తెలంగాణ

telangana

'కాంగ్రెస్​ పార్టీ అంటేనే ఓ గతం.. ప్రస్తుతమంతా ఆగమాగం..'

By

Published : May 26, 2022, 3:38 PM IST

Harish Rao Comments: హైదరాబాద్​లోని అమీర్​పేటలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. వైద్యసిబ్బంది పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. వైద్యరంగంపై కాంగ్రెస్​ నేతలు జగ్గారెడ్డి, గీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

minister-harish-rao-fire-on-congress-leader-geethareddy-and-jaggareddy
minister-harish-rao-fire-on-congress-leader-geethareddy-and-jaggareddy

Harish Rao Comments: కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. హైదరాబాద్​లోని అమీర్​పేటలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. వైద్య రంగంపై కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్​రావు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తుందని ఉద్ఘాటించారు.

మరోవైపు ఆస్పత్రి వైద్యసిబ్బందిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని సందర్శించిన హరీశ్​రావు.. పనితీరు మెరుగుపర్చుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఆస్పత్రిలో 14మంది వైద్యులు ఉండి కూడా.. నెలలో కేవలం 14 శస్త్రచికిత్సలు మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ క్రింద చేసిన చికిత్సలకు సబంధించి వివరాలు లేకపోవడంతో మండిపడ్డారు. రోగులు ఆస్పత్రికి వచ్చేవిధంగా తీసుకోవల్సిన చర్యలను వైద్యులకు సూచించారు.

మంత్రి తలసానితో కలిసి ఆస్పత్రిలో కలియదిరిగిన హరీశ్​రావు పలువురు రోగులతో ముచ్చటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. 10 కోట్లు వెచ్చించి 50 పడకల ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఆస్పత్రిలో ఒక జనరేటర్, లిఫ్ట్​తో పాటు పలు సౌకర్యాలు కల్పించాలని మంత్రి తలసాని కోరగా.. రెండు మూడు రోజుల్లో రివ్యూ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

"ప్రజారోగ్యం కోసం సర్కారు వేల కోట్లు వెచ్చిస్తోంది. గీతారెడ్డి ఓ వైద్యురాలై ఉండి రాష్ట్రంలోని వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహంచకపోవడం చాలా బాధాకరం. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి చేస్తే.. ఇదే జగ్గారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ అంటే గతం.. ప్రస్తుతమంతా ఆగమాగమే. కరోనా సమయంలో సీఎం కేసీఆర్.. గాంధీ అస్పత్రికి అత్యున్నత సౌకర్యాలు కల్పించారు. ఉస్మానియా అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించాం. 70 ఏళ్లలో మూడు కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ఘనత అయితే.. ఏడేళ్లలో 33 కళాశాలలు కట్టిన ఘనత తెరాసది." - హరీశ్​ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

'కాంగ్రెస్​ పార్టీ అంటే ఓ గతం.. ప్రస్తుతమంతా ఆగమాగం..'

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details