తెలంగాణ

telangana

Viveka Murder Case Updates : వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

By

Published : Feb 19, 2022, 10:39 AM IST

Viveka Murder Case Updates : ఏపీ మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ డీఐజీ చౌరాసియా.. ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసులో మొదటి నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సిట్ దర్యాప్తు నివేదికలు కావాలంటూ పులివెందుల కోర్టులో వేసిన పిటిషన్‌పై... సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది.

viveka murder case
వివేకా హత్య కేసు

వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

Viveka Murder Case Updates : ఆంధ్రప్రదేశ్​ మాజీ ఎంపీ వైఎస్‌. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో.. దిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక అధికారి కడప జిల్లాకు రావడం చర్చనీయాంశమైంది. సీబీఐ డీఐజీ చౌరాసియా.. కడపలో మకాం వేసి కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలోనే ఉండి.. సంబంధిత సీబీఐ అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటికే 2 అభియోగపత్రాలు దాఖలు చేసి.. ఐదుగురు నిందితులపై అభియోగాలు మోపిన తరుణంలో.. సీబీఐ డీఐజీ కడపకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసులో మరికొందరి ప్రమేయం ఉందని.. సీబీఐ భావిస్తూ.. ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసు విచారణ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో సాగింది. ఇప్పుడు డీఐజీ స్థాయి అధికారి రావడంతో.. దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వివేకా కుమార్తె సునీత హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్నారు. ఇవాళ లేకుంటే రేపు.. సీబీఐ డీఐజీని ఆమె కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఐజీ పులివెందుల వెళ్లి.. హత్య జరిగిన వివేకా ఇంటిని పరిశీలించే వీలుందని సమాచారం.

కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఎర్ర గంగిరెడ్డి..

Viveka Murder Case Latest News : వివేకా హత్య కేసులో మొదటి నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి.. పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు ముందు 3 సార్లు సిట్‌ అధికారులు విచారణ చేశారని.. సిట్‌-1, సిట్‌-2 నివేదికలను సీబీఐ అధికారులు.. కోర్టుకు సమర్పించాలని ఎర్ర గంగిరెడ్డి పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు గతంలో.. 13 వందల మంది అనుమానితులను విచారించారు. పలువురు రాజకీయ ప్రముఖులను, కీలక అనుమానితులనూ విచారించారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. వారిని కస్టడీకి తీసుకుని వాంగ్మూలాలు నమోదు చేయించారు. అవన్నీ అప్పట్లో సిట్‌ అధికారులు పులివెందుల కోర్టుకు సమర్పించగా.. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తులో భాగంగా.. సీబీఐ వాటిని స్వాధీనం చేసుకుంది. సీబీఐ తన దర్యాప్తులో 2 సిట్ బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకోలేదనే అనుమానంతో.. ఎర్ర గంగిరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సీఆర్​పీసీ సెక్షన్‌ 207 ప్రకారం.. సిట్‌-1, సిట్‌-2 నివేదికలను కోర్టుకు సమర్పించే విధంగా సీబీఐ అధికారులను ఆదేశించాలని... ఎర్ర గంగిరెడ్డి అభ్యర్థించారు. ఎర్ర గంగిరెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. తమ దర్యాప్తునకు ఎంతమేరకు నివేదికలు అవసరమవుతాయో.. వాటినే పరిగణనలోకి తీసుకుంటామనే విధంగా సీబీఐ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు వినేందుకు కోర్టు... ఈ నెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details