తెలంగాణ

telangana

Cleaning Service : 'మీకెందుకు శ్రమ.. మేం చేసి పెడతాం'

By

Published : Nov 1, 2021, 10:17 AM IST

దీపావళి సమయంలో ఇంట్లోని దుమ్ముదులిపి, శుభ్రంగా కడిగి ఎక్కడి వస్తువులను అక్కడ సర్దేందుకు గృహిణులు చాలా శ్రమిస్తుంటారు. ఒక్కోరోజు ఒక్కో గదిని శుభ్రం చేస్తుంటారు. భార్యాభర్తలు ఉద్యోగం చేసేవారైతే ఇబ్బందులు తప్పవు. ‘మీకెందుకు ఈ శ్రమ.. మేం చేసే పెడతాం’ అంటున్నాయి క్లీనింగ్‌ సర్వీసెస్‌ సంస్థలు(Cleaning Service companies). ఇలాంటి సేవలను కోరుకునే వారి సంఖ్య హైదరాబాద్‌లో ఏటేటా పెరుగుతుండటంతో ఈ రంగంలోకి కొత్తగా పలు సంస్థలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే పాతుకుపోయిన సంస్థలతో పోటీపడుతున్నాయి.

Cleaning Service
Cleaning Service

ఇల్లు పూర్తిగా...

పండగ వస్తుండటంతో ఎక్కువ మంది ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలని కోరుకుంటున్నారని క్లీనింగ్‌ సర్వీసెస్‌(Cleaning Service companies) ప్రతినిధులు చెబుతున్నారు. డీప్‌ క్లీనింగ్‌లో వంట గది, పడక గది, స్నానాల గదులు, గదుల మూలలు, వస్తువులను పరిశుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. కొందరు కిచెన్‌ వరకు, మరికొందరు సోఫా వరకు సేవలను వినియోగించుకుంటున్నారు. వినియోగించుకున్న సేవల ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

పెద్ద ఖర్చేమీ కాదు

కొవిడ్‌ భద్రత దృష్ట్యా చాలామంది పని మనుషులను తాత్కాలికంగా మాన్పించారు. ఇంటిని స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు. ఏడాదికోసారి ప్రొఫెషనల్‌ క్లినింగ్‌ సేవలను ఎంచుకోవడం అంత పెద్ద ఖర్చేమీ కాదని.. ఈ రంగంలో సేవలందిస్తున్న సంస్థలు చెబుతున్నాయి. 1,200 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన రెండు పడకల గది డీప్‌ క్లీనింగ్‌కు రూ.4 వేలు అవుతుందని చెబుతున్నారు.

రూ.150 కోట్ల మార్కెట్‌...

ఇంటిని శుభ్రం చేయడం ఇప్పుడు అత్యంత డిమాండ్‌ ఉన్న సేవల్లో ఒకటి. హైదరాబాద్‌లో చాలాకాలం నుంచి ఈ సేవలను వేర్వేరు సంస్థలు అందిస్తున్నప్పటికీ, కొవిడ్‌ తర్వాత ప్రొఫెషనల్‌ సంస్థలకు డిమాండ్‌ పెరిగింది. యాప్‌ ద్వారా వీరి సేవలను బుక్‌ చేసుకునే అవకాశం ఉండటంతో సులభంగా ఎంచుకుంటున్నారు. ఇండియా హౌస్‌హోల్డ్‌ క్లినింగ్‌ మార్కెట్‌ అవుట్‌లుక్‌-2021 ప్రకారం కొన్ని నెలలుగా క్లీనింగ్‌ సేవలను కోరుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం క్లీనింగ్‌ సేవల మార్కెట్‌ రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దేశవ్యాప్త మార్కెట్‌ రూ.2 వేల కోట్లు. వచ్చే ఐదేళ్లలో 15 వేల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐటీ ఉద్యోగులే ఎక్కువగా..

చాలా ఏళ్లపాటు ఐటీ రంగంలో పనిచేసిన అనంతరం 24 సీప్స్‌తో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌లోకి వచ్చా. ఇప్పుడు క్లీన్‌షీల్డ్‌ పేరుతో కొత్తగా ఇంటిని శుభ్రం చేసే సేవలను కొద్దిరోజుల క్రితమే ఐటీ కారిడార్‌లో ప్రారంభించాం. మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, కోకాపేట, ఖాజాగూడ వరకు సేవలు అందిస్తున్నాం. డీప్‌ క్లీనింగ్‌, కిచెన్‌ క్లీనింగ్‌ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్నవారు, కొవిడ్‌తో నగరం వదిలి సొంత ఊర్లకు వెళ్లిన వారు వారి ఇళ్లను శుభ్రం చేయాలని కోరుతున్నారు. ముగ్గురు, నలుగురు సిబ్బంది వెళితే రెండు పడకల గదిని శుభ్రం చేసేందుకు సగం రోజు పడుతుంది. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్లు, విల్లాలను శుభ్రం చేయించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details