తెలంగాణ

telangana

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ నుంచి నేరుగా కొంటే లాభమే.. నేడు కేసీఆర్​కు సింగరేణి నివేదిక

By

Published : Apr 15, 2023, 7:47 AM IST

Vizag Steel Plant EOI: విశాఖ ప్లాంట్‌ నుంచి నేరుగా స్టీల్‌ కొంటే లాభదాయకమేనని.. సింగరేణి అధికారుల బృందం నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనుంది. రాష్ట్ర పథకాలకు ఏటా 3 లక్షల టన్నుల ఇనుము వినియోగం ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. ఈవోఐ గడువు ముగిసినా ముందుకు వెళ్లే యోచనలో సింగరేణి ఉంది.

Vizag Steel Plant
Vizag Steel Plant

Vizag Steel Plant EOI: రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, పథకాల పనుల్లో.. ఏటా దాదాపు 3 లక్షల టన్నుల ఇనుము వినియోగిస్తోంది. దీనిని నేరుగా వైజాగ్‌ స్టీల్‌ పరిశ్రమ నుంచి టోకుగా కొంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని సింగరేణి అధ్యయనంలో తేలింది. మూలధనం కింద నిధుల సేకరణకు వైజాగ్‌ స్టీల్‌ పరిశ్రమ గత నెల 27న ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కింద టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపింది.

Singareni Officials Report on Vizag Steel Plant: ఐదుగురు అధికారుల బృందం రెండు రోజుల పాటు వైజాగ్‌ స్టీల్‌ పరిశ్రమలో కలియ తిరిగి.. అక్కడి అధికారులతో చర్చించి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) పేరుతో నడుస్తున్న వైజాగ్‌ స్టీల్‌ పరిశ్రమ అతి పెద్దదని.. ఆ సంస్థకు నిధులు సమకూరిస్తే లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సింగరేణి అధికారులు గుర్తించారు. వారి అధ్యయనం నివేదికను సీఎం కేసీఆర్‌కు నేడు అందించనున్నట్లు సమాచారం.

Telangana plans to buy steel from Vizag Steel Plant : సింగరేణిలో ఏటా 30 వేల టన్నుల వరకు ఇనుము కొని వాడుతుంటారు. ఆ సంస్థ ఒక్కటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు, పథకాలకు ఇనుము సరఫరాకు సింగరేణిని నోడల్‌ ఏజెన్సీగా పెట్టుకుని కొనుగోలు చేస్తే కమీషన్‌ తీసుకొని సరఫరా చేసే అవకాశముంటుంది. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ వ్యాపార ఉత్పత్తులకు, సింగరేణి వ్యాపారానికి మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదు. సింగరేణి గనుల్లో కోకింగ్‌ కోల్‌ లేనందున.. వైజాగ్‌స్టీల్‌కు ముడి సరకు ఇచ్చే అవకాశం లేదు. మూలధనం కింద నేరుగా నిధులు సమకూర్చే వీలు లేదు. ఆ తరుణంలో వైజాగ్‌ స్టీల్‌తో నేరుగా ఒప్పందం చేసుకుని.. నిధులు ఇవ్వాలంటే రాష్ట్రప్రభుత్వం సహకారం లేనిదే సాధ్యం కాదని సింగరేణి భావిస్తోంది.

నేటితో ఈవోఐ టెండరు దాఖలు గడువు దాటినా ఆ తర్వాతనైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే దరఖాస్తు చేయవచ్చని వైజాగ్‌ స్టీల్‌ అధికారులు సింగరేణికి సూచించారు. ఏటా 73 లక్షల టన్నుల ద్రవ రూప స్టీల్‌ తయారు చేయగల స్థాపిత సామర్థ్యం విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉంది. 20 వేల ఎకరాలకుపైగా భూమి కలిగిన ఆ పరిశ్రమ.. విశాఖలో ఉండటం వల్ల అభివృద్ధికి, లాభాల్లో నడపడానికి అవకాశాలున్నా ముడి సరకు కొరత తీవ్రంగా ఉందని సింగరేణి అధికారులు గుర్తించారు.

ముడి సరకులు సరఫరా చేసి, లేదా మూలధనం కింద నిధులు సమకూర్చి స్టీల్‌ ఉత్పత్తులను తీసుకునే పరస్పర ఒప్పందానికి ఆసక్తి గల సంస్థలు ఈవోఐ దాఖలు చేయాలని వైజాగ్‌ స్టీల్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. ముడి సరకు సమకూరిస్తే ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తారు? లేదా నిధులు ఇస్తే తిరిగి తీసుకునే ఇనుప ఉత్పత్తులు ఏమి కావాలనే వివరాలతో నివేదికను విడిగా తయారు చేసి.. ఈవోఐ టెండరుతో పంపాలని సూచించింది. ఇప్పటికే జిందాల్‌ స్టీల్, టాటా కంపెనీ వంటి ప్రైవేట్‌ సంస్థలు ముందుకొచ్చాయని అక్కడి అధికారులు చెప్పారు.

ఇవీ చూడండి..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

విశాఖ ఉక్కు బిడ్డింగ్​లో తెలంగాణ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details