తెలంగాణ

telangana

కార్పొరేట్‌ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

By

Published : Sep 7, 2022, 5:51 PM IST

precautions to be taken when taking corporate deposite policies
precautions to be taken when taking corporate deposite policies

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్లు తమ డిపాజిట్‌ రేట్లను సవరించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కార్పొరేట్‌లు తమ నిధుల అవసరాల కోసం స్వల్పకాలిక డిపాజిట్లను ప్రకటించడం ప్రారంభించాయి. అధిక వడ్డీ వస్తుందని వీటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

Corporate Deposits : కార్పొరేట్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ముందుగా క్రెడిట్‌ రేటింగ్‌లను పరిశీలించడం తప్పనిసరి. తక్కువ నష్టభయం ఉన్న కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. అధిక నష్టభయం ఉండి, తక్కువ రేటింగ్‌ ఉన్న సంస్థలు వడ్డీని ఎక్కువగా ఇస్తామని ముందుకొస్తాయి. కాబట్టి, ముందుగా మదుపరులు క్రిసిల్‌, ఇక్రా, కేర్‌ తదితర సంస్థలు ఇస్తున్న రేటింగ్‌లను పరిశీలించాలి. మంచి రేటింగ్‌ ఉన్న డిపాజిట్లు కాస్త సురక్షితం అని అనుకోవచ్చు. ఏఏఏ రేటింగ్‌ ఉన్నవి కాస్త తక్కువ రాబడినిచ్చినా.. డబ్బు సురక్షితంగా ఉండి, సమయానికి వడ్డీ వస్తుందని నిపుణులు అంటున్నారు.

  • ప్రస్తుతం వడ్డీ రేట్లు పెరుగుతున్న దశను చూస్తున్నాం. కాబట్టి, దీర్ఘకాలిక వ్యవధికి డిపాజిట్లను ఎంచుకోవద్దు. ప్రస్తుతానికి స్వల్పకాలిక వ్యవధి డిపాజిట్లలో మదుపు చేయండి. వడ్డీ రేట్లు సర్దుకున్నాక.. అప్పుడు మీ లక్ష్యాలను బట్టి, దీర్ఘకాలిక డిపాజిట్లకు మారొచ్చు. 12 నెలల్లోపు డిపాజిట్లను ఇప్పుడు పరిశీలించండి.
  • కార్పొరేట్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాలి. ఆ మేరకు వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాలి. రూ.5వేల వడ్డీ మించినప్పుడు టీడీఎస్‌ వర్తిస్తుంది. ఫారం 15జీ/15హెచ్‌ ఇవ్వడం ద్వారా టీడీఎస్‌ లేకుండా చూసుకోవచ్చు.
  • పెట్టుబడుల్లో కాస్త వైవిధ్యం ఉండాలని కోరుకునే వారు వీటిని పరిశీలించవచ్చు. అయితే, రెండు నుంచి మూడు నెలల్లో డబ్బు వెనక్కి కావాలనుకునే వారు ఆ వ్యవధుల్లో ఉండే బ్యాంకు డిపాజిట్లను ఎంచుకోవడమే మేలు. ప్రతి డిపాజిట్‌కూ నామినీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎప్పుడూ మర్చిపోవద్దు. కొన్ని చిన్న బ్యాంకులూ అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. పెద్ద బ్యాంకులు, చిన్న బ్యాంకులు, కార్పొరేట్‌ డిపాజిట్లు ఇలా వైవిధ్యంగా ఉండేలా ప్రణాళిక వేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details