తెలంగాణ

telangana

Indigo Airbus Deal : ఏవియేషన్ చరిత్రలో బిగ్ డీల్​.. 500 విమానాలను ఆర్డర్​ పెట్టిన ఇండిగో..

By

Published : Jun 20, 2023, 6:49 AM IST

Updated : Jun 20, 2023, 9:43 AM IST

Indigo 500 Aircraft Deal : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ఫ్రాన్స్​కు చెందిన ఎయిర్​బస్​కు 500 నేరో బాడీ విమానాల ఆర్డర్​ను ఇచ్చినట్లు ప్రకటించింది. ఎయిర్​బస్​కు ఒక విమానయాన సంస్థ ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్​ ఇదే కావడం గమనార్హం.

Indigo 500 Aircraft Deal
Indigo 500 Aircraft Deal

Indigo Airbus Deal : దేశ ఏవియేషన్‌ చరిత్రలో అతిపెద్ద డీల్‌ జరిగింది. దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో 500 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి నేరో బాడీ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్‌, బోయింగ్‌ నుంచి 470 విమానాల ఆర్డర్‌ దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్‌ కాగా.. తాజాగా దాన్ని ఇండిగో అధిగమించింది.

ప్రస్తుతం ఇండిగో.. 300కు పైగా విమానాలతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ ఇంతకుముందు కూడా మొత్తం 480 విమానాల ఆర్డర్లను పెట్టింది. ఈ విమానాలను ఇంకా అందుకోవాల్సి ఉంది. ఇక, 2030 నుంచి 2035 కోసం అదనంగా 500 విమానాల ఆర్డరుతో కలిపి ఇండిగో ఆర్డరు బుక్​ దాదాపు 1000 విమానాలకు చేరిందని సంస్థ వెల్లడించింది. ఈ విమానాలు వచ్చే పదేళ్లలో డెలివరీ అవుతాయని తెలిపింది. ఇండిగో ఆర్డరు బుక్​లో ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాలు ఉన్నాయి.

Paris Air Show Indigo : పారిస్​ ఎయిర్​ షోలో భాగంగా ఇండిగో ఛైర్మన్ వి సుమంత్రన్, ఇండిగో సీఈఓ పీటర్​ ఎల్బర్స్, ఎయిర్​బస్​ సీఈఓ గియోమ్​ ఫౌరీ, ఎయిర్​బస్​ చీఫ్​ కమెర్షియల్ అధికారి క్రిస్టియన్ షెరర్ సమక్షంలో జూన్​ 19న ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇండిగో సీఈఓ పీటర్​ ఎల్బర్స్ మాట్లాడారు. "ఈ విమానాల ఆర్డరు ఒప్పందం గురించి ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఎయిర్‌బస్‌తో ఒకే రకమైన విమానాల కోసం ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ఆర్డర్ ఇదే. భారతీయ విమానయాన రంగంలో ఇది ఒక చారిత్రాత్మక క్షణం" అని అన్నారు.

యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా దేశీయ విమానయాన రంగంపై కరోనా పెను ప్రభావం చూపించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో నెలల తరబడి విమానాలు ఎగరలేదు. దీంతో ఎయిర్‌లైన్లకు నష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన పరిశ్రమ మళ్లీ అంతే వేగంగా కోలుకుంది. విమాన ప్రయాణాలు భారీగా పుంజుకున్నాయి. దీంతో విమానయాన సంస్థలు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున విమానాలను ఆర్డర్‌ పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎయిర్ఇండియాను కొనుగోలు చేసిన టాటాలు 470 విమానాలకు, తాజాగా ఇండిగో 500 విమానాలను కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 56 శాతం వాటా ఉంది.

Last Updated :Jun 20, 2023, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details