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ ప్రభావం సీతారామ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుపైన ఏ మేరకు ఉంటుందో నివేదించాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది.

Sitamma Sagar Barrage
Sitamma Sagar Barrage

Sitamma Sagar Barrage : సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణ ప్రభావం సీతారామ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు పైన ఏ మేరకు ఉంటుందో నివేదించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది. దేవాదుల ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని మళ్లించడం కేంద్ర జలసంఘం అనుమతి పరిధిలో లేదని, పునర్విభజన చట్టం ప్రకారం మళ్లీ అనుమతి పొందాలని సూచించింది. ఈ మేరకు బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాసింది. సీతమ్మసాగర్‌, దేవాదులతో పాటు చెక్‌డ్యాం కట్టడాలు, వరద కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు అయిదు ఎత్తిపోతల నిర్మాణాలు.. ఇలా పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. దీనికి తెలంగాణ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన బోర్డు ఈ లేఖలో పలు అంశాలు పేర్కొంది.

  • దుమ్ముగూడెం ఆనకట్ట పూర్తి స్థాయి నీటినిల్వ మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని పది టీఎంసీల నీటి ఆవిరి ఉంటుందని అంచనా వేసి ఉండొచ్చని, అప్పుడు విద్యుదుత్పత్తి 24 మెగావాట్లు మాత్రమేనని, అయితే సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణంతో సామర్థ్యం పెరగడంతో పాటు విద్యుదుత్పత్తి చేసే నీటిమట్టం పెరిగిందని, వీటిని లెక్కలోకి తీసుకొని మళ్లీ అంచనా వేయాల్సి ఉందని పేర్కొంది. సీతమ్మసాగర్‌ నిర్మాణానికి సంబంధించిన వివరాలతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను అందజేయాలని కోరింది. సీతారామ ఎత్తిపోతలపైన, పోలవరంపైన ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న వివరాలను బోర్డుతో పాటు కేంద్ర జలసంఘానికి అందజేయాలంది.
  • కాళేశ్వరం ద్వారా మళ్లించే నీటిలో 25 టీఎంసీలు దేవాదుల ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు ఇవ్వడానికి మళ్లీ అనుమతి పొందాలని సూచించింది. దేవాదుల ఆయకట్టు 6.46 లక్షల ఎకరాలని, ఇందులో 1.54 లక్షల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం నుంచి నీటిని ఇస్తున్నట్లు తెలంగాణ పేర్కొనగా, దేవాదులకు కేంద్రజలసంఘం సాంకేతిక సలహా కమిటీ 106వ సమావేశంలో ఇచ్చిన అనుమతిలో కానీ, కాళేశ్వరానికి 136వ సమావేశంలో ఇచ్చిన అనుమతిలో కానీ ఈ అంశం లేదు కాబట్టి కొత్తదిగానే పరిగణించాల్సి ఉంటుందని బోర్డు పేర్కొంది.
  • గోదావరి ఎగువ ప్రాంతంలో నిర్మిస్తోన్న చెక్‌డ్యాంల కింద నేరుగా ఆయకట్టు లేదని, భూగర్భజలాల అభివృద్ధికి మాత్రమే చేపట్టామని, వరదకాలువ నుంచి చెరువులకు నీటిని నింపడానికి అయిదు ఎత్తిపోతల పథకాలను చేపట్టడం లేదని తెలంగాణ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన బోర్డు, ఈ రెండింటిపై తదుపరి వివరణ అవసరం లేదని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details