తెలంగాణ

telangana

ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

By

Published : Jan 7, 2023, 10:21 PM IST

ఎయిరిండియాలో మూత్ర విసర్జన ఘటనలో నిందితుడిగా ఉన్న శంకర్‌ మిశ్రాను పోలీసు కస్టడీకి అప్పగించేందుకు దిల్లీ కోర్టు నిరాకరించింది. ప్రజా ఒత్తిడి మేరకు అతడిని కస్టడీకి కోరడం తగదని పోలీసులను సూచించింది.

urinating air india passenger
శంకర్​ మిశ్రా

ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో అరెస్టయిన నిందితుడు శంకర్‌ మిశ్రాను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అతడిని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు కోరారు. శంకర్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. అప్పుడే విమాన కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బంది అతడిని గుర్తుపడతారని పోలీసులు తెలిపారు.

అయితే, దీనిపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. "ఇందులో పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన అవసరం ఏముంది? కేవలం ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందని ఇలాంటి అభ్యర్థనలు చేయడం తగదు. చట్టాలను అనుసరించే చర్యలు తీసుకోవాలి" అని పోలీసులకు కోర్టు సూచించింది. నిందితుడికి పోలీసు కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అతడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించింది.

నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానం బిజినెస్‌ క్లాసులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న శంకర్‌ను ఎట్టకేలకు దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బెంగళూరులో తలదాచుకున్న అతడిని దిల్లీకి తరలించారు. మరోవైపు, ఘటన నేపథ్యంలో శంకర్‌ ఉద్యోగంపైనా వేటు పడింది. అమెరికన్‌ ఫైన్షానియల్‌ సంస్థ వెల్స్‌ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న అతడిని సంస్థ విధుల నుంచి తొలగించింది.

కాగా.. ఈ ఘటనలో బాధిత మహిళ పట్ల విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటన సమయంలో ఉన్న విమాన పైలట్‌, క్యాబిన్‌ సిబ్బందిపై వేటు వేసింది. మరోవైపు దిల్లీ పోలీసులు కూడా విమాన సిబ్బందికి నోటీసులు జారీ చేయగా.. నేడు వారు విచారణకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details