తెలంగాణ

telangana

'కన్నడ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. యడ్డీ-సిద్ధు రహస్య భేటీ!'

By

Published : Oct 13, 2021, 5:24 PM IST

Siddaramaiah and Yediyurappa meeting
సిద్ధరామయ్య, యడియూరప్ప సమావేశం ()

కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపు తిరగబోతుందా? సన్నిహితులపై ఐటీ దాడుల నేపథ్యంలో భాజపా సీనియర్ నేత యడియూరప్ప కమలదళానికి షాక్ ఇవ్వబోతున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్​ సీనియర్ నేత సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న కుమారస్వామి వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. అయితే... ఈ ఊహాగానాలన్నీ అవాస్తమని వారిద్దరూ తేల్చిచెప్పారు.

స్వామి వ్యాఖ్యలతో...

సిద్ధు, యడ్డీ సమావేశం అయ్యారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మంగళవారం మైసూరులో ఆరోపించారు. యడియూరప్ప సన్నిహితులపై ఐటీ దాడులకు ముడిపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన.

"రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోగలరు. యడియూరప్పకు చెక్​ పెట్టేందుకు ఈ ఐటీ దాడులు. రాజకీయ పరిణామాలపై సిద్ధరామయ్య, యడియూరప్ప మధ్య రహస్య భేటీ జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా ఆ విషయం తెలుసుకుంది. అందుకే ఐటీ దాడులతో యడియూరప్పను నియంత్రించాలని చూస్తోంది"

-కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

అన్నీ అవాస్తవాలే..

రహస్య భేటీ వార్తలను తోసిపుచ్చారు సిద్ధరామయ్య. అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కుమారస్వామికి సవాలు చేశారు. "గతంలో ఓసారి యడియూరప్పను ఆయన పుట్టినరోజు సందర్భంగా కలిశాను. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఆయన్ను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. మాకు కరోనా వచ్చి ఒకే ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన్ను కలవలేదు. యడియూరప్పను పదేపదే కలిసింది కుమారస్వామినే" అని అన్నారు సిద్ధరామయ్య.

కుమారస్వామి వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు యడియూరప్ప. సిద్ధాంతాల విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని, కర్ణాటకలో భాజపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. "2020 ఫిబ్రవరి 27న నా పుట్టినరోజునాడు మినహా ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యను నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. అసలు అలా కలవాల్సిన అవసరం కూడా నాకు లేదు" అని ట్వీట్ చేశారు యడ్డీ.

యడ్డీ వర్గంపై ఐటీ దాడులు

ఈ నెల 7న యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నిహితులపై జరిగిన ఐటీ సోదాల్లో.. లెక్కల్లో చూపించని రూ.750కోట్లు బయటపడ్డాయి. ఇందులో రూ.487కోట్ల ఆదాయాన్ని తాము లెక్కల్లో చూపించలేదని స్వయంగా ఆయా సంస్థల సభ్యులు అంగీకరించారు.

ఇదీ చూడండి:'కేంద్ర మంత్రిని తొలగిస్తేనే.. బాధితులకు న్యాయం'

ఇదీ చూడండి:'న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు'

ABOUT THE AUTHOR

...view details