ETV Bharat / business

అంబానీ హవా.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

author img

By

Published : Dec 2, 2022, 6:49 AM IST

Updated : Dec 2, 2022, 8:50 AM IST

రూ.17.25 లక్షల కోట్ల విలువతో దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. 2022 బర్గండీ హురున్‌ ఇండియా-500 జాబితా ద్వారా ఈ విషయం వెల్లడైంది.

Reliance Industries
ముఖేష్ అంబానీ

దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. రూ.17.25 లక్షల కోట్ల విలువతో ఇది అగ్రస్థానంలో నిలిచినట్లు 2022 బర్గండీ హురున్‌ ఇండియా-500 జాబితా వెల్లడించింది. ఈ జాబితాను హురున్‌ ఇండియా, బర్గండీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ (ప్రైవేటు బ్యాంకింగ్‌ వ్యాపారం) సంయుక్తంగా రూపొందించాయి. రిలయన్స్‌ తర్వాతి స్థానాల్లో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటివి నిలిచాయి. తొలి 10 సంస్థల్లో అదానీ టోటల్‌ గ్యాస్‌(9), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(10) కొత్తగా చేరాయి.

దేశ జీడీపీకి సమానంగా కంపెనీల విలువ:
దేశ జీడీపీకి సమానంగా ఈ జాబితాలోని 500 కంపెనీల మొత్తం విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.224 లక్షల కోట్లు)గా నమోదైంది. ‘ఈ కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. 820 బి.డాలర్ల విక్రయాలను సాధించాయి. 73 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయ’ని హురున్‌ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

burgundy private hurun india 500 list
2022 బర్గండీ హురున్‌ ఇండియా 500 జాబితా
  • ఈ 500 కంపెనీల ఆదాయం భారత జీడీపీలో 29 శాతానికి సమానం. దేశ మొత్తం కార్మికుల్లో 1.5% మందికి ఇవి ఉపాధినిస్తున్నాయి. ఈ జాబితాలోని 67 కంపెనీలు ఏర్పాటై 10 ఏళ్లలోపే కావడం విశేషం.
  • అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలోని కంపెనీలు గతేడాదితో పోలిస్తే రూ.1.78 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి. ఇంధన, రిటైల్‌, ఆతిథ్య, వినియోగదారు వస్తువుల రంగాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి.
  • సాఫ్ట్‌వేర్‌, సేవల రంగాలు కలిసి గతేడాదితో పోలిస్తే రూ.6 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి.
  • మొత్తం 500 కంపెనీల్లో 73 ఆర్థిక సేవల కంపెనీలే కావడం గమనార్హం. ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, వినియోగదారు వస్తువుల కంపెనీలు వరుసగా 60; 37; 37గా ఉన్నాయి.
  • చైనాలో అత్యంత విలువైన కంపెనీగా టెన్సెంట్‌(743 బి.డాలర్లు) అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే 2.4 ట్రిలియన్‌ డాలర్లతో యాపిల్‌ నం.1గా ఉంది. ఒక్క యాపిల్‌ విలువే మన టాప్‌-500 కంపెనీల విలువకు దాదాపు సమానంగా ఉంది.

నమోదు కాని కంపెనీల్లో సీరమ్‌ హవా:
స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాని కంపెనీల్లో రూ.2.19 లక్షల కోట్ల విలువతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో బైజూస్‌(రూ.1.82 లక్షల కోట్లు), ఎన్‌ఎస్‌ఈ(రూ.1.39 లక్షల కోట్లు) నిలిచాయి.అపోలో బోర్డులో ఆరుగురు మహిళలు: బోర్డుల్లో, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించింది అపోలో హాస్పిటల్స్‌. ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రీతారెడ్డి, శోభన కామినేని, సునీతారెడ్డి, సంగీతారెడ్డితో పాటు కవితా దత్‌, రమా బిజాపుర్కర్‌ (స్వతంత్ర డైరెక్టర్లు) కలిపి మొత్తం ఆరుగురు మహిళలు ఈ బోర్డులో ఉండడం విశేషం.

burgundy private hurun india 500 list
2022 బర్గండీ హురున్‌ ఇండియా 500 జాబితా
Last Updated : Dec 2, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.