తెలంగాణ

telangana

అదానీకి మరో షాక్.. షేర్లు భారీగా పతనం.. కుబేరుల జాబితాలో ఏడో స్థానానికి..

By

Published : Jan 27, 2023, 3:26 PM IST

Updated : Jan 27, 2023, 4:38 PM IST

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ 7వ స్థానానికి పడిపోయారు. మరోవైపు. వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.

gautam adani stocks
కుప్పకూలిన అదానీ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాలు చవిచూశాయి. షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికే ఇందుకు కారణం. అదానీ టోటల్‌ గ్యాస్‌ శుక్రవారం ఓ దశలో ఏకంగా 20 శాతం వరకు నష్టపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 19 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 15.50 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6.19 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 5.31 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, అదానీ పవర్‌ 4.99 శాతం వరకు నష్టాల్ని చవిచూశాయి.

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని గురువారం తెలిపింది.

7వ ర్యాంకుకు పడిపోయిన అదానీ..
అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పతనమవడం వల్ల ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్​ అదానీ ఆస్తి విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద 18 బిలియన్లు డాలర్లు తగ్గి 100 బిలియన్ డాలర్లు చేరింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన 7వ స్థానానికి పడిపోయారు. మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ సంపద ప్రస్తుతం 104 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది స్టాక్స్​ మార్కెట్లో అదానీ షేర్లు రాణించడం వల్ల ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో కొన్నాళ్లు, అలాగే 3వ స్థానంలో కొన్నాళ్లు కొనసాగారు.

ప్రపంచ కుబేరుడిగా ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నాల్డ్ ఆర్నాల్ట్(215 బిలియన్ డాలర్లు) సంపదతో మొదటి స్థానంలో ఉండగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్(170 మి.డా) రెండో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ 83 మిలియన్ల డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నారు.

తక్షణమే దర్యాప్తు చేయాలి..
అదానీ గ్రూప్​పై వచ్చిన ఆర్థిక అవకతవకలపై సెబీ, ఆర్‌బీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన హిండెన్​బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. 'అదానీ గ్రూప్, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. అయితే ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సెబీ, ఆర్‌బీఐ తమ పాత్రను పోషించాలి. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని' జైరాం రమేశ్ పేర్కొన్నారు.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
వారాంతపు సెషన్​లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 874 పాయింట్లు నష్టపోయి 59,330 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 287 పాయింట్ల నష్టంతో 17,604 దగ్గర స్థిరపడింది.

లాభనష్టాలోనివి.. సెన్సెక్స్ 30 ప్యాక్​లో టాటా మోటార్స్, ఐటీసీ, ఎం&ఎం, సన్‌ఫార్మా, నెస్లే షేర్లు లాభాలతో ముగిశాయి. పవర్ గ్రిడ్​, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, మారుతీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టైటన్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

రూపాయి విలువ..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు లాభపడి రూ.81.53గా ఉంది.

Last Updated :Jan 27, 2023, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details