తెలంగాణ

telangana

stock market: కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1170 పాయింట్లు పతనం

By

Published : Nov 22, 2021, 3:45 PM IST

Updated : Nov 22, 2021, 4:47 PM IST

stock market

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కొనసాగింది. దీంతో మార్కెట్లకు మద్దతు లభించకపోవడం కారణంగా సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1170 పాయింట్లకుపైగా పతనమై 58 వేల 466 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు నష్టపోయి.. 17,417 వద్దకు ముగిసింది.

రిలయన్స్​ భారీగా పతనమైంది. బ్యాంకింగ్‌, రియాల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

ఉదయం 59,710.48 వద్ద ఫ్లాట్​గా ప్రారంభమైన సెన్సెక్స్​.. ఇంట్రాడేలో 59,778.37 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో 1500 పాయింట్ల పతనమై.. 58,012 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కాస్త తెరుకుంది.

మరో సూచీ ఎన్​ఎస్ఈ-నిఫ్టీ 17,796 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో 17,805 గరిష్ఠానికి చేరింది. తర్వాత నష్టాల్లో జారుకున్న సూచీ.. 17,563.20 వద్ద కనిష్ఠానికి చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే

  • భారతీ ఎయిర్​టెల్ 4.16 శాతం,​ ఏషియన్​ పెయింట్ 1.28శాతం​, పవర్​గ్రిడ్ 0.70 శాతం లాభాలు గడించాయి.
  • బజాజ్​ ఫైనాన్స్​ 5.96శాతం బజాజ్​ ఫిన్​సెర్వ్​ 5.04శాతం, రిలయన్స్​ 4.39శాతం, ఎన్​టీపీసీ 3.73 శాతం, టైటాన్​ 3.41, ఎస్​బీఐఎన్ 3.41శాతం​, బజాజ్​ ఆటో 3.01శాతం, మారుతీ 2.97, కొటక్​ 2.96 శాతం నష్టాలు మూటగట్టుకున్నాయి.

గతనెల జీవితకాల గరిష్ఠాలకు చేరిన సూచీలు.. కొన్ని రోజుల నుంచి పతనమవుతూ వస్తున్నాయి.

రూ.56 వేల కోట్ల సంపద ఆవిరి

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కట్టబెడుతున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అడుగిడిన తొలి రోజే భారీగా కుప్పకూలిన ఈ స్టాక్‌ విలువ మరింత దిగజారుతోంది. ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో ఏకంగా 14 శాతం కుంగి మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇష్యూ ధర రూ.2,150 కంటే బీఎస్‌ఈలో దాదాపు 41 శాతం నష్టపోయి రూ.1,271 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దీంతో ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. దాంట్లో దాదాపు రూ.56 వేల కోట్ల సంపద ఆవిరైంది.

మదుపర్లకు 36 శాతం నష్టం..

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2,150 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.12,900 అయ్యింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఉన్న రూ.1,366తో పోలిస్తే.. పెట్టుబడి విలువ రూ.8,196కి తగ్గింది. ఈ ప్రకారం చూస్తే.. మదుపరికి రూ.4,704 నష్టం వచ్చింది. అంటే 36 శాతం పెట్టుబడి ఆవిరైంది. ఐపీఓలో షేరు ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ డౌన్‌..

ఇక సౌదీ ఆరామ్‌కోతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చొన్న రిలయన్స్‌.. దాన్ని పునఃమదింపు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, దాదాపు ఈ డీల్‌ రద్దయినట్లేనని మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రిలయన్స్‌ షేరు విలువ ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో 4.5 శాతానికి పైగా కుంగి రూ.2,356 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ఎగబాకిన ఎయిర్‌టెల్‌..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచింది. దీంతో షేరు ధర ఈరోజు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పెరిగి రూ.756 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

స్టాక్​ మార్కెట్​ నష్టాలకు కారణాలు

  • ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్​, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం సెంటిమెంటును దెబ్బతీసింది.
  • ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి.
  • భారత్‌లోనూ గత నెల రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల తోడు విదేశీయ మారక నిల్వలు తగ్గుదల సూచీలను ప్రభావితం చేసింది.
  • ఈ వారంలోనే నవంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుంది.
  • మరోవైపు టెక్నికల్‌గా నిఫ్టీ సూచీ 50 రోజుల మూవింగ్‌ యావరేజీ కిందకు వెళ్లింది. ఇది మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.
  • రిలయన్స్‌-ఆరామ్‌కో మధ్య కుదిరిన ఒప్పందం రద్దుపై మదుపర్లు దృష్టసారించడం.
  • బీఎస్‌ఈలో మెజారిటీ వాటా కలిగిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ షేర్లకు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
  • బ్యాంకింగ్​ రియాల్టీ షేర్లు భారీగా పతనమవడం

ఇదీ చూడండి:ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే

Last Updated :Nov 22, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details