తెలంగాణ

telangana

ఆరేళ్లలో తెలంగాణకు లక్షన్నర కోట్లు ఇచ్చాం : నిర్మల

By

Published : Feb 10, 2020, 4:40 PM IST

Updated : Feb 11, 2020, 4:17 PM IST

ఆరేళ్లలో పన్ను వాటా కింద రాష్ట్రానికి రూ.85,013 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రంగా ఉందని వెల్లడించారు. లోక్‌సభలో కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

nirmala seetharaman
nirmala seetharaman

తెలంగాణ ఏర్పడ్డాక గత ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ.1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. పద్నాలుగో ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక గత అయిదేళ్లలో రూ.1,41,735 కోట్లు ఇచ్చామని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదు

‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితిలో ఉందా? ఉంటే ఆ వివరాలేంటి? దానిపై కేంద్రం ఎలా స్పందిస్తోంది? గత ఆరేళ్లలో రాష్ట్రానికి ఏ పద్దు కింద ఎంత నిధులు విడుదల చేశారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు నిధులూ విడుదల చేయలేదన్నది నిజమా?’ అన్న ప్రశ్నలకు నిర్మలాసీతారామన్ సమాధానమిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదని స్పష్టంచేశారు. ‘

అందులో నిజం లేదు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతుల ప్రకారం 2014-15 నుంచీ రాష్ట్రం రెవెన్యూ మిగులులోనే ఉందని తెలిపారు. రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి (2014-15 నుంచి 2019-20 వరకు బడ్జెట్‌ అంచనాల ప్రకారం) పెరుగుతున్నప్పటికీ అది 14వ ఆర్థికసంఘం నిర్దేశించిన పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ప్రకారమే ఉందిని పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి అదనపు నిధులూ విడుదల చేయలేదనడం నిజం కాదన్నారు.

మార్గదర్శకాలకు అనుగుణంగానే...

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రానికి గ్రాంట్లు విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్లు, నీతిఆయోగ్‌లు సాధారణ ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తాయని వెల్లడించారు.

కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు

  1. గ్రామీణాభివృద్ధి కోసం రూ.3,853.44 కోట్లు
  2. ప్రాథమిక, ఉన్నత విద్య, అక్షరాస్యత కోసం రూ.2,994 కోట్లు
  3. పారిశుద్ధ్యం, తాగునీటి కోసం రూ.2,189 కోట్లు
  4. వైద్య ఆరోగ్యం కోసం రూ.1,852.54 కోట్లు
  5. పట్టణాభివృద్ధికి రూ.1,752.78 కోట్లు
  6. వ్యవసాయం కోసం రూ.1,078 కోట్లు
  7. మహిళా శిశు సంక్షేమం కోసం, రూ.993.85 కోట్లు
  8. జాతీయ రహదారుల కోసం రూ.763.36 కోట్లు
  9. గిరిజనాభివృద్ధి కోసం రూ.485.84 కోట్లు
  10. సామాజిక న్యాయం, సాధికారత కోసం రూ.388.14 కోట్లు
  11. మైనార్టీల సంక్షేమం కోసం రూ.296.51 కోట్లు
  12. జలవనరుల శాఖ నుంచి కేవలం రూ.62.6 కోట్లు

పౌరవిమానయానం, సాంస్కృతికం, గణాంకాలు, కార్యక్రమాల నిర్వహణ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు.

ఇదీ చూడండి:'సహకార' లొల్లి: కాంగ్రెస్, తెరాస శ్రేణుల రాళ్లదాడి

Last Updated : Feb 11, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details