ETV Bharat / business

ఈసారైనా కరుణ చూపండి.. బడ్జెట్​పై వేతన జీవుల ఆశలు

author img

By

Published : Jan 27, 2023, 9:07 AM IST

pre budget expectations of salaried employees
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌పై సాధారణ ప్రజల ఆశలు అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా గత మూడేళ్లుగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని వేతన జీవులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారోనని ఆశపడుతున్నారు.

ఆదాయపు పన్ను పరిమితి విషయంలో కొన్నేళ్లుగా ఆశించినంత ఊరట లభించడం లేదు. పన్ను వర్తించే ఆదాయం పరిమితి రూ.5లక్షల మేరకు ఉన్నా, ఇది కొన్ని నిబంధనల మేరకే అనుమతిస్తారు. అలాకాకుండా రూ.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని అందరూ కోరుకుంటున్నారు.

పన్ను వర్తించే ఆదాయం రూ.10లక్షలు ఉన్న వ్యక్తి 2013-14లో రూ.1,33,900 పన్ను చెల్లించాల్సి వచ్చేది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను మొత్తం రూ.1,17,000. అప్పటితో ఇప్పటి ధరల ద్రవ్యోల్బణ సూచీని పోల్చి సర్దుబాటు చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.88,997 ఉండాలి. అంటే రూ.28,003 తక్కువగా ఉండాలి. అంటే, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగానైనా పన్నుల పరిమితి పెంచాల్సిన అవసరం ఉంది.

శ్లాబులనూ సవరించాలి..
ఆదాయపు పన్ను పరిమితి పెంచడంతోపాటు, పాత పన్నుల విధానంలో 20, 30 శాతం శ్లాబులనూ పెంచాల్సిన అవసరం ఉంది. రూ.10లక్షల పైన 20 శాతం, రూ.15లక్షలపైన 30 శాతం శ్లాబుతో పన్ను విధించాల్సిన అవసరం ఉంది. అప్పుడే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పన్ను చెల్లింపుదారులకు మిగులు మొత్తం పెరుగుతుంది.

రూ.2లక్షలు చేస్తారా?..
పన్ను భారం తగ్గించుకునేందుకు ఉన్న ప్రధాన సెక్షన్‌ 80 సి. ఇందులో భాగంగా రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, జీవిత బీమా, ఇంటిరుణం అసలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు, పన్ను ఆదా ఎఫ్‌డీలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు ఇలా ఎన్నో ఇందులో భాగంగానే ఉన్నాయి. 2014 నుంచి దీన్ని మార్చింది లేదు. అప్పటి నుంచీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజల కొనుగోలు శక్తిలోనూ 25శాతం మేరకు వృద్ధి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణమూ అధికంగానే ఉంది. 2014 లెక్కల్లో చూస్తే రూ.1.50లక్షలు సరిపోయింది. కానీ, ఇప్పుడు కనీసం రూ.2 లక్షల వరకూ మినహాయింపుల పరిమితి పెంచితే బాగుంటుంది. సెక్షన్‌ 80సీసీడీ (1బీ) పరిమితినీ రూ.లక్షకు పెంచాలి.

కొన్ని ప్రత్యేకంగా..
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈ పాలసీలకు ప్రత్యేక సెక్షన్‌ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంటి రుణం అసలు, వడ్డీ మొత్తానికి రెండు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును 225 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. దీంతో గృహరుణాలు ఖరీదయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, అసలు, వడ్డీ చెల్లింపులకోసం ఒకే సెక్షన్‌ ఏర్పాటు చేసి, రూ.5లక్షల వరకూ ఇందులో మినహాయింపు అవకాశాన్ని కల్పించాలి. దీనివల్ల సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ప్రీమియంపై జీఎస్‌టీ..
ఆరోగ్య బీమా, టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై జీఎస్‌టీని తగ్గించాలని పాలసీదారులతోపాటు, పరిశ్రమా కోరుకుంటోంది. 18 శాతం నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.