ETV Bharat / state

గ్రానైట్‌ అక్రమాలపై సీబీఐ కన్ను.. అక్రమార్కుల గుండెల్లో గుబులు

author img

By

Published : Feb 19, 2022, 8:00 AM IST

CBI on Granite Illegal Mining: గ్రానైట్‌ దందాలోని లొసుగులపై సీబీఐ నజర్‌ పెట్టడంతో ఈ వ్యవహారం కరీంనగర్​ జిల్లాలో మరోసారి కలకలం రేపుతోంది. జిల్లాలో వ్యాపారాన్ని సాగించే పలు కంపెనీలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించాయనే విషయమై గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఫిర్యాదులపై సీబీఐ ఫోకస్​ చేసింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు గ్రానైట్‌ వ్యాపారుల్లో అలజడి మొదలైంది. కొన్నేళ్ల కిందట జరిగిన మోసాల గుట్టును విప్పేందుకు సీబీఐ రంగంలోకి దిగారనే సమాచారం పలువురిని ఆందోళనలో పడేస్తోంది.

cbi inquiry on granite illegal mining
గ్రానైట్​ అక్రమాలపై సీబీఐ కన్ను

CBI on Granite Illegal Mining: కరీంనగర్‌ గ్రానైట్‌ గనుల తవ్వకాలు, ఎగుమతుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, అందుకు కారణమైన అధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదుపై సీబీఐ స్పందించింది. ఈ మేరకు విశాఖ విభాగానికి సంబంధించిన అధికారులకు సీబీఐ కేంద్ర కార్యాలయం సమాచారం పంపగా.. వారు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కరీంనగర్‌ జిల్లాలోని పలు సంస్థలు గ్రానైట్‌ తవ్వకాలు, ఎగుమతుల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయంటూ భాజపా నేత పేరాల శేఖర్‌రావు గత ఏడాది జనవరి 11న దిల్లీ సీబీఐ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించాల్సిందిగా దిల్లీ సీబీఐ అధికారులు విశాఖపట్నం విభాగానికి లేఖ రాశారు. ఫిర్యాదు కాపీలో 2013 నాటి ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ విభాగం నివేదిక లేదని, దాన్ని కూడా పంపాలంటూ విశాఖపట్నం సీబీఐ ఎస్పీ విమలాదిత్య ఫిర్యాదుదారు శేఖర్‌రావుకు ఈ ఏడాది జనవరి 19న లేఖ రాశారు. ఈ మేరకు విజిలెన్స్‌ నివేదిక పంపినట్లు శేఖర్‌రావు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా విశాఖపట్నం సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి భాజపా ఎంపీ బండి సంజయ్‌ 2019 జులైలో ఫిర్యాదు చేయగా.. మహేందర్‌రెడ్డి 2021 జులై 8న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి ఫిర్యాదు చేశారు.

అక్రమంగా 7.68 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ ఎగుమతి

CBI on Granite Mining in Karimnagar : మొత్తం 7.68 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్‌ పోర్టుల నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, దీనికి సంబంధించి సీనరేజీగా చెల్లించాల్సిన సుమారు రూ.125 కోట్లు ఎగ్గొట్టారని, పెనాల్టీలో కలుపుకుంటే ఇది రూ.749.66 కోట్లు అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్‌కు చెందిన తొమ్మిది సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులో శేఖర్‌రావు తెలిపారు.

అసలేం జరిగిందంటే

అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గ్రానైట్‌ వ్యాపారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జిల్లా నుంచి వెళ్లిన పెద్ద బండరాళ్లను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సమయంలో పలు సంస్థలు తరలించిన రాయికన్నా తక్కువ సంఖ్యలో కొలతలు తీసి అక్రమాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తోపాటు న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డిలు వేర్వేరు సమయాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌)కి ఫిర్యాదుల్ని అందించారు. 2013లో విజిలెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో డొల్లతనం బయటపడిందని ఆయా గ్రానైట్‌ సంస్థలు రూ.124.94కోట్ల ఫెనాల్టీని ఐదింతలుగా రూ.749 కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారని వినతిని అందించారు. దీనిపై గతంలో ఒకింత కదలిక కనిపించినా.. తరువాత దర్యాప్తు ముందుకు సాగలేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌రావు ఫిర్యాదుతో సీబీఐ ఆయా షిప్పింగ్‌ యార్డులలో విచారణ జరిపినట్లు తెలిసింది.

ఇప్పటివరకూ చెల్లించలేదు

కానీ జరిమానాలు చెల్లించకుండా సదరు వ్యాపారులు ఈ జరిమానాను ఒక వంతుకు తగ్గించుకున్నాయనేది సమాచారం. అయినప్పటికీ ఈ మొత్తాన్ని చెల్లించడంలోనూ ఇప్పటి వరకు జాప్యం జరుగుతుందనే విషయమై ఫిర్యాదుదారులు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. అసలు నిగ్గును తేల్చడంతోపాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వ్యాపార లావాదేవీలు, ఎగుమతులపై దృష్టిసారించాలని విన్నవించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటి విచారణ ఎక్కడి వరకెళ్తుందనేది ఇంకొన్ని రోజుల్లో తేటతెల్లమవనుంది.

ఇదీ చదవండి: కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.