తెలంగాణ

telangana

'జోడో యాత్ర నాకు తపస్సుతో సమానం.. కొందరి చేతుల్లోనే సంపద, మీడియా'

By

Published : Jan 8, 2023, 4:12 PM IST

rahul gandhi bharat jodo yatra
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

భారత్ జోడో యాత్రను తానొక తపస్సులా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జోడో యాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ద్వేషం, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు.

భయం, ద్వేషానికి వ్యతిరేకంగా తాను భారత్​ జోడో యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తెలిపారు. జోడో యాత్రకు దేశంలో అన్ని చోట్ల విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు రాహుల్​ పేర్కొన్నారు. జోడో యాత్ర తనకు తపస్సు వంటిదని ఆయన చెప్పారు. ఆదివారం హరియాణాలోని రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో ముచ్చటించారు.

దేశ ప్రజల గొంతుకను వినిపించడమే భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ యాత్ర చేస్తున్న సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నా. హరియాణాలో యాత్రకు విశేష స్పందన లభించింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో జోడో యాత్రకు స్పందన రాదని విమర్శించారు. కానీ మధ్యప్రదేశ్‌లో విపరీతమైన స్పందన వచ్చింది. భాజపా పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోనూ మంచి స్పందన లభించింది. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. సంపద, మీడియాను కొంతమంది వ్యక్తులే నియంత్రిస్తున్నారు. దేశ ప్రజల గొంతుకను అణిచివేస్తున్నారు. దేశాన్ని కులాలవారీగా, మతాలవారీగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి వ్యతిరేకంగానే ఈ భారత్ జోడో యాత్ర.

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

బాలుడితో రాహుల్ గాంధీ

కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టాలు రైతులపై దాడికి ఉపయోగించే ఆయుధాలని అన్నారు. ఇంధనం, యూరియా ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ తపస్సు చేసే సంస్థ. భాజపా, ఆర్​ఎస్​ఎస్​కు తపస్సు మీద గౌరవం లేదు. ఆ రెండు సంస్థలు పూజ చేసేవారిని మాత్రమే గౌరవించాలని కోరుకుంటాయి. ముఖ్యంగా వారినే మాత్రమే పూజించాలని అంటాయి.' అని రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు.
గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 2023 జనవరి 30న కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details