తెలంగాణ

telangana

Insurance Policies: ఆ సందేశాలతో జర భద్రం.. లేకుంటే మీ జేబుకు చిల్లే!

By

Published : Jun 12, 2022, 7:51 AM IST

Insurance Policies Messages: అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది జీవిత బీమా పాలసీ. చాలామంది దీన్ని పెట్టుబడి సాధనంగానూ, పన్ను మినహాయింపు కల్పించే పథకంగానూ చూస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని, పాలసీదారులను మోసం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మనకు వచ్చే సందేశాలు ఎలా ఉంటాయి? వాటిలోని నిజాలేమిటో చూద్దాం!

insurance-policies-messages-and-facts
insurance-policies-messages-and-facts

Insurance Policies Messages Facts: బీమా పాలసీలను ఎంచుకునేటప్పుడు అవి మనకు ఎంత మేరకు ఉపయోగపడతాయనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. పూర్తి రక్షణ కోసమా.. పెట్టుబడి కోసమా.. పదవీ విరమణ అనంతరం ఉపయోగపడుతుందా అనే అంశాలపై అవగాహన ఉండాలి. సాధారణంగా మనకు వచ్చే సందేశాలు ఎలా ఉంటాయి.. వాటిలోని నిజాలేమిటో చూద్దాం..

సందేశం: 'ఏడాదికి రూ.1,60,000 చొప్పున 12 ఏళ్లు చెల్లించండి. వ్యవధి తీరాక రూ.కోటి మీ సొంతం. రూ.35 లక్షల బీమా రక్షణా ఉంటుంది'.
వాస్తవం:ఏడాదికి రూ.1,60,000 చొప్పున 12 ఏళ్లపాటు చెల్లిస్తే.. రూ.19.2లక్షలు అవుతుంది. ఈ మొత్తంతో రూ. కోటి పొందాలంటే.. దాదాపు 23.86 శాతం రాబడిని అందుకోవాలి. సాధారణంగా సంప్రదాయ జీవిత బీమా పాలసీలు ప్రీమియం మొత్తంలో నుంచి కమీషన్‌ చెల్లింపులు, ఇతర ఖర్చులను మినహాయించి, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర సురక్షిత పథకాల్లో మదుపు చేస్తాయి. వీటిల్లో మదుపు చేసినప్పుడు వచ్చే సగటు రాబడి 6 శాతం వరకూ ఉంటుంది. అంటే, పాలసీ వ్యవధి 35 ఏళ్లు ఉన్నప్పుడు మాత్రమే రూ. కోటి చెల్లించేందుకు సాధ్యం అవుతుంది. బీమా పాలసీ డాక్యుమెంట్లో ఇది పేర్కొంటారు. కేవలం సందేశాన్ని నమ్మి పెట్టుబడి పెట్టకుండా.. పాలసీ నిబంధనలు స్పష్టంగా తెలుసుకున్నప్పుడే ఈ విషయం తెలుస్తుంది.

సందేశం: 'రోజుకు రూ.11తో రూ.కోటి బీమా..'
వాస్తవం: టర్మ్‌ పాలసీకి సాధారణంగా తక్కువ ప్రీమియం ఉంటుంది. అందరికీ ఇదే సూత్రం వర్తించదు. రోజుకు రూ.11 అంటే.. వార్షిక ప్రీమియం రూ.4వేల వరకూ ఉంటుంది. 22-24 ఏళ్ల మధ్య ఉన్నవారికీ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకే ఇది వర్తిస్తుందని నిబంధనలు ఉంటాయి. బీమా సంస్థలు మీ వయసు, ఆరోగ్య సమస్యల ఆధారంగా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. మరీ తక్కువ ప్రీమియానికి రూ. కోటి బీమా అందిస్తున్నామంటే కాస్త సందేహించాల్సిందే. క్లెయిం చెల్లింపుల తీరు సరిగా ఉందా చూసుకోవాలి. టర్మ్‌ పాలసీ తీసుకునేటప్పుడు చిన్న అజాగ్రత్త కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ఆ పాలసీ మొత్తం దక్కకుండా చేయొచ్చు.

ఇవీ చదవండి:'పసిడి'పై ఇన్వెస్ట్​ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?

భవిష్యత్​ అవసరాలు తీర్చేలా పన్ను ఆదా.. వీటిల్లో ఇన్వెస్ట్​ చేస్తే!

ABOUT THE AUTHOR

...view details