ETV Bharat / bharat

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

author img

By

Published : Apr 2, 2023, 1:40 PM IST

KTR Letter to Central on Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్‌.. కార్పొరేట్లకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనంపై పరిశీలించాలని లేఖలో కోరారు.

KTR
KTR

KTR Letter to Central on Vizag Steel Plant : ఆంధ్రప్రదేశ్​లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా కేంద్రం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందన్న కేటీఆర్... వర్కింగ్ కాపిటల్, ముడి సరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

విశాఖ ఉక్కుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్​ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నమంత్రి కేటీఆర్... స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. ఒకప్పుడు సిమెంట్ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసిన ప్రభుత్వాలు... ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన ప్రధాని మోదీకి... వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయించాలన్న కేటీఆర్‌... ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని పేర్కొన్నారు. సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనంపై పరిశీలించాలని లేఖలో కోరారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు : సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్​తో పాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్​ను కాపాడాలన్న చిత్తశుద్ధి బీఆర్​ఎస్​కు ఉందన్న కేటీఆర్... వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరూ కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఏపీ బీఆర్​ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్​కు సూచించిన కేటీఆర్... కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపేందుకు లక్షలాది పీఎస్​యూ కార్మికులు బీఆర్​ఎస్​తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.