తెలంగాణ

telangana

డ్రోన్ల తయారీకి రూ.120 కోట్ల ప్రోత్సాహకాలు.. కేంద్రం మార్గదర్శకాలు

By

Published : Dec 3, 2022, 7:24 AM IST

డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథక (పీఎల్‌ఐ) మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రూ.120 కోట్ల కేటాయింపు ప్రణాళికతో పీఎల్‌ఐ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది.

drone
డ్రోన్లు

డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథక (పీఎల్‌ఐ) మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. రూ.120 కోట్ల కేటాయింపు ప్రణాళికతో పీఎల్‌ఐ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. 2022-23 నుంచి 2024-25 కాలంలో దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమకు సంబంధించిన వివిధ ప్రతినిధులు, భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం మార్గదర్శకాలను ఖరారు చేసినట్లు నవంబరు 29న మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.

  • భారత్‌లో డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలను తయారు చేస్తున్న కంపెనీలకే పీఎల్‌ఐ పథకాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
  • ఒక్కో తయారీదారుకు పీఎల్‌ఐ పరిమితి రూ.30 కోట్లు. మొత్తం కేటాయింపు అయిన రూ.120 కోట్లలో ఇది 25 శాతం. డ్రోన్లను తయారు చేస్తూ.. వార్షిక విక్రయాల టర్నోవరు రూ.2 కోట్లు ఉన్న దేశీయ ఎంఎస్‌ఎమ్‌ఈలు, అంకుర సంస్థలకు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హత ఉంటుంది.
  • డ్రోన్ల విడిభాగాల సంస్థలకు ఈ పరిమితి రూ.50 లక్షలు. ఒకవేళ డ్రోన్లు తయారు చేసే సంస్థలు భారత్‌కు చెందినవి కాకుంటే.. వార్షిక విక్రయాల టర్నోవరు రూ.4 కోట్లు ఉండాలి. డ్రోన్ల విడిభాగాలు తయారు చేసే సంస్థలకు ఇది రూ.1 కోటి అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

షరతులకు లోబడి డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే సంస్థలకు కూడా పీఎల్‌ఐ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుల మదింపునకు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (పీఎంఏ)ని మంత్రిత్వ శాఖ నియమించింది. పీఎంఏ సిఫారసు చేసిన దరఖాస్తులను పౌర విమానయాన శాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల బృందం ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ.. సమయానుకూలంగా చర్యలను చేపడుతుంది.

ABOUT THE AUTHOR

...view details