తెలంగాణ

telangana

దెబ్బతీసిన కరోనా పరిస్థితులు.. ఆర్టీసీకి భారీ నష్టం!

By

Published : Apr 10, 2021, 7:31 AM IST

టీఎస్​ఆర్టీసీ రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంది. ప్రతి ఏటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి రూ.2,272.59 కోట్లు నష్టం వచ్చింది. తుది గణాంకాలు వచ్చేటప్పటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2,500 కోట్ల వరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

tsrtc in losses
ఆర్టీసీ నెత్తిన భారీ నష్టం

తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంది. ఫిబ్రవరి చివరి నాటికి రూ.2,272.59 కోట్లు నష్టం వచ్చింది. మార్చి నెలలో మరో రూ.200 నుంచి రూ.230 కోట్ల వరకు నష్టం వస్తుందని అంచనా. సాధారణంగా మార్చిలో లెక్కలు, పునర్మూల్యాంకన తరువాత ఏప్రిల్‌ చివరిలో తుది అంకెలను ప్రకటించటం ఆనవాయితీ. తుది గణాంకాలు వచ్చేటప్పటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి నష్టం చరిత్రలో తొలిసారిగా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా.
లాక్‌డౌన్‌లోనే రూ.750 కోట్లు...
ఛార్జీల పెంపుతో కొంతమేరకైనా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో కరోనా ముప్పు ముంచుకు వచ్చింది. 2020 మార్చి మూడో వారం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. సుమారు 58 రోజులపాటు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ఈ కాలంలో రావాల్సిన సుమారు రూ.750 కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. మే 18వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ ప్రజా రవాణాను వినియోగించుకునేందుకు చాలారోజుల పాటు ప్రజలు ఆసక్తి చూపలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేక సుమారు 212 రోజులపాటు అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడపకపోవటం నష్టాలు పెరగటానికి ఓ కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టటం లేదన్న విమర్శలు లేకపోలేదు. సంస్థను గట్టెక్కించేందుకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక దస్త్రాలకే పరిమితం అయ్యింది. 2017 మధ్య నుంచి ఆర్టీసీకి పూర్తి స్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేకపోవటం విశేషం. అధికారులు తెచ్చిన నూతన ఆవిష్కరణలు శూన్యం. సీఎం ఆలోచనల నుంచి పుట్టిన మినీ బస్సుల ప్రయోగం విఫలమైంది.

ఆర్టీసీ నష్టాలు

సంవత్సరం రూ.కోట్లలో
2020-21 2,500
2019-20 1,002.02
2018-19 928.67

ఇదీ చదవండి:'బరాబర్‌ బరిలో దిగుతా.. జులై 8న పార్టీ పేరు ప్రకటిస్తా'

ABOUT THE AUTHOR

...view details