తెలంగాణ

telangana

పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఆ నిబంధనలే కారణం

By

Published : Jan 3, 2023, 6:43 AM IST

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బీఈఈ కొత్త నిబంధనల వల్లే వీటి ధరలు పెరగనున్నాయి.

prices-of-acs-and-refrigerators-will-increase
పెరగనున్న ఏసీ రిఫ్రిజరేటర్ల ధరలు

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 1 నుంచి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సవరించిన నిబంధనలు అమల్లోకి రావడమే ఇందుకు కారణం. విద్యుత్తు వినియోగ సామర్థ్యానికి అనుగుణంగా, ఇటీవలి వరకు 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు ఇకపై 4 స్టార్‌ రేటింగ్‌కు మారతాయి.

5 స్టార్‌ ప్రమాణాలతో సరికొత్త పరికరాలను కంపెనీలు తయారు చేయనున్నాయి. అధిక స్టార్‌రేటింగ్‌ ఉన్న పరికరాలు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఎండల వల్ల ఫ్యాన్లు, ఏసీల వినియోగ సమయం అంతకంతకూ అధికమవుతోంది. రిఫ్రిజిరేటర్‌ అయితే ఆపే పరిస్థితే ఉండదు. విద్యుత్తు టారిఫ్‌లూ పెరుగుతున్నందున, విద్యుత్తు బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు కూడా 4-5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఎలక్ట్రానిక్స్‌ పరికరాలపై ఆసక్తి చూపుతున్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య విడిభాగాల ధరలూ భారమవుతున్నాయి. దీనికి అదనంగా కొత్త ప్రమాణాల మేరకు పరికరాలను రూపొందించాల్సి రావడంతో, కంపెనీలు ధరలు పెంచనున్నాయి. తమ ఉత్పత్తులపై డాలర్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎల్‌జీ సంస్థ అధునాతన సాంకేతిక ఉత్పత్తులను కూడా దేశీయంగా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎల్‌జీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు "ఈనాడు"తో చెప్పారు.

బీఈఈ నూతన ప్రమాణాలతో తయారైన ఏసీల ధరలను అన్ని కంపెనీలు 5-8 శాతం పెంచే అవకాశం ఉందన్నారు. బీఈఈ కొత్త నిబంధనల అమలు వల్ల రిఫ్రిజిరేటర్ల ధరలు 2-5% పెరుగుతాయని, మోడల్‌ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌, హయర్‌, పానసోనిక్‌ వంటి సంస్థలు చెబుతున్నాయి.

మార్పులివీ:
ఫ్రాస్ట్‌ ఫ్రీ మోడళ్ల ఫ్రీజర్లు, రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిడ్జ్‌) ప్రొవిజనింగ్‌ యూనిట్ల (సాధారణ నిల్వ భాగానికి)కు వేర్వేరు స్టార్‌రేటింగ్‌ లేబుళ్లను కంపెనీలు అందించాల్సి ఉంటుంది. ఇది ప్రధాన మార్పు అని గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు.

  • ఇప్పటివరకు స్థూల సామర్థ్యాన్ని ప్రకటిస్తుండగా, ఇకపై నికర సామర్థ్యాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో వినియోగించుకోగలిగే సామ ర్థ్యాన్ని నికర సామర్థ్యంగా, మొత్తం నిల్వ పరిమాణం ఆధారంగా స్థూల సామర్థ్యాన్ని లెక్కిస్తారు.
  • ఫ్రిడ్జ్‌ తలుపు, షెల్వ్‌ల మధ్య ఖాళీలను వినియోగించుకోలేమని, వీటిని నికర నిల్వకు పరిగణనలోకి తీసుకోబోరు. ఫ్రిడ్జ్‌ కొనుగోలు చేసే సమయంలో ఈ సమాచారం దోహదపడుతుందని తెలిపారు.
  • నూతన ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని కంప్రెషర్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుందని, దీంతో 2-4 శాతం ధరలు పెరగొచ్చని హయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా అధ్యక్షుడు సతీశ్‌ ఎన్‌ఎస్‌ వెల్లడించారు.
  • కొత్త బీఈఈ నిబంధనలతో ధరలు 5 శాతం వరకు పెరగొచ్చని పానసోనిక్‌ మార్కెటింగ్‌ ఇండియా ఎండీ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ప్రారంభ స్థాయి కొనుగోలుదార్లపై ఎక్కువగా ప్రభావం పడొచ్చని తెలిపారు.
  • 2022లో దేశీయ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 307 కోట్ల డాలర్ల (రూ.25,000 కోట్లకు పైగా) మేర జరగ్గా, 2028కి 588 కోట్ల డాలర్ల (రూ.48,000 కోట్లకు పైగా) జరగచ్చొని అంచనా.

సీలింగ్‌ఫ్యాన్లు కూడా..:
ఈనెల నుంచి స్టార్‌రేటింగ్‌ ఉన్న సీలింగ్‌ ఫ్యాన్లనే దేశీయంగా తయారు చేసి, విక్రయించాల్సి ఉంది. ఇందువల్ల వీటి ధరలు కూడా విద్యుత్తు వినియోగ సామర్థ్యానికి అనుగుణంగా 7-8 శాతం పెరిగే అవకాశం ఉందని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details