తెలంగాణ

telangana

గూగుల్​పే, ఫోన్​పే చేస్తున్నారా? ఇలా మోసపోవచ్చు! బీ అలర్ట్!!

By

Published : May 22, 2022, 10:40 AM IST

UPI Payment Precautions: రూపాయి చెల్లించాలన్నా.. ఇప్పుడంతా నగదు రహితమే. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) రాకతో చెల్లింపుల తీరే పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.

UPI Payment Precautions:
UPI Payment Precautions:

UPI Payment Precautions: ఎవరికి నగదు బదిలీ చేయాలనుకుంటున్నారో.. వారి బ్యాంకుకు అనుసంధానమైన ఫోన్‌ నెంబరు లేదా యూపీఐ ఐడీ మీ దగ్గర ఉంటే చాలు.. సులువుగా నిమిషంలోపే మీ ఖాతా నుంచి నగదు వారి ఖాతాలోకి యూపీఐ ద్వారా బదిలీ అవుతుంది. ఇదే విధంగా మీకూ ఇతరులు నగదును బదిలీ చేసేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. యూపీఐ ఐడీని నమోదు చేసేటప్పుడు చిన్న పొరపాటు చేసినా.. నగదు ఇతరుల ఖాతాలోకి వెళ్లే ఆస్కారం ఉంది. కాబట్టి, ఒక వ్యక్తికి తొలిసారి నగదు బదిలీ చేసేటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా రూ.1ని బదిలీ చేయాలి. సరైన ఖాతా అని తెలుసుకున్నాకే అవసరమైన నగదును బదిలీ చేయొచ్చు.

  • ఏదైనా కొనుగోళ్లు చేసినప్పుడు క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేస్తుంటాం. యూపీఐ యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే.. దుకాణదారుకు సంబంధించిన వివరాలు వస్తాయి. ముందుగా ఆ వివరాలు సరైనవేనని నిర్ధరించుకోవాలి. దుకాణాల వద్ద క్యూఆర్‌ కోడ్‌లు గోడలకు అతికిస్తుంటారు. కొంతమంది మోసగాళ్లు తప్పుడు క్యూఆర్‌ కోడ్‌లను వీటికి అంటించిన సందర్భాలూ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. వాటికి నగదు బదిలీ చేశాక మోసపోయామని గుర్తించారు. ఇలాంటివి నివారించేందుకు ముందుగానే వివరాలు తనిఖీ చేసుకోవాలి.
  • మీ యూపీఐ ఆధారిత యాప్‌.. నాలుగు లేదా ఆరు అంకెల పిన్‌తో ఉంటుంది. దీని ఆధారంగానే మీరు లావాదేవీలను అధీకృతం చేయాలి. ఈ పిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. యాప్‌ ఓపెన్‌ చేయడం కోసం ప్రత్యేకంగా పిన్‌ లేదా వేలిముద్రను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోవద్దు.. మీరు చెల్లించాలనుకున్నప్పుడే పిన్‌ అవసరం అవుతుంది. చెల్లింపులు స్వీకరించడానికి దీనితో పనిలేదు.
  • ఇప్పుడు ఎన్నో పేమెంట్స్‌, యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులూ వీటిని అందిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలన్నీ ఉచితమే. ఒకటి లేదా రెండు యాప్‌లకు మించి ఉన్నా మీకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. అనవసరంగా మీ వివరాలు వివిధ యాప్‌లకు ఇవ్వడం తప్ప. ఒక యూపీఐ యాప్‌ ఉన్న వారికి మరో యూపీఐ యాప్‌ ద్వారా చెల్లించడం కష్టం అవుతుంది. కానీ, వారి యూపీఐ యాప్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, ఏ యాప్‌ నుంచైనా చెల్లించేందుకు వీలవుతుంది. కాబట్టి, మీరు అంతగా ఉపయోగించని యాప్‌లను ఫోన్‌ నుంచి తొలగించండి.
  • మీరు చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత బ్యాంకు నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలను గమనించాలి. లావాదేవీ విషయంలో ఏదైనా తేడా ఉంటే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి.

ABOUT THE AUTHOR

...view details