తెలంగాణ

telangana

వినూత్న పంథాలో సృజన.. ప్రధాని ప్రశంసలు

By

Published : Mar 29, 2021, 5:11 PM IST

ఆయనొక ఆచార్యుడు.. విద్యార్థులను భావిభారత పౌరులుగా మలిచినట్లే పనికిరాని వ్యర్థాలతోనూ కళాకండాలు సృష్టించడంలో దిట్ట. ఎందుకూ పనికిరాని ఇనుప ముక్కలకు సైతం తన కళతో జీవంపోయగల నేర్పరి. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఎన్నో శిల్పాలు దేశంలోని వివిధ నగరాల్లోని స్క్రాప్‌ పార్కుల్లో కనువిందు చేస్తున్నాయి. అద్భుతమైన సృజనతో వినూత్న పంథాలో ముందడగు వేస్తున్న శ్రీనివాస్‌లోని కళను సాక్షాత్తు దేశ ప్రధాని గుర్తించారు. మన్‌కీ బాత్‌లో మోదీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.

anu professor srinivas padakandla latest news, pm modi praise a
వినూత్న పంథాలో సృజన.. ప్రధాని ప్రశంసలు

వినూత్న పంథాలో సృజన.. ప్రధాని ప్రశంసలు

సముద్రంలోని చేపలు, ఆకాశంలో ఎగిరే గుర్రాలు, అడవిలోని సింహాలు, జీబ్రాలు.. ఏవైనా సరే ఆయన మస్తిష్కంలో కొత్తగా రూపుదిద్దుకుంటాయి. పనికిరాని ఇనుప వ్యర్థాలకు ప్రాణం పోస్తూ అచ్చుగుద్దినట్లు వాటిని రూపొందించడంలో దిట్ట. ఆంధ్రప్రదేశ్​లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్‌ విభాగాధిపతిగా పనిచేస్తున్న పడకండ్ల శ్రీనివాస్‌.. చదువుకునే రోజుల్లోనే చెక్క, రాళ్లు, ఇనుము వంటి వ్యర్థాలను కళాకృతులుగా తీర్చిదిద్దడంలో సాధన చేశారు. ఏయూలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, బెనారస్‌ విశ్వవిద్యాయంలో మాస్టర్ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ పూర్తిచేశారు. హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాయంలో కొంతకాలం సహాయ అధ్యాపకులుగా పని చేసిన కాలంలోనూ ఎన్నో కళాఖండాలు రూపొందించారు. ఎందుకూ పనికిరాని వ్యర్థాలతో చక్కని కళాకృతులు రూపొందించడమే గాక.. వాటిని సమాజానికి ఉపయోగపడేలా ఎలా మలచాలనే విషయంపై సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. ఆయన ఆకృతులు ఎంతో ఆలోచింపజేసేవిలా ఉంటాయి.

శిల్పాలను రూపొందించి..

పల్లెలు, పట్టణాలు, నగరాల్లో దొరికే వ్యర్థాలనే.. తన శిల్పాలకు ముడి వస్తువులుగా ఎంచుకున్నారు. వాటితోనే అద్భుతాలను సృష్టిస్తుండేవారు. ఆ క్రమంలోనే 2016లో ఏపీలోని విజయవాడ నగరపాలక సంస్థతో కలిసి.. వ్యర్థాలతో శిల్పాలను తయారుచేసే శిబిరం నిర్వహించారు. నగరంలోని ఆటోమొబైల్‌ వ్యర్థాలను కళాకృతులుగా మలచి.. ప్రత్యేకంగా స్క్రాప్‌ పార్కును పాతబస్టాండ్‌కు దగ్గరలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గుంటూరు, అనంతపురం, కర్నూలు నగరాల్లో శిల్పాలను రూపొందించి.. కూడళ్లు, పార్కుల్లో ఏర్పాటు చేశారు. అనంతరం దేశంలో మధురై, చెన్నై, కొచ్చి, తిరునల్వేలి, తూత్తుకుడిలో శిబిరాలను నిర్వహించి.. పార్కులు, పబ్లిక్‌ ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, కూడళ్లలో శిల్పాలను ఏర్పాటు చేశారు. ఆయన సేవలను గుర్తించి.. 2018లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది.

మోదీ మెచ్చుకోవడం

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు పడకండ్ల శ్రీనివాస్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫైన్‌ఆర్ట్స్‌కి మంచి ఆదరణ ఉందని.. ప్రదర్శనలకు అమితమైన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత ఆదరణ పెరగాలని అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్‌లోని కళను దేశ ప్రధాని గుర్తించడం తెలుగువారికి ఎంతో గర్వకారణమని ఏపీలోని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కొనియాడారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు.

ఇదీ చదవండి :'అపోహలు వద్దు... ప్రతి ఒక్కరూ టీకా తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details