తెలంగాణ

telangana

వారానికి 70 గంటలు పనిచేస్తే - ధనికులయ్యేది ఉద్యోగులా? యజమానులా?

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 5:31 PM IST

Updated : Dec 10, 2023, 9:10 AM IST

Working 70 Hours A Week Pros And Cons In Telugu : నేటి యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని.. ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ మన యువతీయువకులు బాగా కష్టపడి పనిచేసి, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దితే.. సమస్యలు అన్నీ తీరిపోతాయా?

Working 70 Hours a Week advantages and disadvantages
Working 70 Hours a Week pros and cons

Working 70 Hours A Week Pros And Cons : అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం చేరాలంటే.. నేటి యువత వారానికి కనీసం 70 గంటలైనా పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇది చాలా మంచి ఆలోచన అని చెప్పకతప్పదు.

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, కచ్చితంగా యువత కష్టపడి పనిచేయాలి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత జపాన్​, జర్మనీ ఇలానే కష్టపడి పనిచేసి, అభివృద్ధి సాధించాయి. అందుకే మన దేశ యువతీయువకులు కూడా ఇలానే పనిచేయాలని నారాయణమూర్తి ఇచ్చిన సలహాకు.. పలువురు బడా సంస్థలు యజమానులు, సీఈవోలు మద్ధతు ఇస్తున్నారు.

అయితే ఇక్కడ ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే.. దేశం సంపన్నం కావడం అంటే.. ప్రజలు సంపన్నులు కావడమా? కార్పొరేట్ సంస్థలు, వాటి యాజమానులు లాభాలు సంపాదించడమా?

కొంత మంది చేతుల్లోనే సంపద!
ప్రపంచంలో జీడీపీ ర్యాంకింగ్స్​లో మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. అంటేఈ లెక్కన మన దేశం కచ్చితంగా సంపన్న దేశమే. దీనిని చూసి మనం గర్వించాల్సిందే. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మన భారతీయులు అందరూ సంపన్నులుగానే ఉన్నారా?

  • భారతదేశంలో 60శాతం సంపద కేవలం 5 శాతం మంది ధనికుల చేతిలో ఉంది. దేశంలోని చివరి 50 శాతం మంది సామాన్యుల దగ్గర కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉంది. Oxfam India రిపోర్ట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
  • Survival of the Riches: The India Story నివేదిక ప్రకారం, దేశ ప్రజలు కష్టపడి పని చేసి సంపద సృష్టిస్తుంటే.. ఆ సంపదలో 40 శాతం నేరుగా 1 శాతం ఉన్న బిలయనీర్స్ జేబుల్లోకి పోతోంది. సమాజంలో అట్టడగున ఉన్న 50 శాతం సామాన్యులకు మాత్రం కేవలం 3 శాతం మాత్రమే చేరుతోంది.

ధనవంతులు పెరుగుతున్నారు!
2020 నుంచి 2022 వరకు ఉన్న గణాంకాలను చూసుకుంటే.. దేశంలోని బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 166కు పెరిగింది. అంటే దేశ ప్రజలు సృష్టించిన సంపద.. కొద్ది మంది ధనవంతుల ఇళ్లల్లోనే పోగుపడుతోంది. కానీ కష్టించి పనిచేసే పేదల జీవితాలు.. ఏ మాత్రం మెరుగుపడడం లేదు. ఇదంతా చూస్తుంటే.. మన భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందో, కలుగుతోందో తెలుసుకోవచ్చు.

ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే.. ధనవంతులు అవుతారా?
భారతీయ యువతీయువకులు ఉన్నత చదువులు చదువుకొని, "కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగాలు కల్పించడం మహాప్రభో" అని ప్రభుత్వాలను, ప్రైవేట్ సంస్థలను వేడుకుంటున్నారు. సింపుల్​గా చెప్పాలంటే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు.

మరికొందరు తమ చదువులకు, సామర్థ్యాలకు తగిన ఉద్యోగాలు లేక 'అల్ప నిరుద్యోగం'తో బాధపడుతున్నారు. ఉదాహరణకు ఒక మేనేజర్ స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి, బంట్రోతుగా పనిచేస్తూ జీవితాన్ని వెల్లబుచ్చుతున్నాడు.

