తెలంగాణ

telangana

అటవీ అధికారులపై దాడులపట్ల సుప్రీం ఆందోళన

By

Published : Jan 8, 2021, 7:09 PM IST

దేశవ్యాప్తంగా అటవీశాఖ అధికారులపై జరుగుతోన్న దాడులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఈ దాడుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైతే ఆయుధాలను అందించే ఉత్తర్వులనూ జారీ చేయొచ్చని పేర్కొంది.

SC says concerned over attacks on forest rangers, may order providing arms to them
అటవీశాఖ అధికారులపై దాడులపట్ల సుప్రీం ఆందోళన

అటవీశాఖ అధికారులపై సాయుధ వేటగాళ్లు, స్మగ్లర్లు చేస్తున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. వారి నుంచి రక్షణ పొందేందుకు అవసరమైతే తుపాకులు, బుల్లెట్​ ప్రూఫ్​ దుస్తులు, శిరస్త్రాణాలను అందించే ఉత్తర్వులనూ జారీ చేయొచ్చని పేర్కొంది.

ఈ మేరకు టీఎన్​ గోదావర్మన్​ తిరుముల్​పాద్​ దాఖలు చేసిన 25 ఏళ్ల నాటి ఓ మధ్యంతర పిటిషన్​ను విచారించింది న్యాయస్థానం. అంతేకాకుండా.. అటవీశాఖ అధికారులపై జరిగే దాడుల్లో 38 శాతం భారత్​లోనే నమోదయ్యాయని సీనియర్​ న్యాయవాది శ్యామ్​ దివాన్​ ఓ నివేదికను సమర్పించారు. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర అడవుల్లో జరిగిన దారుణమైన దాడులు, వారిపై నమోదైన ఎన్​కౌంటర్​ కేసులను అందులో ప్రస్తావించారాయన. వాటిని కూడా సుప్రీం ధర్మాసనం పరిశీలించింది.

'ప్రత్యేక ఈడీ ఏర్పాటు..'

'అటవీశాఖపై పెద్ద పెద్ద శక్తులు దాడి చేసి మిలియన్ల డాలర్ల సంపదను దోచుకుంటున్నాయి-వీరిపై అటవీ శాఖ అధికారులు పోరాడుతున్నారు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అటవీ శాఖపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, వీటిపై ఈడీ దృష్టి సారించాలని చెప్పింది. నిరాయుధులుగా ఉన్న అటవీ అధికారులు.. వారిని వారు ఎలా కాపాడుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఆ నివేదిక తర్వాతే..

అటవీశాఖ అధికారులను రక్షించే విషయమై.. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా, దివాన్​, న్యాయవాది ఏడీఎన్​ రావులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వారు ఆ నివేదికలను సమర్పించాక.. తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

"కర్ణాటకలో అటవీ సిబ్బంది చెప్పులతో తిరుగుతూ.. సాయుధ వేటగాళ్ల దాడికి గురవుతున్నారు. వీటన్నింటిపై సొలిసిటర్​ జనరల్ తదుపరి విచారణలోగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నాం. అనంతరం అటవీ అధికారులకు ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, హెల్మెట్లు ఇవ్వమని నిర్దేశిస్తాం."

- సుప్రీం ధర్మాసనం

అంతేకాకుండా.. మహారాష్ట్ర, రాజస్థాన్​లలో అటవీ సిబ్బందిపై జరిగిన దాడులను ఉదహరిస్తూ.. వాటన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సొలిసిటర్​ జనరల్​ను సూచించింది. సంబంధిత న్యాయవాదుల వాంగ్మూలాలన్నింటినీ పరిశీలించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం.. విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:సీసీబీ విచారణకు మాజీ సీఎం భార్య

ABOUT THE AUTHOR

...view details