తెలంగాణ

telangana

కర్మకాండకని వెళ్లారు.. వాగులో చిక్కుకున్నారు.. ఎలా జరిగిందంటే..?

By

Published : Sep 10, 2022, 9:26 PM IST

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని మున్నేరులో కర్మకాండలు చేయడానికి వెళ్లిన కుటుంబసభ్యులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక బయటకు వచ్చే సమయంలో ఒక్కసారిగా ట్రాక్టర్ మునిగిపోయేంత నీరు చుట్టూ చేరటంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. గ్రామస్థులు వారిని గమనించి బలమైన తాళ్ల సాయంతో వంతెన పైకి చేర్చారు. అసలేం జరిగిందంటే..?

People stuck in the river
వాగులో చిక్కుకున్న ప్రజలు

వాగులో చిక్కుకున్న వారిని కాపాడుతున్న స్థానికులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన చాగంటి దైవదీనం రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ఈ మేరకు మృతుని చిన్నకర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు మున్నేరు వద్దకు వచ్చారు. అప్పటికే ఏటిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఏటి మధ్యలో ఉన్న ఇసుక దిబ్బపై కర్మకాండలు చేసేందుకు కుటుంబ సభ్యులు, పూజారి అంతా కలిసి ట్రాక్టర్​పై చేరారు.

కర్మ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారంతా అదే ట్రాక్టర్​పై ఎక్కి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఏటిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ట్రాక్టర్ మునిగిపోయేంత నీరు చుట్టూ చేరటంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. దీంతో ట్రాక్టర్​పై ఉన్న వారంతా ప్రాణ భయంతో కేకలు వేశారు. వంతెనపై వెళ్తున్న ప్రయాణికులు, గ్రామస్థులు గమనించి వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. తాళ్ల సాయంతో అతి కష్టంమీద ట్రాక్టర్​పై ఉన్న ఐదుగురిని వంతెనపైకి చేర్చారు. ట్రాక్టర్​కు తాళ్లు కట్టి నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా పట్టుకున్నారు. ఈలోగా జేసీబీ తీసుకువచ్చి దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.

ఇవీచదవండి:

ABOUT THE AUTHOR

...view details