ఉద్యోగం సంపాదించినవారు సుఖంగా ఉన్నారా?
ఉద్యోగం సంపాదించిన వారిలో రెండు రకాల కేటగిరీలవారు ఉన్నారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు, మరొకరు ప్రైవేట్ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ నీతికి, నిజాయితీకి మారుపేరుగా ఉండి, కర్తవ్య నిర్వహణే ధ్యేయంగా పనిచేసేవారు కొందరు ఉన్నారు. ఇది నిజం. కానీ పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారనేది కఠోరమైన వాస్తవం. దేశం వెనుకబడి ఉండడానికి ఇలాంటివారే కారణం అని చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కరలేదు.

ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగుల సంగతి చూద్దాం. సరైన శక్తి, సామర్థ్యాలు లేకుండా ఎవ్వరూ ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించలేరు. ఇలా సంపాదించినవారు కచ్చితంగా కష్టపడి పనిచేయాల్సిందే. ఎందుకంటే.. పనిచేయని, సామర్థ్యం లేని ఉద్యోగులను ప్రైవేట్ సంస్థలు ఏ మాత్రం ఉపేక్షించవు.

మానసిక ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?
ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల చేత వీలైనంత ఎక్కువ సమయం, ఎక్కువ పని చేయించాలని భావిస్తాయి. కొన్ని సంస్థలు అయితే ఎక్స్​ట్రా డ్యూటీ కూడా చేయమంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సెలవులను కూడా రద్దు చేస్తాయి. ఇవన్నీ ఆ ఉద్యోగుల మీద ఒత్తిడిని పెంచుతాయి.

ప్రాజెక్టుల విషయానికి వస్తే.. అది మరింత దారుణంగా ఉంటుంది. ఒక నెలలో చేయాల్సిన పనిని కేవలం 10 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని ఉద్యోగులకు టార్గెట్ విధిస్తూ ఉంటారు. దీని వల్ల ఆ పనిని పూర్తి చేయడానికి సదరు ఉద్యోగి ఓవర్ టైమ్ పనిచేస్తాడు. లేకుంటే బాస్​ తిడతాడని, ఉద్యోగం పోతుందనే భయం. ఈ మానసిక సంఘర్షణతోనే ఉద్యోగుల జీవితాలు గడిచిపోతున్నాయి.

ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి!
షిఫ్ట్​ల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని సంస్థలు నైట్ షిప్ట్ తరువాత, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెక్ట్స్​ షిఫ్ట్ కూడా పనిచేయిస్తుంటాయి. దీని వల్ల వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనితో తాము కష్టపడి సంపాదించినది అంతా వైద్యానికి దారపోసే పరిస్థితి ఏర్పడుతుంది.

మరీ ముఖ్యంగా టైమ్​ బేస్డ్ ప్రాజెక్ట్​ చేసేవారు.. టార్గెట్​లోగా పనిని పూర్తి చేయలేక తీవ్రమైన ఒత్తిడికి గురువుతారు. దీనితో వారు అతిగా టీ, కాఫీలు, డ్రింక్స్ తాగుతుంటారు. ఒత్తిడిలో అతిగా జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి.

మరికొన్ని ఉద్యోగాలు పూర్తిగా కూర్చొని చేయాల్సి ఉంటుంది. చూడడానికి ఇది సుఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దీని వల్ల శరీరానికి సరైన వ్యాయామం లేక.. నిద్రలేమి, తలనొప్పి, నడుంనొప్పి, ఊబకాయం, పొట్టపెరగడం, అజీర్తి లాంటి సమస్యలు ఏర్పడతాయి. మరికొందరికి గుండె జబ్బులు, రక్తపోటు, చక్కెర వ్యాధి లాంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి.

కొన్ని ఉద్యోగాలు మరింత దారుణంగా ఉంటాయి. వాళ్లు ఉదయం డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి మళ్లీ డ్యూటీ అయ్యేదాక నిల్చునే ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా చెప్పలేనన్ని ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను వెన్నాడుతున్నాయి.

మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి!
ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు అంత సులువుగా సెలవులు ఇవ్వవు. దీనితో పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలకు ఉద్యోగులు వెళ్లలేకపోతున్నారు. దీనితో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చివరికి ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు తోడుగా ఉండడం కూడా కష్టమైపోతోంది. ఇది వారిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తోంది.

ఇదంతా చెబుతుంటే, ఇది ఏదో జనరలైజ్ చేసి చెప్తున్నారు. శాలీడ్ ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. లేదా చూపించండి అని అడుగుతారు. సామాన్యుల కష్టాలు చూడాలంటే కళ్లు కాదు.. మనస్సు ఉండాలి. పోనీ ఇంతా కష్టపడి పనిచేస్తే, జీతం గొప్పగా పెరుగుతుందా? అంటే దానికి ఏ మాత్రం గ్యారెంటీ లేదు.

సందర్భం కాకపోయినా..
మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పల్లెలతో పోల్చి చూస్తే.. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటన్నది ఎవరైనా ఆలోచించారా?

దీనికి సమాధానం ఏమిటంటే.. ఎక్కువ మంది యువతీయువకులు ఓటింగ్​లో పాల్గొనడం లేదు. దీనికి ప్రధాన కారణం.. వారికి ఓటింగ్​ చేయడంపై ఆసక్తి లేకపోవడం కాదు. వారు పనిచేస్తున్న సంస్థలు వారికి సెలవులు ఇవ్వకపోవడం.

చేదు నిజం :సంస్థలు​ ఎన్నికలు జరిగే రోజు తమ ఉద్యోగులకు సెలవులు కచ్చితంగా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. లేదంటే శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరిస్తుంది. కానీ వాస్తవంలో అది ఏమీ జరగదు. కేవలం నోటిస్​ బోర్డులో మాత్రమే సెలవు ఉంటుంది. ఉద్యోగులు మాత్రం కచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. ఎదిరిస్తే.. ఏదో ఒక కారణం చెప్పి వేధించడం.. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. నమ్మినా, నమ్మకపోయినా ఇదొక కఠోర వాస్తవం.

సంస్థల చేతుల్లోకి సంపద!
ఈ విధంగా ఉద్యోగుల కష్టంతో కోట్లాది రూపాయలు సంపాదించే సంస్థలు.. ఆ లాభాల్లో కొంత అయినా తమ ఉద్యోగులకు పంచుతాయా? ఇది కోటి డాలర్ల ప్రశ్న. అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం.. ఎవరో ఒకతను తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కార్లు, బైక్​లు, నగలు, చీరలు గిఫ్ట్​గా ఇచ్చారని. ఇది ఎందుకు వార్త అవుతుందంటే.. మిగతా యజమానులు తమ సంపదను ఉద్యోగులకు పంచడం లేదు కనుక.

వేలాది, లక్షలాది కోట్లు సంపాదించే కార్పొరేట్ సంస్థలు, బడాబాబులు తమ డబ్బును వారసులకు ఇస్తున్నారే కానీ, ఉద్యోగులకు ఇవ్వడం లేదు. మరికొందరు బ్యాంకుల నుంచి ప్రజల సొమ్మును రుణాలుగా పొంది, వాటిని ఎగొట్టి విదేశాలకు పారిపోతున్నారు. మన ఘనత వహించిన రాజకీయ నాయకులు అన్నీ చూస్తూ.. కళ్లు తెరిచే, నిద్రపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొగోట్టుకుని, కుటుంబ, మానవ సంబంధాలను కోల్పొయి, గొడ్డు చాకిరీ చేయడం ఎందుకు?

ఫ్లెక్సిబుల్​ వర్క్ షెడ్యూల్ ఉండాలి!
కొన్ని అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉండేలా చూసుకుంటున్నాయి. దీని వల్ల వారి ఉద్యోగుల ఉత్పదకత పెరుగుతుందని అవి ఆశిస్తున్నాయి. నేడు చాలా సంస్థలు వారంలో చివరి రెండు రోజులు తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి, వాళ్ల ఉత్పాదకతను పెంచడానికి.

కానీ నేడు చాలా మంది పెద్దలు.. ఉద్యోగులు 70 గంటలు పాటు పనిచేయాలని, వారంలోని 6 రోజులు, అవసరమైతే 7 రోజులు కూడా విరామం లేకుండా పనిచేయాలని ఉద్భోదిస్తున్నారు. దీని వల్ల ఫలితం ఎవరికి దక్కుతుంది? ఉద్యోగులకా? లేదా సంస్థలకా? మీరే ఆలోచించండి!

Big Bull Rakesh Jhunjhunwala : రూ.5 వేల నుంచి రూ.44 వేల కోట్ల సంపద సృష్టి.. ఇలా చేస్తే సాధ్యం!

Warren Buffett Investment Tips : లాభాల వర్షం కురిపించే.. వారన్​ బఫెట్​ 12 గోల్డన్ ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్​ ఇవే!​

Last Updated : Dec 10, 2023, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details